ఇది పెట్టినా.. చుండ్రు లేకుండా పోతుంది
చాలా మందికి చుండ్రు సమస్య ఉంటుంది. ఈ చుండ్రు నెత్తిమీద దురదను కలిగించడమే కాకుండా.. విపరీతంగా వెంట్రుకలు ఊడిపోయేలా చేస్తుంది. కాబట్టి దీన్ని ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Dandruff
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో హెయిర్ ఫాల్, చుండ్రు ముందుంటాయి. ఇవి చాలా చిన్న సమస్యలుగా తీసిపారేస్తుంటారు. కానీ ఇవే అసలు సమస్యలు. ముఖ్యంగా చుండ్రు. అవును చుండ్రు వల్ల నెత్తి ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే వెంట్రుకలు విపరీతంగా రాలిపోతాయి. జుట్టు నిర్జీవంగా కనిపిస్తుంది.వెంట్రుకలు తెగిపోవడం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి.
చాలా మంది ఈ చుండ్రు తగ్గడానికి రకరకాల షాంపూలను పెడుతుంటారు. అయినా చుండ్రు మాత్రం పోనేపోదు. దీనివల్ల చాలా మందికి బట్టతల కూడా వస్తుంటుంది. అయితే మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం మీ నెత్తిమీద కొంచెం కూడా చుండ్రు ఉండదు. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
కొబ్బరి నూనె
కొబ్బరి నూనె మన ఆరోగ్యానికి, చర్మానికే కాదు మన జుట్టుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి నూనెను జుట్టుకు పెట్టడం వల్ల జుట్టు నల్లగా, పొడుగ్గా పెరగడంతో పాటుగా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఈ నూనెలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. అంటే దీన్ని తలకు పెట్టి కాసేపు మసాజ్ చేస్తే చుండ్రు లేకుండా పోతుంది.
టీట్రీ ఆయిల్
టీ ట్రీ ఆయిల్, కొబ్బరి నూనె కాంబినేషన్ కూడా నెత్తిమీద చుండ్రును పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం టీ ట్రీ ఆయిల్ ను, కొబ్బరి నూనెను సమానంగా తీసుకుని తలకు బాగా పట్టించాలి. ఆ తర్వాత కొద్దిసేపు తలను మసాజ్ చేయాలి. ఒక 30 నిమిషాల తర్వాత మీరు వాడే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.
కలబంద గుజ్జు
కలబంద గుజ్జులో ఎన్నో ఔషద లక్షణాలు ఉంటాయి. ఇవి మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. మన జుట్టుకు కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ కలబంద గుజ్జును ఉపయోగించి మీరు చుండ్రును తొందరగా తగ్గించుకోవచ్చు. ఇందుకోసం కలబంద గుజ్జును తలకు అప్లై చేసి కొద్దిసేపు బాగా మసాజ్ చేయాలి. ఒక 30 నిమిషాల తర్వాత షాంపూతో కడిగేస్తే సరిపోతుంది.
మెంతులు
మెంతులు కూడా మన జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని ఉపయోగించి జుట్టు బాగా పెరిగేలా, నల్లగా ఉండేలా చేయొచ్చు. అంతేకాదు ఇవి నెత్తిమీద చుండ్రు లేకుండా చేయడానికి కూడా సహాయపడతాయి. ఇందుకోసం మెంతులను మెత్తగా గ్రౌండ్ చేసి అందులో గుడ్డులోని తెల్లసొన, ఒక టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపండి. దీన్ని తలకు రాయండి. ఒక 15 నిమిషాల తర్వాత శుభ్రం చేస్తే సరిపోతుంది.
ఉల్లిపాయ రసం, నిమ్మరసం
ఉల్లిపాయ రసం, నిమ్మరసం కూడా చుండ్రును పూర్తిగా తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం నిమ్మరసాన్ని, ఉల్లిపాయ రసాన్ని సమానంగా తీసుకుని తలకు రాయాలి. కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేయాలి. ఇది చుండ్రు వల్ల కలిగే దురదను, చుండ్రును తగ్గించడానికి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
మాయిశ్చరైజింగ్ షాంపూ
చుండ్రు ఎన్నో కారణాల వల్ల వస్తుంది. అయితే ఇది పోవడానికి మీరు మంచి మాయిశ్చరైజింగ్ షాంపూను వాడటం అలవాటు చేసుకోవాలి. ఈ షాంపూ మీ నెత్తిమీదున్న చుండ్రును తగ్గించడమే కాకుండా.. జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది.