జెమీమా జీసస్ అంటే తప్పేంటి?
Jemimah Rodrigues : టీమిండియా వరల్డ్ కప్ స్టార్ జెమీమా రోడ్రిగ్స్ అద్భుత ఆటతీరుతో ప్రశంసలు పొందాల్సింది ఒక్క మాటతో వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ‘జీసస్’ పేరు ఎత్తడంపై వివాదం కొనసాగుతోంది. నిజంగానే ఆమె మాటలు తప్పా? అయితే ఇవేంటి…

జెమీమాను టార్గెట్ చేస్తున్నారా..?
Jemimah Rodrigues : ఐసిసి ఉమెన్స్ ప్రపంచ కప్ సాధించి యావత్ దేశాన్ని గర్వపడేలా చేశారు మన అమ్మాయిలు.. భారత నారీ శక్తిని ప్రపంచానికి చాటిచెప్పారు. ఈ పురుషాధిక్య సమాజంలో శతాబ్దాలుగా అణచివేతకు గురవుతూ వచ్చిన వనితలు ఇప్పుడు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. అంతరిక్షం నుండి ఆటల వరకు అన్నింటా సత్తా చాటుతున్నారు. అయితే కొన్నిసార్లు ఆ పాతకాలంలోలాగే కొందరు అమ్మాయిలు వివిధ రకాలుగా అణచివేతకు గురవుతున్నారు... ఈసారి పురుషాధిక్యంతో కాదు కులమతాల ఆధిక్యంతో ఓ అమ్మాయి ఇబ్బంది పడుతోంది. వరల్డ్ కప్ 2025 లో అద్భుత సెంచరీతో టీమిండియా దశాబ్దాల కలను సాకారం చేసిన యువ క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్ ఈ పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. ఆమె టీమిండియాను గెలిపించిన విషయాన్ని మరిచి మతం రంగు పులుముతున్నారు... కొందరు సోషల్ మీడియాలో ఆమెపై విషం చిమ్ముతున్నారు.
జెమిమా చేసిన తప్పేంటి...?
దేశంకోసం ఆడటమే ఆమె చేస్తున్న తప్పా..? జీవితంలో అనుకున్నది సాధించి అమ్మాయిలకు ఆదర్శంగా నిలవడమే ఆమె తప్పా? మహిళలు వంటిల్లు దాటితే అద్భుతాలు చేయగలరని నిరూపించడమే ఆమె చేసిన తప్పా? క్రికెట్ ఆడటం తప్పా..? ఏం తప్పు చేసింది జెమీమా. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సమయంలో భావోద్వేగంతో తాను నమ్మిన దైవం 'జీసన్' పేరు ఎత్తడం వివాదాస్పదమయ్యింది... కాదు కాదు కొందరు వివాదం చేశారు. జట్టు కష్ట సమయంలో ఉండగా బ్యాటింగ్ కు దిగి అసాధ్యం అనుకున్న టార్గెట్ ను చేదించడం... ఈ సమయంలో సెంచరీ చేయడం.. చివరివరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చడం వంటి పాజిటివ్ విషయాలన్ని మరిచారు... కేవలం ఆమె తన ఇష్టదైవం పేరెత్తడాన్ని పట్టుకుని వివాదం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మన అమ్మాయి గురించి మనవాళ్ళే చేస్తున్న విమర్శలు, ట్రోల్స్ దారుణంగా ఉంటున్నాయి... ఇలాంటి చేష్టలతో సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో అర్థంకావడంలేదు.
ప్రపంచకప్ సెమీ ఫైనల్లో 127 పరుగులతో నాటౌట్ గా నిలిచింది జమీమా... ఇది ఏ అల్లటప్పా టీంపైనో కాదు ఆస్ట్రేలియాపై. టీమిండియా భారీ లక్ష్యాన్ని (300 పైగా పరుగులు) చేధించి ఫైనల్ కు చేరిందంటే అందులో జమీమాదే కీలకపాత్ర. ఆమె ఈ సూపర్ ఇన్నింగ్స్ ఆడకపోయివుంటే భారతీయుల ఉమెన్స్ వరల్డ్ కప్ కల ఇంకా కలగానే మిగిలేది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటిది ఆమెపై సోషల్ మీడియాలో కొందరు విషం చిమ్ముతుండటం దారుణం.
జెమీమా వద్దు.. కాని ఆమె ద్వారా వచ్చిన విజయం కావాలా..?
జెమీమా రోడ్రిగ్స్ పై కులమతాల ముద్రవేసి ఏదో తప్పు చేసినట్లు చూపించే ప్రయత్నం జరుగుతోంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని బోధించే మన భారతీయ సంస్కృతిని కాదని విషబీజాలు నాటే ప్రయత్నాలు చేస్తున్నారు. కులమతాల రంగును క్రీడలకు రుద్దే ప్రయత్నం జరుగుతోంది. జెమీమా మతమార్పిడిని ప్రోత్సహించేలా వ్యవహరించారంటూ ప్రచారం చేస్తున్నారు. ఆమె ఎక్కడా ఇతర మతాలను అగౌరవ పర్చిన సందర్భాలు లేవు... కానీ తన మతంపై ఇష్టాన్ని ప్రదర్శించారు. ఇదే ఇప్పుడు ఆమెపాలిట శాపంగా మారింది. అద్భుతమైన క్రికెటర్ గా ప్రశంసలు పొందాల్సింది... మతచాందసవాదిగా చెడ్డపేరు మూటగట్టుకోవాల్సి వస్తోంది.
జెమీమా వద్దు... కానీ ఆమెద్వారా సాధించిన విజయం మాత్రం కావాలనుకుంటున్నారు. టీమిండియా వరల్డ్ కప్ గెలిచింది... అహా ఓహో అని పొగుడుతున్నారు... కానీ ఈ విజయంలో జెమీమా పాత్ర మరువలేనిదని మరుస్తున్నారు. ఏ తప్పు చేయకున్నా నిందలు మోయాల్సి వస్తోంది జెమీమా.
జెమీమాదే తప్పా... వీళ్లంతా చేసేది మరి..? :
జెమీమా తన ఇష్టదైవం 'జీసస్' పేరెత్తడం తప్పయితే ఇదే క్రికెట్ లో చాలామంది ప్లేయర్లు మత విశ్వాసాలను ప్రదర్శిస్తుంటారు... వాళ్లు చేసేదేంటి..? పాకిస్థాన్, బంగ్లాదేశ్ మెన్స్ క్రికెటర్లు కొన్నిసార్లు మైదానంలో నమాజ్ పాడటం, మాట్లాడే ప్రతిసారి 'అల్లా' పేరెత్తడం చేస్తుంటారు. ఆ అల్లా దయవల్లే తమకు విజయం సాధ్యమయ్యిందని చెబుతుంటారు. మన క్రికెటర్లు కూడా అప్పుడప్పుడు తమ మతవిశ్వాసాలను ప్రదర్శిస్తుంటారు. సౌతాఫ్రికాకు చెందిన భారత సంతతి క్రికెటర్ కేశవ్ మహరాజ్ అయితే బంతి వేసే ప్రతిసారి దేవుడికి దండం పెట్టుకుంటాడు. వీళ్లంతా చేసింది తప్పుకాకుంటే జమీమా చేసింది కూడా తప్పుకాదు... వీళ్లు చేసింది ఒప్పు అయితే జమీమా చేసింది ఒప్పే.
ఇక దేవుళ్లను అస్సలు నమ్మని శాస్త్ర సాంకేతిక రంగాల్లోనూ మతవిశ్వాసాలు ప్రదర్శిస్తుంటారు. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతి ప్రయోగానికి ముందు తిరుమల వెంకటేశ్వరస్వామి ఆశిస్సులు తీసుకుంటుంది. చివరకు అమెరికన్స్ స్పేస్ ఏజెన్సీ నాసా ప్రయోగాల కోసం అత్యధికకాలం అంతరిక్షంలో ఉన్న ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ కూడా తాను వినాయకుడి నమ్ముతానని బహిరంగంగానే చెప్పారు. అంతేకాదు తనతోపాటు అంతరిక్షంలోకి వినాయకుడి విగ్రహాన్ని తీసుకెళ్లినట్లు... అంతరిక్షయానం విజయవంతంగా పూర్తవడానికి ఆయన దయే కారణమని చెప్పారు. ఇలా అత్యాధునిక టెక్నాలజీని మాత్రమే నమ్మేవాళ్ళు కూడా తమ ఇష్టదైవాన్ని తలచుకుంటారు... అలాంటిది జెమీమా రోడ్రిగ్స్ 'జీసస్' ను తలచుకుంటే తప్పేంటి?