డార్క్ చాక్లెట్ తో ఇన్ని లాభాలా..!
World Chocolate Day 2023: ప్రతి ఏడాది జూలై 7 న ప్రపంచ చాక్లెట్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా చాక్లెట్ మనకు ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

World Chocolate Day 2023: చాక్లెట్ ను ఇష్టపడని వారు చాలా తక్కువ. ఎందుకంటే చాక్లెట్స్ తీయగా, టేస్టీగా ఉంటాయి. నిజానికి చాక్లెట్ కూడా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా స్వచ్ఛమైన డార్క్ చాక్లెట్ లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరుల్లో ఇవీ ఒకటి. అసలు డార్క్ చాక్లెట్లు మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మెదడు బలోపేతం
నాటింగ్హామ్ విశ్వవిద్యాలయం జరిపిన అధ్యయనం ప్రకారం.. డార్క్ చాక్లెట్లను తిన్న రెండు మూడు గంటల్లో మెదడు పనితీరు మెరుగైంది. డార్క్ చాక్లెట్లలో ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను విస్తరిస్తాయి. అలాగే ఆక్సిజన్, రక్తం మెదడులోకి పుష్కలంగా వెళ్లడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇవి అలసట, వృద్ధాప్యం సమస్యలను తగ్గిస్తాయి.
కంటిచూపు పెరుగుతుంది
క్యారెట్లే కాదు డార్క్ చాక్లెట్లు కూడా కంటిచూపును మెరుగుపరుస్తాయని ఫిజియాలజీ అండ్ బిహేవియర్ జర్నల్ లో ప్రచురించిన పరిశోధనలో తేలింది. డార్క్ చాక్లెట్ లోని పోషకాలు రెటీనా, మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతాయి. దీంతో కంటిచూపు మెరుగు పడుతుంది. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
శరీర మంట
డార్క్ చాక్లెట్స్ పోషకాలకు మంచి వనరు. అంతేకాదు వీటిలో యాంటీ ఆక్సిండెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడానికి, వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి, వృద్ధాప్య ప్రక్రియను మందగించడానికి సహయపడతాయంటున్నారు నిపుణులు. డార్క్ చాక్లెట్ లోని ఫ్లేవనోల్స్ ధమనులను ఆరోగ్యంగా ఉంచుతాయి.
చర్మ ఆరోగ్యం
సూర్యుడి నుంచి విడుదలయ్యే అతినీలలోహిత కిరణాలు, కాంతి మన చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అయితే డార్క్ చాక్లెట్ వీటి ప్రభావాలను తగ్గించడానికి సహాయపడుతుంది. కోకోబీన్స్ ను తింటే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే నాణ్యత కలిగిన డార్క్ చాక్లెట్ ను తిన్నా సన్ డ్యామేజ్ తగ్గుతుంది.
రక్తపోటు
అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ నుంచి వచ్చిన పరిశోధన ప్రకారం.. అధిక రక్తపోటు పేషెంట్లకు డార్క్ చాక్లెట్ మంచి మేలు చేస్తుంది. రోజుకు ఒకక ముక్క డార్క్ చాక్లెట్ ను తింటే రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు స్థాయిలను కూడా తగ్గిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది
అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రచురించిన పరిశోధన ప్రకారం.. కోకో పౌడర్, డార్క్ చాక్లెట్ లోని పాలీఫెనాల్స్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అలాగే గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది.