ఇంట్లో ఎలుకలు ఉంటే ఏమౌతుందో తెలిస్తే షాకే..!
ఎలుకలు చాలా మంది ఇళ్లలో ఉంటాయి. వీటిని పట్టుకోవడం అంత సులువైన పని కాదు. కాదు ఇంట్లో ఎలుకలు ఉంటే లేనిపోని రోగాలొచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లో ఎలుకల బెడద చాలా మందికి ఉంటుంది. వీటిని ఇంట్లోంచి తరిమికొట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా.. ఎలుకలు మాత్రం పోవు. ఎలుకలు ఇంట్లో ఉన్న బియ్యం సంచులను, పుస్తకాలను, పేపర్లను, తినుబండారాలను కొరికి నాశనం చేస్తుంటాయి. అంతేకాదు చాలా సార్లు బట్టలను కూడా కొరికేస్తుంటాయి. వీటివల్ల ఎప్పుడు ఏం నాశనమవుతాయో తెలియదు. నిజంగా ఇంట్లో ఎలుకలు ఉండటం పెద్ద తలనొప్పే. అలాగే ఇవి ఇంటి పరిశుభ్రతను కూడా పాడుచేస్తాయి.
కానీ వీటన్నింటి కంటే ఎలుకలు మన ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా పరిణమిస్తాయనే నిజం చాలా మందికి తెలియదు. అవును ఎలుకలు మనకు ఎన్నో రోగాలొచ్చేలా చేస్తాయి. ముఖ్యంగా ఎలుక జ్వరం. ఎలుక జ్వరం గురించి కొంతమందికి తెలిసినా.. దీనివల్ల ఏమీ కాదులే అని లైట్ తీసుకుంటారు. కానీ ఎలుక జ్వరం మాత్రమే కాదు ఎలుకలు ఎన్నో వ్యాధులకు కారణమవుతాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఎలుకల జ్వరం...
ఎలుక జ్వరం ఎలుకల వల్ల కలిగే ఒక వ్యాధి. లెప్టోస్పైరా అనేది మానవులు, జంతువులలో 'లెప్టోస్పైరా' అనే బ్యాక్టీరియా వల్ల కలిగే సంక్రమణ. ఎలుక జ్వరం ఎంత ప్రమాదకరమైన వ్యాధి అంటే.. సరైన చికిత్స చేయకపోతే మరణం దాకా వెళ్లొచ్చు. ఎలుక జ్వరం మెదడు, కాలేయం, ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. వ్యాధికారక బ్యాక్టీరియా ఎలుకల విసర్జన ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది.
rats
ఎలుక కాటు జ్వరం..
ఇది కూడా ఎలుక జ్వరం లాగా అనిపించొచ్చు. కానీ ఇది ఎలుకల మలవిసర్జన ద్వారా, అలాగే ఎలుక కొరకడం లేదా గోర్లతో గీరడం వల్ల మానవ శరీరంలోకి ప్రవేశించే రెండు రకాల బ్యాక్టీరియా వల్ల కలిగే సంక్రమణ. 'స్ట్రెప్టోబాసిల్లస్ మోనిలిఫార్మిస్', 'స్పిరిల్లమ్ మైనస్' వంటి బ్యాక్టీరియా వల్ల రాట్ బైట్ జ్వరం వస్తుంది. చికిత్స తీసుకోకపోతే ఇది ప్రాణాంతకంగా మారుతుంది.
సాల్మొనెల్లోసిస్...
సాల్మొనెల్లోసిస్ అనేది సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్. ఇది ఎన్నో జంతువులు, పక్షుల పేగుల లోపల కనిపించే బ్యాక్టీరియా. ఇది మలమూత్రాల ద్వారా బయటకు వచ్చి ఏదో ఒక పద్ధతి ద్వారా అంటే కలుషితమైన ఆహారం, వాటర్ వంటి మార్గాల ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించినప్పుడు వస్తుంది.
సాధారణంగా సాల్మొనెల్లోసిస్ చాలా ప్రమాదకరమైన సమస్యేం కాదు. కానీ గర్భిణీ స్త్రీలు, పిల్లలు, అవయవ మార్పిడి చేసుకున్న వారు, వృద్ధులతో పాటుగా తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారిలో సాల్మొనెల్లోసిస్ సమస్యలు వస్తాయి.
ప్లేగు..
ప్లేగు గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ప్లేగు మహమ్మారిగా వచ్చి ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న చరిత్ర ఉంది. అయితే ప్రస్తుతం ప్లేగు వ్యాధికి సమర్థవంతమైన మందు ఉంది. అయినప్పటికీ.. ఆసియా,ఆఫ్రికాలో ప్లేగు ముప్పు ఇప్పటికీ ఉంది. ఇది ఎలుకల వల్ల కూడా వస్తుంది.