పూజా హెగ్డేకి జరిగిందే, శ్రీలీలకి రిపీట్ అయ్యిందా?.. తిప్పి కొడితే ఏడాదిలోనే మొత్తం ఖాళీ.. గుణపాఠమే!
టాలీవుడ్ క్రేజీ సెన్సేషన్ శ్రీలీల గేమ్ తలక్రిందులయ్యింది. వరుస పరాజయాలు ఆమెకి బెడిసి కొట్టాయి. దీంతో ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఎంతో మందికి ఇది గుణపాఠంలా నిలుస్తుంది.
శ్రీలీల.. గత రెండేళ్లుగా టాలీవుడ్‌ని షేక్ చేసిన పేరు. ముఖ్యంగా హీరోయిన్లకి సంబంధించిన చాలా మంది సీనియర్ హీరోయిన్లకి నిద్ర లేకుండా చేసిన పేరు. ఎంతో మంది అవకాశాలను కొల్లగొట్టిన పేరు. శ్రీలీల ఎనర్జీ, డాన్సులు టాలీవుడ్‌కి మైండ్ బ్లాక్ చేశాయి. స్టార్లు సైతం ఆమె వైపు చూపు తిప్పేలా చేశాయి. దీంతో ఒక్కసారిగా అంతా ఆమె పేరుని జపించారు. ఆమెనే కావాలని కోరుకున్నారు. పెద్ద హీరోల నుంచి యంగ్ స్టర్స్ వరకు ఆమెకే ఓటేశారు.
దీంతో ఒకేసారి పది సినిమాలకు సైన్ చేసింది శ్రీలీల. వైష్ణవ్ తేజ్ వంటి యంగ్ హీరో నుంచి, బాలకృష్ణ, మహేష్, పవన్ లతో సినిమాలు చేసే ఆఫర్లని అందుకుంది. `పెళ్లి సందడి`తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. కన్నడకి చెందిన ఈ తెలుగు అమ్మాయి తొలి చిత్రంతోనే మెప్పించింది. మంచి డాన్సులతో మెస్మరైజ్ చేసింది. ఆ తర్వాత రవితేజ `ధమాఖా`తో దుమ్ములేపింది. ఈ సినిమా విజయంలో శ్రీలీల, ఆమె డాన్సులే ముఖ్యమని అంతా అంటుంటారు. అంతే ఒక్కసారిగా శ్రీలీల దశ తిరిగిపోయింది.
ఏకంగా ఒకేసారి పదికిపైగా చిత్రాలకు ఆమె సైన్ చేసింది. వైష్ణవ్ తేజ్ `ఆదికేశవ`, బాలకృష్ణ `భగవంత్ కేసరి`, రామ్ `స్కంధ`, నితిన్ `ఎక్స్ ఆర్డినరీ మ్యాన్`, మహేష్ బాబు `గుంటూరు కారం` చిత్రాలకు ఒప్పుకుంది. దీంతోపాటు విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి మూవీ, అలాగే కన్నడ మూవీ, చిరంజీవి కళ్యాణ్ కృష్ణ చేయాల్సిన మూవీ, పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్‌ల మూవీలకు కూడా ఆమె సైన్ చేసిందని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు అన్నీ ఖాళీ అయ్యాయి.
విజయ్, గౌతమ్ మూవీ నుంచి శ్రీలీలని పక్కన పెట్టారని, `యానిమల్` మూవీలో పాపులర్ అయిన తృప్తి డిమ్రీని తీసుకున్నారని టాక్. చిరంజీవి సినిమా క్యాన్సిల్ అయ్యింది. కన్నడ మూవీ క్యాన్సిల్ అయ్యింది. పవన్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. ఓ రకంగా ఇప్పుడు శ్రీలీల ఖాళీ అయిపోయింది. ఆమె చేతిలో ఒక్క మూవీ కూడా లేదు. ఓ రకంగా ఆమె అధికారికంగా మాత్రం ఖాళీ అయిపోయిందనే చెప్పొచ్చు. చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్ లకు సంబంధించిన సమాచారం రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు శ్రీలీల చేతిలో అధికారికంగా ఒక్క సినిమా కూడా లేదని చెప్పొచ్చు. దీనికి కారణం ఆమెకి వరుస పరాజయాలే. ఆమె నటించిన చిత్రాలన్నీ ఫల్టీ కొట్టడంతో ఆమె ఆఫర్లు పోయాయి, కొత్త ఆఫర్లు రావడం లేదు.
సరిగ్గా బుట్టబొమ్మ పూజా హెగ్డేకి కూడా ఇదే జరిగింది. రెండేళ్ల క్రితం పూజా హెగ్డే అంటే లక్కీ హీరోయిన్ అని, గోల్డెన్ లెగ్ అని ట్యాగ్‌లతో పిలిచారు. ఆమె నటించిన సినిమాలన్నీ వరుసగా విజయాలు సాధించడమే అందుకు కారణం. కానీ ఆ తర్వాత వరుసగా నాలుగైదు సినిమాలు బోల్తా కొట్టాయి. `బీస్ట్`, `రాధేశ్యామ్`, `ఆచార్య`, `సర్కస్`, `కిసి కా భాయ్ కిసీకి జాన్` సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి. దీంతో గోల్డెన్ లెగ్ ట్యాగ్ కాస్త ఐరన్ లెగ్ ట్యాగ్‌గా మార్చేశారు. దీంతో ఆమె ఆఫర్లన్నీ పోయాయి.
వరుస పరాజయాలతో `గుంటూరు కారం` నుంచి తప్పించారు. అలాగే పవన్, హరీష్ మూవీల నుంచి తప్పించారు. విజయ్ దేవరకొండ మూవీ నుంచి తప్పించారు. ఇలా మూడు నాలుగు సినిమాలు మిస్ అయ్యాయి. ఇప్పుడు హిందీలో ఒక్కటే `దేవా` మూవీ చేస్తుంది. దీంతోపాటు తెలుగులో సాయి ధరమ్ తేజ్ తో `గంజా శంకర్` మూవీ ఉంది. కానీ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ లేదు. ప్రస్తుతానికి టాలీవుడ్‌లో పూజా హెగ్డే ఖాళీ అని చెప్పొచ్చు.
దీంతో పూజా హెగ్డేకి జరిగిందే, ఇప్పుడు శ్రీలీల విషయంలో జరుగుతుంది. సేమ్ అలాంటి పరిస్థితే వినిపిస్తుంది. ఎందుకంటే గత ఏడాది వరకు శ్రీలీలని గోల్డెన్ లెగ్ అన్నారు. అంతా ఆమె వెంటపడ్డారు. ఇప్పుడు వరుసగా పరాజయాలు ఎదురు కావడంతో లక్కీ హీరోయిన్, యంగ్ సెన్సేషన్, క్రేజీ హీరోయిన్, సునామీ వంటి ట్యాగ్‌లన్నీ పటాపంచలయ్యాయి. ఇప్పుడు కొత్తగా శ్రీలీల మరే మూవీని ప్రకటించలేదు. దీంతో లేచి పడిన కెరటంలా మారిపోతుంది. మరి దీన్నుంచి ఆమె ఎలా బయటపడుతుంది, కెరీర్‌ని ఎలా ప్లాన్ చేసుకుంటుందో చూడాలి. జాగ్రత్తగా సినిమాలు చేయకపోతే కెరీర్ ప్రశ్నార్థకంగా మారిపోతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.