తెలంగాణలో కొలువుల జాతర.. త్వరలోనే భారీగా టీచర్ పోస్టుల నియామకం..
తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు రానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడతామని ప్రకటించిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. అయితే దీనికి సంబంధించి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దశల వారిగా నోటిఫికేషన్లు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
మొత్తం 1.20లక్షల టీచర్ పోస్టులకు ప్రస్తుతం 1.02 లక్షల మంది పనిచేస్తున్నారని అధికారులు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం 18వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
అంతేకాకుండా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 18 వేల టీచర్ పోస్టులను జిల్లాలుగా విభజించి కేటాయిస్తారని తెలుస్తుంది. ఈ 18వేల పోస్టులు కాకుండా మరో 1500 బోధనేత, డైట్, బీఈడీ కాలేజీలు, విద్యాశాఖ కార్యాలయాల్లో పోస్టులను కూడా జిల్లాల వారీగా విభజించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కేడర్ విభజనలో ఎస్‌జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్స్, పీఈటీలను జిల్లా స్థాయి క్యాడర్‌గా నిర్ణయించారు. ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్ల వంటి పోస్టులను జోనల్, మల్టీ జోన్‌ల పరిధిలోకి తీసుకురానున్నారు.
రాష్ట్ర స్థాయి కార్యాలయాలైన పాఠశాల విద్య కమిషనరేట్, ఎస్‌సీఈఆర్‌టీ వంటి వాటిల్లో పనిచేస్తున్న సిబ్బంది, ఇతర అధికారుల పోస్టులను రాష్ట్ర స్థాయి పోస్టులుగా గుర్తించారు.
గతంలో కూడా రాష్ట్రంలో భారీగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కానీ కేవలం 7వేల పైగా పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసారు. మరి ఈసారైనా మెగా డీఎస్సీ ఉంటుందా లేదా అని టీచర్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అధికారులు రెండు రోజుల్లో జిల్లాల వారీ కేడర్ పోస్టుల విభజన జాబితాలను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉందని సమాచారం.