మీ పాపాయి బాడీ మసాజ్ కోసం ఉపయోగించాల్సిన బెస్ట్ ఆయిల్స్ ఇవే..
శిశువు కండరాల పెరుగదలకు, ఎముకల బలం కోసం బాడీ మసాజ్ చేయడం చాలా ముఖ్యం. ఇందుకోసం ఎలాంటి నూనెలను వాడాలో చాలా మందికి తెలియదు. అయితే కొన్ని రకాల నూనెలను వాడితే పిల్లల ఎదుగుదల బాగుంటుంది.
నవజాత శిశువుల సంరక్షణకు బాడీ మసాజ్ చాలా కీలకమైన దశ. బాడీ మసాజ్ వల్ల శిశువు ఎముకలు, కండరాలు బలోపేతం అవుతాయి. దీనివల్ల పిల్లల ఎదుగుదల కూడా సరిగ్గా ఉంటుంది. అందుకే అప్పుడే పుట్టిన పిల్లలకు రోజూ బాడీ మసాజ్ చేస్తారు. బాడీ మసాజ్ బాగా చేసిన పిల్లలు ఒక సంవత్సరం కూడా నిండకముందే దొగ్గాడటం, నడవడం ప్రారంభిస్తారు. అయితే మసాజ్ తో పాటుగా బేబీ మసాజ్ కోసం మీరు ఉపయోగిస్తున్న నూనె కూడా ముఖ్యమంటున్నారు నిపుణులు. మార్కెట్ లో బేబీ మసాజ్ ఆయిల్స్ చాలానే దొరుకుతాయి. కానీ పిల్లలకు సాంప్రదాయ నూనుతో మసాజ్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి సేంద్రీయమైనవి. వీటిలో మీ బిడ్డను బలంగా చేయడానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పాపాయి బాడీ మసాజ్ కోసం ఉత్తమ నూనెల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఆవనూనె
సాంప్రదాయకంగా.. చాలా భారతీయ గృహాలలో బేబీ మసాజ్ కోసం ఆవ నూనెను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆవనూనె శిశువు ఎముకలను, కండరాలను బలోపేతం చేయడానికి మంచిదని నిరూపించబడింది కూడా. ముఖ్యంగా ఇది పిల్లల శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. నవజాత శిశువులు న్యుమోనియా బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. కాగా ఆవ నూనెతో వారి శరీరాలను మసాజ్ చేయడం వల్ల వారిని వెచ్చగా ఉంచుతుంది. అలాగే జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ముఖ్యంగా శీతాకాలంలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల శిశువు ఆరోగ్యం దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి. ఆవ నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి చర్మ ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి.
బాదం నూనె
బేబే బాడీ మసాజ్ కోసం బాదం నూనె ఉత్తమమైందని చాలా మంది నమ్ముతారు. ఎందుకంటే దీనిలో ఉండే విటమిన్ ఇ చర్మం, జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. నవజాత శిశువుల చర్మం డ్రై గా మారడం, ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. బాదం నూనెను రాయడం వల్ల చర్మ సమస్యలు వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. అలాగే ఈ నూనెతో మసాజ్ చేయడం వల్ల శిశువు జుట్టు బాగా పెరుగుతుంది. అలాగే వారి రంగు కూడా మెరుగుపడుతుంది. మొత్తం మీద బాదం నూనెతో క్రమం తప్పకుండా బాడీ మసాజ్ చేయడం వల్ల నవజాత శిశువులలో ఎముకలు బలంగా ఉంటాయి. చర్మం మృదువుగా ఉంటుంది. జుట్టు పెరుగుదల బాగుంటుంది.
coconut oil
కొబ్బరి నూనె
శిశువులకు మసాజ్ చేయడానికి ఎక్కువగా ఉపయోగించే నూనెల్లో కొబ్బరి నూనె రెండో ప్లేస్ లో ఉంటుంది. కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి కండరాలను బలంగా చేస్తాయి. కొబ్బరి నూనెలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. దీన్ని తలకు అప్లై చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. జుట్టు మందంగా, నల్లగా పెరగడానికి హెయిర్ మసాజ్ కోసం దీనిని ఉపయోగించొచ్చు.
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శిశువుల చర్మ కణాలను నిర్మిస్తాయి. ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల ఎముకలు బలోపేతం అవుతాయి. అలాగే పెరుగుదల బాగుంటుంది. శిశువును చురుకుగా చేయడానికి కూడా ఈ నూనె సహాయపడుతుంది. అలాగే వారి చర్మం మృదువుగా, మెత్తగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఆలివ్ ఆయిల్ వారి చర్మాన్ని తేమగా ఉంచుతుంది. మీ బిడ్డకు ఇతర నూనెలతో అలెర్జీ ఉంటే.. మసాజ్ కోసం ఆలివ్ నూనెనె ఉపయోగించండి.
నువ్వుల నూనె
నువ్వుల నూనెను కూడా పిల్లల బాడీ మసాజ్ కోసం ఉపయోగించొచ్చు. ఈ నూనె కూడా ఇతర నూనెల మాదిరిగానే ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ చాలా మంది తల్లులు శిశువు మసాజ్ కోసం అస్సలు ఉపయోగించరు. కారణం ఇది చాలా అంటుకుంటుందని. కానీ నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో మీ బిడ్డ మరింత చురుగ్గా ఉంటాడు. అలాగే త్వరగా బలాన్ని పొందుతుంది. నువ్వుల నూనె మసాజ్ వల్ల నవజాత శిశువుల్లో చర్మ ఇన్ఫెక్షన్ల ప్రమాదం తగ్గుతుంది.
ఈ ఐదు నూనెలు బేబీ మసాజ్ కు ఉత్తమమైనవి. ఎందుకంటే వీటిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. శిశువుకు సరైన పోషణను కూడా అందిస్తాయి. అయితే వీటిని ఉపయోగించడానికి ముందు ప్యాచ్ టెస్ ను చేయడం మంచిది.