Water Heater : ఈ చలికాలంలో గీజర్, వాటర్ హీటర్ వాడుతున్నారా? అయితే ఈ సెప్టీ టిప్స్ మీకోసమే
చలికాలం వచ్చేసింది… దీంతో చాలామంది ప్రతిరోజు వాటర్ హీటర్ వాడుతుంటారు. ఈ క్రమంలో కరెంట్ షాక్, షార్ట్ సర్క్యూట్ లాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఈ 7 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి.

ఈ చలికాలం వాటర్ హీటర్ తో జాగ్రత్త..
చలికాలంలో వేడి నీళ్ల కోసం చాలా ఇళ్లలో వాటర్ హీటర్ లేదా గీజర్ వాడుతుంటారు. కానీ రోజూ వాడే ఈ ఎలక్ట్రానిక్ వస్తువులో చిన్న లోపం ఉన్నా కరెంట్ షాక్, అగ్నిప్రమాదం లాంటివి జరిగే ఛాన్స్ ఉంటుంది. నీళ్లు, కరెంట్ రెండింటితో ముడిపడి ఉన్న వస్తువు కాబట్టి గీజర్, హీటర్ వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వీటిని వాడేటప్పుడు చెక్ చేయాల్సిన 7 ముఖ్యమైన విషయాలు ఇవే
1. కరెంట్ వైర్లు డ్యామేజ్ అయ్యాయా?
గీజర్, వాటర్ హీటర్ లో కరెంట్ వైర్, ప్లగ్, స్విచ్‌లను అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి. వాటిపై పగుళ్లు, కాలిపోయిన మచ్చలు లేదా లూజ్ కనెక్షన్లు ఉన్నాయేమో చూడాలి.
• వైర్ పైన ఉండే కవర్ డ్యామేజ్ అయితే దాన్ని వాడకండి.
• ప్లగ్ లేదా స్విచ్ నుంచి మంటలు వచ్చినా, కాలిపోయిన వాసన వచ్చినా వెంటనే కరెంట్ ఆపేయండి.
• టేప్ వేసి తాత్కాలికంగా వాడటం మానుకోండి.
ముఖ్య గమనిక: తడి చేతులతో ప్లగ్ లేదా స్విచ్‌ను అస్సలు ముట్టుకోవద్దు.
2. ఎర్తింగ్ సరిగ్గా ఉందా?
గీజర్ లాంటి ఎక్కువ కరెంట్ లాగే వస్తువులకు సరైన ఎర్తింగ్ ఉండటం చాలా ముఖ్యం. ఒకవేళ గీజర్ బాడీకి కరెంట్ లీక్ అయితే, ఈ ఎర్తింగ్ వల్లే మనకు షాక్ కొట్టకుండా ఉంటుంది.
• మంచి ఎలక్ట్రీషియన్‌ను పిలిపించి ఎర్తింగ్ కనెక్షన్ చెక్ చేయించండి.
• ఎర్త్ వైర్ ఉన్నంత మాత్రాన అంతా సేఫ్ అని గుడ్డిగా నమ్మకండి.
• ఎర్తింగ్ కనెక్షన్‌ను ఎప్పుడూ తీసేయొద్దు, మార్చొద్దు.
3. బాత్రూమ్లో కరెంట్ లీకేజ్ సేఫ్టీ ఉందా?
గీజర్ ఉన్న కరెంట్ బోర్డుకు సరైన లీకేజ్ సేఫ్టీ పరికరం ఉండాలి. RCD లేదా RCCB లాంటివి ఉంటే, కరెంట్ లీక్ అయిన వెంటనే పవర్ కట్ చేస్తాయి. ముఖ్యంగా బాత్రూమ్ లాంటి తడిగా ఉండే చోట ఈ సేఫ్టీ చాలా అవసరం. సరైన సేఫ్టీ పరికరాన్ని ఎంచుకుని, దాన్ని ఫిట్ చేసే బాధ్యతను అనుభవజ్ఞుడైన ఎలక్ట్రీషియన్కే అప్పగించండి.
గమనిక: RCCB లేదా RCD ఉన్నంత మాత్రాన ప్రమాదాలు జరగవని అనుకోవద్దు. సరైన ఎర్తింగ్ కూడా కచ్చితంగా ఉండాలి.
4. నీళ్లు లీక్ అవుతున్నాయేమో చూడండి
గీజర్‌కు వెళ్లే పైపులు, జాయింట్లు, గీజర్ అడుగు భాగంలో తడిగా ఉందా లేదా నీళ్లు కారుతున్నాయా అనేది గమనించాలి.
