ట్రాన్స్‌జెండర్ స్త్రీలకు పీరియడ్స్ వస్తాయా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేసిన సెలెబ్రిటీ
సాధారణంగా అమ్మాయిలకు ప్రతినెలా పీరియడ్స్ వస్తాయి. అయితే ఎంతో మందికి ట్రాన్స్ జెండర్ మహిళలకు వస్తాయా? రావా? అన్న సందేహం ఉంటుంది. దీనికి క్రికెటర్ సంజయ్ బంగర్ కూతురు అనయా బంగర్ సోషల్ మీడియా వేదికగా సమాధానం చెప్పింది.

ప్రతి నెలా పీరియడ్స్ ఎందుకు?
ఋతు చక్రం అనేది స్త్రీ శరీరంలో సహజంగా జరిగే ఒక ప్రక్రియ. ప్రతినెలా పీరియడ్స్ రూపంలో స్త్రీల గర్భాశయంలోని లైనింగ్ రక్తం, కణజాలాలతో కలిసి బయటికి వస్తుంది. అమ్మాయిలకు 12 ఏళ్ల నుంచి 15 ఏళ్ల మధ్యలో ఈ పీరియడ్స్ అనేవి మొదలవుతాయి. అయితే ఎంతోమంది ట్రాన్స్ జెండర్ మహిళలు ప్రపంచంలో ఉన్నారు. చాలామందికి ట్రాన్స్ జెండర్ మహిళలకు ప్రతినెలా పీరియడ్స్ వస్తాయా? రావా? అనే సందేహం ఉంది.
ఆర్యన్ నుంచి అనయా బంగర్ వరకు
ఈ సందేహాన్ని క్రికెటర్ సంజయ్ బంగర్ కుమార్తె అనయా బంగర్ ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకుంది. సంజయ్ బంగర్ మాజీ క్రికెటర్ అతనికి ఆర్యన్ అనే కొడుకు ఉన్నాడు. ఆర్యన్ కూడా మంచి క్రికెటర్. తర్వాత అనయా బంగర్ గా మారాడు. శస్త్ర చికిత్స చేసుకొని పూర్తిగా అమ్మాయి రూపాన్ని పొందాడు. ఆ సమయంలో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఎంత కష్టంగా ఉంటుందో కూడా తన అనుభవాన్ని పంచుకున్నాడు. అమ్మాయిగా మారాక క్రికెట్ ను వదులుకోవాల్సి వచ్చిందని తన త్యాగాలను కూడా ఇంస్టాగ్రామ్ రీల్ లో అప్పుడప్పుడు తన అభిమానులకు వివరించేది. ఇప్పుడు అనయా బంగర్ తన సోషల్ మీడియా ఖాతాలో ట్రాన్స్ జెండర్ విమెన్ కి పీరియడ్స్ వస్తాయా? రావా? అన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది.
హిజ్రాలకు పీరియడ్స్ రావా?
అనయా బంగర్ చెప్పిన ప్రకారం ట్రాన్స్ జెండర్ మహిళకు ఎలాంటి పీరియడ్స్ రావు. ఈ మహిళ శరీర నిర్మాణం బయటికి పూర్తిగా అమ్మాయిలా మారినా.. లోపల శరీర నిర్మాణం మాత్రం భిన్నంగా ఉంటుంది. జీవ ప్రక్రియ పుట్టుకతోనే స్త్రీ శరీరానికి వేరేగా ఉంటుంది. స్త్రీలకు అండాశయాలు, గర్భాశయాలు వంటివి ఉంటాయి. కానీ ట్రాన్స్ జెండర్ మహిళలకు అండాశయాలు. గర్భాశయాలు వంటివి ఉండవు. కాబట్టి దీనికి పీరియడ్స్ వచ్చే అవకాశము లేదు.
మూడ్‌స్వింగ్స్ ఎక్కువ
ట్రాన్స్ జెండర్లకు పీరియడ్స్ రాకపోయినా మహిళల మాదిరిగానే నెలలో కొన్ని రోజులు మానసిక స్థితిలో విపరీతమైన మార్పులను అనుభవిస్తామని అనయా బంగర్ చెబుతోంది. మూడ్‌స్వింగ్స్ అధికంగా ఉంటాయని వివరిస్తోంది. ఆ సమయంలో మానసికంగా, శారీరకంగా చాలా సున్నితంగా ఉంటామని చెప్పింది.
ట్రాన్స్ జెండర్ పురుషులకు వస్తాయి
ట్రాన్స్ జెండర్ అమ్మాయిలలాగే ట్రాన్స్ జెండర్ అబ్బాయిలు కూడా ఉంటారు. అంటే పుట్టుకతో అమ్మాయిగా ఉన్నవారు తర్వాత అబ్బాయిగా శస్త్ర చికిత్స చేసుకొని మారుతారు. అలాంటి వారికి మాత్రం పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంది. అది వారి శరీరంలో స్త్రీ పునరుత్పత్తి అవయవాలపై ఆధారపడి ఉంటుంది. ట్రాన్స్ జెండర్ పురుషుడిగా మారిన వ్యక్తికి గర్భాశయం, అండాశయాలు ఉంటే అతనికి ప్రతి నెలా ఋతుస్రావం కావచ్చు. వారు శస్త్ర చికిత్సలో భాగంగా గర్భాశయాన్ని తొలగించుకుంటే మాత్రం వారికి పీరియడ్స్ వచ్చే అవకాశం లేదు. కొంతమంది ట్రాన్స్ జెండర్ పురుషులుగా మారిన వారు పీరియడ్స్ ను ఆపేందుకు హార్మోన్ థెరపీని కూడా తీసుకుంటారు. ఇందులో భాగంగా శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలను పెంచేస్తారు. దీని వల్ల ఋతుస్రావం ఆగిపోతుంది.