అసలు పిల్లలు ఎందుకు ఆడుకోవాలో తెలుసా?
చిన్న పిల్లలు కుదురుగా ఒక్క దగ్గర ఉండరు. వాళ్లను ఎంత ఆపినా కొంటె పనులు చేస్తూనే ఉంటారు. అందుకే అల్లరికి విసిగిపోయిన తల్లిదండ్రులు ఏమన్నా చేయని అని పిల్లల్ని వాళ్లంతట వాళ్లను ఆడుకోనిస్తారు. నిజానికి పిల్లల్ని ఒకే దగ్గర ఉంచడం లేదా కట్టడి చేయడం మంచిది కాదు. శారీరకంగానే కాదు మానసికంగా కూడా మంచిది కాదు. మీకు తెలుసా? పిల్లలు ఆరుబయట ఆడుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ఫోన్లు, ల్యాప్ టాప్ లు, టీవీల కారణంగా పిల్లల అవుట్ డోర్ యాక్టివిటీస్ చాలా వరకు తగ్గిపోయాయి. బయటకు వెళ్లి ఆడుకోవడానికి బదులుగా పిల్లలు ఫోన్ తోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. కానీ ఇదివారి శారీరక, మానసిక ఎదుగుదలను ప్రభావితం చేస్తుంది. మీ పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మాత్రం వారిని ఖచ్చితంగా ఆడుకోనివ్వండి. అంటే ఆరుబయట గేమ్స్ ఆడేలా చూడండి. మొబైల్ లో గేమ్స్ ఆడటానికి బదులుగా.. బయట ఆడుకోమని చెప్పండి. పిల్లలు రెగ్యులర్ గా కొంచెం ఆరుబయట ఏదో ఒక గేమ్ ను ఆడటం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు.
kids
వయసును బట్టి పిల్లలు శారీరక శ్రమ చేయాలి. అంటే ఏడాది నుంచి 5 సంవత్సరాల వయసున్న పిల్లలు రోజుకు కనీసం 1 గంట శారీరక శ్రమ చేయాలి. అంటే గేమ్స్ నుంచి సైక్లింగ్, స్విమ్మింగ్ వరకు ఏదైనా చేయొచ్చన్నమాట. అలాగే 6 నుంచి 17 సంవత్సరాల పిల్లలకు అదే వర్తిస్తుంది. అయితే చదువు కారణంగా సమయాన్ని మేనేజ్ చేయలేకపోతే వారానికి కనీసం మూడు రోజులకు వాళ్ల యాక్టివిటీకి షెడ్యూల్ తయారు చేయండి. పిల్లలు గేమ్స్ ఆడటం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
శారీరక ఎదుగుదల
పిల్లలు వారి వయసుకు తగ్గట్టు శారీరకంగా ఎదగాలంటే వారి ఆహారంలో మంచి పోషకాహారాన్ని చేర్చాలి. అలాగే శారీరక కార్యకలాపాల్లో పాల్గొనేలా చేయాలి. పిల్లలు ఆరుబయట ఆడుకోవడం వల్ల.. వారిలో కండరాలు, ఎముకలు అభివృద్ధి చెందుతాయి. ఇది ఎముకలకు సంబంధించిన ఎన్నో వ్యాధుల నుంచి రక్షించడానికి ఎంతో సహాయపడుతుంది.
బరువు అదుపులో
పిల్లలు హెల్తీ ఫుడ్స్ కు బదులుగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ను తింటే విపరీతంగా బరువు పెరిగిపోయి ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. అందుకే పిల్లల్ని జంక్ ఫుడ్ కు అలవాటు చేయకండి. ఒకవేళ ఈ అలవాటును మానుకోకపోతే వారిని ఆరుబయట ఆడుకునేలానైనా చేయండి. ఎందుకంటే ఇది పిల్లల ఊబకాయాన్ని అదుపులో ఉంచుతుంది.
రోగనిరోధక శక్తి
గేమ్స్ కూడా శారీరక శ్రమే కాబట్టి.. పిల్లలు ఆరుబయట ఆడుకోవడం వల్ల కూడా వాళ్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఏ రకమైన వ్యాయామం చేసినా అది మన కండరాలను నిమగ్నం చేస్తుంది. వాటి పని సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. మూత్రపిండాల నుంచి ఊపిరితిత్తుల వరకు కాలేయం తమ పనిని సక్రమంగా చేయగలుగుతాయి. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండటం వల్ల మీ పిల్లలు ఎన్నో అంటువ్యాధులకు, ఇతర రోగాలకు దూరంగా ఉంటారు.