• పైపుల జాయింట్ల దగ్గర నీళ్లు చుక్కలు చుక్కలుగా పడుతుంటే నిర్లక్ష్యం చేయకండి.
• గీజర్ లోపలి నుంచి నీళ్లు లీక్ అవుతున్నట్లు అనిపిస్తే వెంటనే వాడటం ఆపేయండి.
• కరెంట్ భాగాలపై నీళ్లు పడితే, తడి చేతులతో ముట్టుకోకుండా మెయిన్ ఆఫ్ చేసి టెక్నీషియన్‌ను పిలవండి.
గుర్తుంచుకోండి: చిన్న నీటి లీకేజీ కూడా పెద్ద ప్రమాదానికి దారి తీయొచ్చు.
5. ఓవర్ హీట్ కంట్రోల్ పనిచేస్తుందా?
గీజర్‌లో ఉండే థర్మోస్టాట్, నీళ్లు కావాల్సినంత వేడి అవ్వగానే హీటింగ్‌ను ఆపుతుంది. కొన్ని మోడల్స్‌లో నీళ్లు మరీ ఎక్కువ వేడెక్కితే కరెంట్ కట్ చేసే సేఫ్టీ సిస్టమ్ కూడా ఉంటుంది.
గీజర్ మామూలు కంటే ఎక్కువ వేడెక్కినా, ఆవిరి ఎక్కువగా వస్తున్నా, నీళ్లు మరీ ఎక్కువగా మరుగుతున్నా దాన్ని వాడకండి.
• టెంపరేచర్ కంట్రోల్‌ను మీరే సొంతంగా ఓపెన్ చేసి రిపేర్ చేయొద్దు.
• సేఫ్టీ సిస్టమ్స్‌ను ఆపేయడం లేదా మార్చడం లాంటివి చేయకండి.
• కంపెనీ నిబంధనల ప్రకారం టెక్నీషియన్‌తో చెక్ చేయించండి.
గీజర్‌లోని థర్మోస్టాట్, హీట్ కంట్రోల్ సిస్టమ్స్ మన ప్రాణాలను కాపాడే ముఖ్యమైన భాగాలు.
6. గీజర్ ప్రెజర్ సేఫ్టీ వాల్వ్ చెక్ చేయండి
నీళ్లు వేడెక్కుతున్నప్పుడు గీజర్ లోపల ప్రెజర్ పెరుగుతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి గీజర్ డిజైన్‌ను బట్టి ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ లేదా టెంపరేచర్ అండ్ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ ఇస్తారు.
• ఆ వాల్వ్ డ్యామేజ్ అయిందా, తుప్పు పట్టిందా లేదా నీళ్లు కారుతున్నాయా అనేది గమనించండి.
• వాల్వ్ నుంచి కంటిన్యూగా నీళ్లు వస్తుంటే వెంటనే చెక్ చేయించండి.
• వాల్వ్‌ను మూసేయడం లేదా అది పనిచేయకుండా చేయడం లాంటివి చేయొద్దు.
ముఖ్య గమనిక: అన్ని గీజర్లకు ఒకేలాంటి వాల్వ్ సిస్టమ్ ఉండదు. మీ మోడల్ మాన్యువల్ చదవండి. మీరే సొంతంగా వాల్వ్ ఓపెన్ చేసి టెస్ట్ చేయకండి.
7. వాడిన తర్వాత స్విచ్ ఆఫ్ చేస్తున్నారా?
చాలామంది గీజర్ ఆన్ చేసి, నీళ్లు వేడెక్కగానే స్నానానికి వెళ్లిపోతారు. కానీ, వాడకం అయిపోగానే స్విచ్ ఆఫ్ చేసే అలవాటు చేసుకోవడం చాలా మంచిది.
• నీళ్లు వేడెక్కగానే గీజర్ మాన్యువల్ ప్రకారం స్విచ్ ఆఫ్ చేయండి.
• స్నానం చేసేటప్పుడు గీజర్ ఆన్‌లో ఉంచకండి. మీ గీజర్ రూల్స్ ఫాలో అవ్వండి.
• స్విచ్ ఆఫ్ చేయడానికి తడి చేతులు వాడొద్దు.
• కరెంట్ పదే పదే పోతున్నా, కాలిపోయిన వాసన వచ్చినా, కరెంట్ లీక్ అవుతున్నట్లు అనిపించినా మళ్లీ ఆన్ చేయకండి.
గీజర్ వాడిన తర్వాత కచ్చితంగా స్విచ్ ఆఫ్ చేయాలని, ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వెంటనే వాడటం ఆపేయాలని ఎలక్ట్రికల్ సేఫ్టీ రూల్స్ చెబుతున్నాయి.








