విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు 2’ రివ్యూ
అప్పుడెప్పుడో ‘బిచ్చగాడు’ అంటూ హిట్ కొట్టి విజయ్ ఆంటోని కు ఆ తర్వాత తెలుగులో హిట్టే లేదు. ఈ క్రమంలోనే ‘బిచ్చగాడు2’ అంటూ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా, స్టార్ కాస్టింగ్ లేకుండా 2016లో వచ్చి పెద్ద హిట్టైన సినిమా బిచ్చగాడు. విజయ్ ఆంటోనీ( Vijay antony ) హీరోగా చేసిన బిచ్చగాడు( Bichagadu ) సినిమా తమిళం లో వచ్చిన పిచ్చే కారన్ అనే సినిమాకి తెలుగు డబ్బింగ్ వెర్షన్. ఈ సినిమా తర్వాత వరస పెట్టి విజయ్ ఆంటోనీ సినిమాలు చేస్తూ తెలుగులోకి డబ్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఒక్క సినిమా కూడా చెప్పుకోదగ్గ స్దాయిలో వర్కవుట్ కాలేదు. కానీ పట్టువదలని విక్రమార్కుడులా తన ప్రయత్నాలు అయితే మానలేదు. ఏదో విభిన్నమైన పాయింట్ తో వస్తూ సరైన స్క్రిప్టు లేక బోల్తాపడుతూ వస్తున్నాడు. తాజాగా మరో సారి తెలుగుపై తన దండయాత్రను కొనసాగించాడు. ఈ సారి బిచ్చగాడు 2 తో. ఓ రకంగా బిచ్చగాడు చూసిన వాళ్ళు ఈ సినిమాకు వస్తారనే నమ్మకంతోనే ఈ సినిమా చేసారని అర్దమవుతోంది. ఇంతకీ ఈ బిచ్చగాడు ఈ సారైనా భాక్సాఫీస్ ని జయించాడా..లేక బిచ్చగాడుగా ఇంకా ఎదురుచూస్తున్నాడా ,అసలు ఈ కొత్త బిచ్చగాడు కథేంటో చూద్దాం.
కథేంటి?
లక్ష కోట్ల ఆస్దిపరుడైన పెద్ద పారిశ్రామిక వేత్త విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోనీ). దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఏడో వ్యక్తి అతని ఆస్దిపై అందరికీ కన్ను ఉంటుంది. ఈ క్రమంలో విజయ్ ప్రెండ్, వ్యాపారాల్లో కీ గా మెలిగే అరవింద్(దేవ్ గిల్) అతన్ని అడ్డు తొలిగించుకుని ఆస్ది కొట్టేయాలనుకుంటాడు. ఈ టైమ్ లో బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ గురించి అరవింద్ కు తెలుస్తుంది. (బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ అంటే మరేదో కాదు రామ్, పూరి కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ లో మెదడులు ఒకరిది తీసి మరొకరికి పెట్టే టైప్ అన్నమాట). దాంతో విజయ్‌ని చంపేసి అతని శరీరంలో వెరొకరి మెదడుని పెట్టి కుట్టేసి , ఆస్తి మొత్తం లేపాయాలని ప్లాన్ వేస్తాడు. ఆ క్రమంలో ఒక వేస్ట్ గాడు..చెప్పిన మాట విని పడుండేవాడు, బ్లడ్ గ్రూప్ కలిసేవాడు ఎవరు ఉన్నారా అని వెతికితే.. సత్య (విజయ్ ఆంటోని డబుల్) కనపడతాడు.
సత్య ఓ బిచ్చగాడు. వాడిని ఎత్తుకొచ్చి బ్రెయిన్‌ని ట్రాన్స్‌ప్లాంట్ చేస్తాడు. ఇప్పుడు కోటీశ్వరుడైన విజయ్ గురుమూర్తి బాడీలో ... సత్య అనే బిచ్చగాడు మెదడు ఉందన్నమాట. అయితే బిచ్చగాడకి ఓ బాధాకరమైన ప్లాష్ బ్యాక్ ఉంది. అందులో అతని చెల్లిలు తప్పిపోయింది. ఆమె కోసం వెతకులాట గత పాతికేళ్లు గా జరుగుతోంది. ఇప్పుడు సత్య కు తను కోటీశ్వరుడుని అని తెలిసాక ఏం చేసాడు..అతని చెల్లి కోసం వెతికాడా..ఈ బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ గురించి ఎవరికైనా తెలిసిందా..హేమ(కావ్యా థాపర్) కు కథలో పాత్ర ఏమిటి.. సీఎం(రాధా రవి)ఈ విషయాల్లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఇస్మార్ట్ శంకర్ చూసిన అనుభవంతో మనకు చాలా ఈజీగా కథ అర్దమవుతుంది. అలాగే బిచ్చగాడు మెదడు..ఓ కోటీశ్వరుడు శరీరంలోకి వెళ్లిదంటే ముష్టి కామెడీ చేసే అవకాశం కూడా ఉంది. అయితే అటు వైపుకు వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఇంట్రవెల్ దాకా లాక్కెళ్లాడు. సెకండాఫ్ లోనే తడబడి..పాత రొటీన్ వ్యవహారంలోకి కథని నెట్టేసాడు. సెకండాఫ్ లో హీరో సామాజిక సేవ, బిచ్చగాళ్లను ఉద్దరించేందుకు ఉద్యమం తరహాలో పోగ్రామ్ లు పెట్టడం వంటివి చూస్తూంటే విసుగు వస్తుంది. అలాగే లక్ష కోట్ల ఆస్ది పరుడు అయ్యాక కూడా తన చెల్లిన వెతకటానికి బిచ్చగాడు గెటప్ లో బయిటకు వెళ్లటం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. బిచ్చగాళ్లకు సాయిం చేయాలనే తాపత్రయంలో ‘యాంటి బికిలీ’ అని పెట్టడం వంటివి బాగా పేలుతాయనుకున్నాడు కానీ ఆ ఐడియాలు ముష్టి స్దాయిలోనే ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ దాకా అలా పడుతూ లేస్తూ వచ్చిన కథ ..సీఎం సీన్ లోకి వచ్చి ...ఎటాక్ బిచ్చగాడు అనే ఎజెండా పెట్టుకుని ,రౌడులు పంపటం, ఫైట్స్ వంటివి చేసినప్పుడు మళ్లీ ఊపందుకుంటుంది.
