టీ ఎక్కువగా తాగే అలవాటుందా? ఈ విషయాలు తెలిస్తే మాత్రం ఇకపై అస్సలు తాగరు..
నిజానికి టీ అంత చెడ్డదేం కాదు. అదికూడా మితంగా తాగితే. బాగుంది కదా అనో.. పని ఎక్కువైందనో లేకపోతే మరే కారణంతోనైనా టీని కప్పులకు కప్పులు లాగించేస్తే మాత్రం మీ ఆరోగ్యాన్ని మీరే చేజేతులారా నాశనం చేసుకున్న వాళ్లు అవుతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలను తగ్గించడం నుంచి జీవక్రియను పెంచడానికి, బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడం, మెమోరీ పవర్ ను మెరుగుపర్చడానికి వంటి మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. నిజానికి ఈ రోజుల్లో టీని ఒకటికి మంచి ఎక్కువ కప్పులు తాగే వారు చాలా మందే ఉన్నారు. గంట గంటలకు కూడా తాగుతుంటారు కొంతమంది. మంచి అనే దానిలో కూడా చెడు ఉంటుంది. అతి ఏదీ మంచిది కాదు. ఏదైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి ప్రయోజనం జరుగుతుంది. టీ విషయంలో కూడా ఇది వర్తిస్తుంది.
ఎందుకంటే టీ ఆకుల్లో కెఫిన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా దెబ్బతీస్తుంది. రోజుకు 3 కప్పుల కంటే ఎక్కువ సార్లు టీ తాగడం వల్ల ఎలాంటి హాని జరగదు. కానీ 3 నుంచి 4 కప్పుల కంటే ఎక్కువగా టీ తాగడం వల్ల ప్రమాదకరమైన సమస్యలు వస్తాయి. అవేంటంటే..
టానిన్లు ఇనుము శోషణను తగ్గిస్తాయి
ఫుడ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. టీ , వైన్ వంటి పానీయాల్లో పాలీఫెనాల్ సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఈ పానీయాల రుచిని చేదుగా చేస్తాయి. 4 కప్పుల కంటే ఎక్కువ టీ తాగితే శరీరం ఇనుము శోషణను నిరోధిస్తుంది. అందుకే టీని మోతాదుకు మించి తాగకండి. ఇనుము ఎక్కువగా ఉండే ఆహారాలను తప్పకుండా తినండి. బచ్చలికూర, బీన్స్, గింజలు వంటి మొక్కల ఆహారాలలో ఇనుము పుష్కలంగా ఉంటుంది.
దంతాలు, ఎముకలు దెబ్బతింటాయి
పరిశోధకులు టీ బ్యాగులు, టీ ఆకుల్లో ఎక్కువ మొత్తంలో ఫ్లోరైడ్ ను కనుగొన్నారు. ఫ్లోరైడ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాలు, ఎముకలు, కీళ్ళు దెబ్బతింటాయి. అందుకే టీని ఎక్కువగా తాగడకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 4 కప్పుల కంటే తక్కువగానే తాగండి.
నిద్రపోవడంలో ఇబ్బంది, తలనొప్పి
టీలో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాఫీ కంటే తక్కువ. కప్పుకు 20, 60 మిల్లీగ్రాముల మధ్య ఉంటుంది. కానీ టీని ఎక్కువగా తాగితే మీ శరీరంలో కెఫిన్ కంటెంట్ పెరుగుతుంది. ఈ కెఫిన్ నిద్ర పట్టకుండా చేస్తుంది. అలాగే గుండెల్లో మంట, తలనొప్పి, ఆందోళన వంటి సమస్యలను కలిగిస్తుంది.
మలబద్ధకం
ముందే ఇది చలికాలం ఈ కాలంలో మన జీర్ణక్రియ నెమ్మదిగా పనిచేస్తుంది. దీనికి తోడు జీర్ణక్రియను కష్టపట్టే ఆహారాలనే ఎక్కువగా తింటుంటారు. వీటివల్ల జీర్ణవ్యవస్థపై అదనపు బారం పడుతుంది. ఇది కాస్త మలబద్దకానికి దారితీస్తుంది. ఇకపోతే టీలో థియోఫిలిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది కూడా మీ జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తుంది. దీంతో మీరు మలబద్దకంక సమస్య బారిన పడొచ్చు.
యాసిడ్ రిఫ్లక్స్
టీలో కెఫిన్ ఉంటుంది. ఇది ఇది ఇప్పటికే ఉన్న యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. లేదా గుండెల్లో మంటను కలిగిస్తుంది. అదనంగా కెఫిన్ కడుపులో గ్యాస్ ను మరింత ఎక్కువ చేస్తుంది.
గర్భధారణ సమస్యలు
గర్భిణిలు టీ తాగకపోవడమే మంచిది. ఎందుకుంటే ఇది గర్భస్రావానికి దారితీస్తుంది. లేదా పిల్లలు తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉంది. గర్భధారణ సమయంలో టీ ని అస్సలు తాగకూడదని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు.