చెవిలోకి పురుగు వెళితే ఏం చేయాలి?
లైట్ల వెలుతురుకు ఇంట్లోకి ఎన్నో రకాల పురుగులు, కీటకాలు వస్తుంటాయి. మనం నిద్రపోయిన తర్వాత అవి చెవుల్లోకి కూడా వెళుతుంటాయి. మరి చెవుల్లోకి వెళ్లిన పురుగులు బయటకు రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

చాలా సార్లు నిద్రపోయినప్పుడు చెవుల్లోకి చీమ లేదా పురుగు వెళుతుంటాయి. కానీ దీనివల్ల చెవి లోపల ఎంత నొప్పి పెడుతుందో మాటల్లో చెప్పడం చాలా కష్టం. ఇవి చెవిలోంచి బయటకు వచ్చేంత వరకు నరకంలాగే ఉంటుంది. చాలా మందికి ఈ ఎక్సపీరియన్స్ అయ్యే ఉంటుంది.
ముఖ్యంగా పిల్లలకే ఇలా ఎక్కువగా జరుగుతుంటుంది. చెవిలోకి వెళ్లన చీమ లేదా పురుగు చెవి పొర వంటి భాగాలను కొరికి భరించలేని నొప్పిని కలిగిస్తుంది. నిజానికి చెవి చాలా సున్నితమైన అవయవం. కాబట్టి చెవులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అనుకోకుండా చెవిలోకి పురుగు లేదా చీమ వెల్లినప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తే అవి బయటకు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చెవిలో కీటకం
చీకటి గది
చెవిలోకి పురుగు వెళితే వెంటనే మీరు చేయాల్సిన పని చీకటి గదిలోకి వెళ్లండి. ఆ తర్వాత టార్చ్ లేదా మొబైల్ లైట్ ను ఆని చేసి చెవిలోకి వేయండి. ఎందుకంటే కొన్ని కీటకాలు వెలుతురు చూసి వెంటనే బయటకు వచ్చేస్తాయి.
ఆలివ్ లేదా బేబీ ఆయిల్:
బేబీ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ తో కూడా చెవిలోని పురుగు బయటకు వచ్చేలా చేయొచ్చు. మీ చెవిలోకి చీమ, పురుగు వంటి కీటకాలు వెళితే వెంటనే ఇంట్లో ఉన్న ఆలివ్ లేదా బేబీ ఆయిల్ కొన్ని చుక్కలను చెవిలోకి వేయండి. దీంతో అవి చెవిలో ఉండలేక బయటకు వచ్చేస్తాయి.
చెవిలో కీటకం
ఉప్పు నీళ్లు
ఉప్పు నీళ్లతో కూడా చెవిలో ఉన్న పురుగును బయటకు రప్పించొచ్చు. ఇందుకోసం గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు కలిపి కొన్ని చుక్కలను చెవిలో పోయండి. ఉప్పువాటర్ పురుగులకు నచ్చదు. కాబట్టి అవి వెంటనే చెవిలోంచి బయటకు వస్తాయి.
ఆల్కహాల్:
చెవిలో ఉన్న పురుగు బయటకు వచ్చేందుకు ఆల్కహాల్ లో దూదిని ముంచి చెవి లోపలి భాగంలో పెట్టండి. దీంతో పురుగు బయటకు రావడం మొదలుపెడుతుంది. ఒకవేళ ఇలా చేసినా బయటకు రాలేదంటే కొన్ని చుక్కల ఆల్కహాల్‌ను చెవిలో వేయండి. వెంటనే పురుగు బయటకు వస్తుంది.
ముఖ్య గమనిక:
1. చెవిలోకి పురుగు వెళ్తే బడ్స్ లేదా పిన్నీసులతో తీయడానికి ప్రయత్నించకండి. ఇలా చేస్తే పురుగు మరింత లోపలికి వెళ్లిపోతుంది. అంతేకాదు మీ చెవి పొర కూడా దెబ్బతింటుంది.
2. చెవిలోకి పురుగు పోతే వెంటనే వేలు పెట్టకండి. దీనివల్ల చెవి నొప్పి మరింత పెరుగుతుంది.
3. కొందరు చెవిలోకి పురుగు వెళ్తే అగ్గిపుల్లతో తీయడానికి ప్రయత్నిస్తారు. కానీ అలా అస్సలు చేయొద్దు. ఇది చెవిలోని వెంట్రుకలను చెవిలోపలికి నెట్టేస్తుంది. అంతేకాకుండా దీనివల్ల మీ చెవిలో సమస్య ఏర్పడి, కొన్నిసార్లు చెవి సరిగ్గా వినిపించదు.
4. నీళ్లు, నూనె పోసినా చెవిలో ఉన్న పురుగు బయటకు రాలేదంటే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. ముఖ్యంగా పిల్లలకు ఈ సమస్య వస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లాలి.
5. పురుగు మీ చెవిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా బయటకు వెళ్లేటప్పుడు చెవులను ఏదైనా కప్పుకోండి.