సెలబ్రిటీలకు ఐస్ బాత్ అంటే ఎందుకంత పిచ్చో తెలుసా?
చాలా మంది సెలబ్రిటీలు ఐస్ బాత్ లు చేస్తున్న ఫోటోలను, వీడియోలను చూసే ఉంటారు. సెలబ్రిటీలే కాదు సామాన్యుల్లో కూడా ఈ ట్రెండ్ బాగా పెరిగింది. దీనిని క్రయోథెరపీ అని కూడా అంటారు. నిజానికి ఈ ఐస్ బాత్ వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే?
సోషల్ మీడియా పోకడలు కూడా జనాలను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. కేటరింగ్ నుంచి వెల్ నెస్ వరకు ప్రతిరోజూ ఏదో ఒక కొత్తది ట్రెండ్ అవుతుంటుంది. ఈ ట్రెండ్స్ లో ఐస్ బాత్ ఒకటి. తరచుగా సెలబ్రిటీలు ఐస్ బాత్ చేస్తున్న వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అసలు వాళ్లు అంత చలికి తట్టుకుని అది ఎందుకు చేస్తారు? దానివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? అని ఎప్పుడైనా ఆలోచించారా?
ఐస్ బాత్ అంటే ఏంటి?
ఐస్ బాత్ అంటే.. ఐస్ స్నానమనే చెప్పాలి. దీన్ని చల్లని నీటిలో డిప్ లేదా క్రియోథెరపీ అని కూడా అంటారు. దీనిలో వ్యక్తి 11 నుంచి 15 నిమిషాలు నీటిలో ఉంటాడు. ఈ నీటిని 50 నుంచి 59 డిగ్రీల ఫారెన్ హీట్ మధ్య చల్లబరుస్తారు. దీన్ని సాధారణంగా వ్యాయామం తర్వాత ఆరోగ్య ప్రయోజనాల కోసం అథ్లెట్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల వల్ల సెలబ్రిటీలు కూడా ఐస్ బాత్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అసలు ఐస్ బాత్ వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కండరాల పునరుద్ధరణ
ఐస్ బాత్ చేయడం వల్ల కండరాల పునరుద్ధరణ వేగవంతం అవుతుంది. అలాగే కండరాల గాయాలయ్యే ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది.
వాపును తగ్గిస్తుంది
భారీ వ్యాయామాలు లేదా శారీరక శ్రమ చేసిన తర్వాత ఐస్ బాత్ చేస్తే శరీర మంట, కండరాల నొప్పి చాలా వరకు తగ్గుతుంది.
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది
ఐస్ వాటర్ తో స్నానం చేయడం వల్ల దాని చల్లని ఉష్ణోగ్రత రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. ఇది రక్త ప్రవాహాన్ని, కండరాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచడానికి సహాయపడుతుంది.
మానసిక ఆరోగ్యానికి మేలు
ఐస్ వాటర్ తో స్నానం చేయడం వల్ల మానసిక ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఐస్ బాత్ వల్ల మీరు మంచి విశ్రాంతి తీసుకోగలుగుతారు. అలాగే ఇది నిరాశ, ఆందోళన లక్షణాలను తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది.
రోగనిరోధక వ్యవస్థ బలోపేతం
ఐస్ వాటర్ తో స్నానం చేయడం వల్ల మీ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఐస్ బాత్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది మీరు వ్యాధులు, అంటువ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.
చర్మానికి మేలు
ఆహారంతో పాటుగా ఐస్ బాత్ కూడా మన చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఐస్ - చల్లని ఉష్ణోగ్రతలు చర్మ రంధ్రాలను బిగుతుగా చేస్తాయి. అలాగే మంటను తగ్గిస్తాయి. అలాగే చర్మాన్ని కాంతివంతంగా చేసి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.