- Home
- Entertainment
- ఆ హీరోయిన్ తో జీవితంలో నటించకూడదు అనుకున్న ఎన్టీఆర్, ఏఎన్నార్..ఆమె లేకుంటే ఈ చిత్రాల పరిస్థితి అంతే..
ఆ హీరోయిన్ తో జీవితంలో నటించకూడదు అనుకున్న ఎన్టీఆర్, ఏఎన్నార్..ఆమె లేకుంటే ఈ చిత్రాల పరిస్థితి అంతే..
నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు చాలా చిత్రాల్లో కలిసి నటించారు. వీరి కాంబినేషన్ లో మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ లాంటి క్లాసిక్ చిత్రాలు వచ్చాయి.
- FB
- TW
- Linkdin
Follow Us

నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు చాలా చిత్రాల్లో కలిసి నటించారు. వీరి కాంబినేషన్ లో మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ లాంటి క్లాసిక్ చిత్రాలు వచ్చాయి. అప్పట్లో ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్ అంటే ప్రతి ఒక్కరు గౌరవించేవారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ సెట్ లోకి వస్తుంటే చిత్ర యూనిట్ మొత్తం లేచి నిలబడి నమస్కరించే వారు.
స్టార్ హీరోయిన్లు కూడా ఎన్టీఆర్ ఏఎన్నార్ లతో ఎంతో వినయంగా ఉండేవారు. కానీ వీళ్ళిద్దరికీ ఒక స్టార్ హీరోయిన్ తో విభేదాలు ఉండేవి. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు జమున. ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు భయపడేవారు. అందుకే వారితో గౌరవంగా ఉండేవారట. జమునకి కూడా వాళ్ళిద్దరుంటే గౌరవం ఉంది. కానీ అందరిలా లేచి నిలబడి నటిస్తూ గౌరవించడం తనకు చేతకాదని అనేవారట.
చాలా సందర్భాల్లో ఆమె ఎన్టీఆర్, ఏఎన్నార్ వస్తున్నప్పటికీ అలాగే కూర్చుని ఉండేవారట. ఈ విషయాలను సీనియర్ దర్శకుడు నందం హరిశ్చంద్ర రావు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. జమున తమ పట్ల అగౌరవంగా వ్యవహరిస్తుందని ఎన్టీఆర్, ఏఎన్నార్ భావించారు. దీంతో వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకున్నారు. మన పట్ల గౌరవం లేని నటితో నటించడం కరెక్ట్ కాదు. ఆమెతో మనిద్దరం ఇక ఎప్పటికీ సినిమాల్లో నటించకూడదు అని నిర్ణయించుకున్నారట.
వీళ్ళిద్దరూ అనుకున్నట్లుగానే జమునని నాలుగేళ్ల పాటు ఎన్టీఆర్, ఏఎన్నార్ బ్యాన్ చేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తనని బ్యాన్ చేశారని జమున ఏమాత్రం వెనకడుగు వేయలేదు. అదే వాళ్ళ నిర్ణయం అయితే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నా సినిమాలు నేను చేసుకుంటాను.. అంటూ హరినాథ్ లాంటి హీరోలతో నటించేవారు.
అయితే గుండమ్మ కథ చిత్రంలో ఒక హీరోయిన్ గా సావిత్రి ఫిక్స్ అయ్యారు. మరో హీరోయిన్ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలి అని అనుకుంటున్న తరుణంలో నిర్మాతలు బి.యన్.రెడ్డి, చక్రపాణి లకు జమున అయితే కరెక్ట్ అని అనిపించింది. ఆ పాత్రలో జమున తప్ప ఇంకెవరు నటించలేరని వాళ్ళు అనుకున్నారు. దీంతో ఎన్టీఆర్, ఏఎన్నార్.. జమునకి మధ్య ఉన్న విభేదాలను తొలగించాలని నిర్మాతలు అనుకున్నారు.
ముందుగా ఎన్టీఆర్, ఏఎన్నార్ లని ఒప్పించారట. ఆ తర్వాత జమునతో మాట్లాడారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ అంటే నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది. కానీ అందరిలా నటిస్తూ గౌరవించడం నావల్ల కాదు. వాళ్లతో కలిసి నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని జమున అన్నారట. ఆ విధంగా వీరి మధ్య విభేదాలు తొలగిపోయాయి. వీరి మధ్య విభేదాలు అలాగే కొనసాగి ఉంటే.. గుండమ్మ కథ, శ్రీకృష్ణ తులాభారం లాంటి అద్భుతమైన చిత్రాలు ఉండేవి కాదు. శ్రీకృష్ణతులాభారం చిత్రంలో సత్యభామ పాత్రలో నటించడం జమునకు తప్ప ఇంకెవరికి సాధ్యం కాదు.