ప్రపంచంలోనే పొడవైన పేరు..2253 పదాలేంటి సామీ..!
worlds Longest Name : మీరు ఒకే పదంతో పేరు వినుంటారు… మరీ పెద్దదైతే నాలుగైదు పదాలతో పేరు వినుంటారు. 2253 పదాలు పదాలతో కూడిన పేరుందని మీకు తెలుసా? ప్రపంచంలో ఇదే అతిపెద్ద పేరు.

పేరుతో గిన్నిస్ బుక్ రికార్డు
Worlds Longest Name : ఒక్కో దేశంలో మనుషులకు పేరుపెట్టే సంస్కృతి, పద్ధతి, సంప్రదాయం ఒక్కోలా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని బట్టే కాదు కులం, మతం, స్థానిక సాంప్రదాయాలను బట్టి కూడా పేర్లు పెట్టుకుంటారు. భారతదేశంలో తరచుగా ఊరి పేరు, తండ్రి పేరు, వ్యక్తి పేరు కలిసి ఉంటాయి. అరబ్ దేశాల్లో వంశం, కుటుంబం పేర్లు ఉంటాయి. పాశ్చాత్య దేశాల్లో క్రైస్తవ మతం ప్రకారం చాలా పొడవైన పేర్లు పెట్టుకుంటారు.
అయితే న్యూజిలాండ్‌కు చెందిన లారెన్స్ వాట్కిన్స్ అత్యంత పొడవైన పేరుతో కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సృష్టించాడు. ఇప్పుడు ప్రపంచంలోనే లారెన్స్ వాట్కిన్స్ పేరు అత్యంత పొడవైనది. ఇది దాదాపు 2000 కంటే ఎక్కువ పదాలతో ఉంది. మార్చి 1990లో లారెన్స్ తన పేరును చట్టబద్ధంగా మార్చుకుని సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
లారెన్స్ వాట్కిన్స్ పేరులో ఎన్ని పదాలున్నాయి?
గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం... లారెన్స్ పేరులో మొత్తం 2253 పదాలు ఉన్నాయి. తనకు ఎప్పుడూ ఇలాంటి ప్రత్యేకమైన, సరదా రికార్డులు గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేదని... ఈ క్రమంలోనే తానే స్వయంగా ఒక రికార్డు సృష్టించాలనుకున్నానని లారెన్స్ చెబుతున్నాడు. సరికొత్త రికార్డు సృష్టించడానికి అతను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పుస్తకాన్ని చూశాడు... పొడవైన పేరు రికార్డులను బద్దలు కొట్టగలదని గ్రహించాడు.
ఆ రోజుల్లో ఇంటర్నెట్, కంప్యూటర్ల వాడకం తక్కువగా ఉండేది. అందుకే పూర్తి జాబితాను టైప్ చేయడానికి లారెన్స్ కు వందల డాలర్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. జిల్లా కోర్టు అతని పేరు దరఖాస్తును ఆమోదించింది, కానీ రిజిస్ట్రార్ జనరల్ దానిని తిరస్కరించారు. ఆ తర్వాత అతను హైకోర్టులో అప్పీల్ చేయగా, తీర్పు అతనికి అనుకూలంగా వచ్చింది. ఆ వెంటనే న్యూజిలాండ్‌లో ఇలాంటి కేసులను నివారించడానికి రెండు కొత్త చట్టాలు చేశారు.
లారెన్స్ అంత పొడవైన పేరు ఎలా పెట్టుకున్నాడు?
లారెన్స్ గతంలో ఒక లైబ్రరీలో పనిచేసేవాడు. అతను పుస్తకాల సహాయం, సహోద్యోగుల సలహాతో తన కోసం ఒక పేరును ఎంచుకున్నాడు. తనకిష్టమైన పేరు AZ2000 అని, అంటే తన దగ్గర A నుండి Z వరకు 2000 పేర్లు ఉన్నాయని లారెన్స్ చెప్పాడు. పేరు పొడవుగా ఉండటం వల్ల లారెన్స్‌కు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ పత్రాలు, గుర్తింపు కార్డులలో పూర్తి పేరు పట్టదు. కానీ అదేపేరు తనకు గుర్తింపు తెచ్చిపెట్టింది కాబట్టి సమస్యలు ఎదురైనా ఓపికగా బరిస్తున్నానని అంటున్నాడు.