క్లైమాక్స్ లో కోర్టు సీన్, చెల్లి కనపడినప్పుడు వచ్చే ఎమోషన్ సీన్ వంటివి బాగా డిజైన్ చేసారు. తమిళం వాళ్లు మాత్రం ఆ స్దాయి (అతి అనుకున్నా) సెంటిమెంట్ పిండి మరీ పండిస్తారని మరోసారి ప్రూవ్ చేసారనిపిస్తుంది. అలాగే ‘బిచ్చగాడు’ చిత్రంలో తల్లిని కాపాడుకునేందుకు తపించే కొడుకు పాత్రలో మెప్పించిన విజయ్.. ఇందులో ‘గురుమూర్తి, సత్య’ అనే రెండు పాత్రల్లో కనిపించాడు. ఫ్లాష్ బ్యాక్‌లో అన్నా చెల్లెల్ల సెంటిమెంట్ బాగా పండించారు. అలాగే ఈ స్టోరీలో బిక్షమెత్తుకునే పిల్లలను కిడ్నాప్ చేసే పెద్ద మనుషులు.. వారితో ఏం చేస్తున్నారనే విషయాన్ని తెరపై చక్కగా ప్రజెంట్ చేసారు. ఓవరాల్ గా చెల్లి ఎమోషన్ ని బలంగా నమ్ముకుని , చిన్న పిక్షన్ ని కలుపుకుని గట్టెక్కే ప్రయత్నం చేసారు. ఏదైమైనా సెకండాఫ్ పై మరింత దృష్టి పెట్టి ఉంటే మొదటి బిచ్చగాడుని మించేది.
టెక్నికల్ గా ...:
విజయ్ ఆంటోని సంగీత దర్శకుడు కూడా కావటంతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదరకొట్టాడు. పాటలు మాత్రం జస్ట్ ఓకే. ఇక డైరక్టర్ గా విజయ్ ఆంటోని తొలి సినిమా అయినా అనుభవం ఉన్నవాడులా లాక్కెళ్లిపోయారు. ఇక నుంచి ఆయన సినిమాలు ఆయనే డైరక్ట్ చేసుకోవచ్చు. మిగతా క్రాప్ట్ లలో కెమెరా వర్క్ చాలా బాగుంది. సొంత బ్యానర్ కావటం, తనే హీరో కావటం, తనే డైరక్టర్, ఎడిటింగ్, మ్యూజిక్ డైరక్టర్ కావటంతో ప్రొడక్షన్ కు బాగా ఖర్చు పెట్టారు. ఎడిటింగ్ జస్ట్ ఓకే. భాషాశ్రీ రాసిన తెలుగు డైలాగులు మాత్రం బాగున్నాయి.
Bichagadu 2 movie Review
ఫెరఫార్మెన్స్ వైజ్ ...
విజయ్ ఆంటోని ఓ ప్రక్కన డైరక్షన్ చేసుకుంటూ క్యారక్టర్ చేయాలి. దానికి తోడు ద్విపాత్రాభినయం. అయినా తన రెగ్యులర్ హావ భావాలతో బాగానే లాగేసాడు. కావ్య థాపర్ నటన ప్రక్కన పెడితే అందంగా ఉంది. దేవ్ గిల్, రాధా రవి, జాన్ విజయ్, హరీష్ పేరడి అంతా బాగా చేసారు. యోగిబాబు కామెడీ జస్ట్ ఓకే.
Bichagadu 2 movie Review
బాగున్నవి:
మొదట ఇరవై నిముషాలు
విజయ్ ఆంటోని దర్శకత్వం
క్లైమాక్స్
బాగోలేనవి:
రొటీన్ గా మారిన కథ
నిదానంగా సాగే నేరేషన్
సెకండాఫ్ డౌన్ అవటం
ఫైనల్ థాట్ :
కొత్త పాయింట్ అనుకుని కథ మెదలెట్టినప్పుడు అదే గ్రాఫ్ ని చివరి దాకా కంటిన్యూ చేయాలి. లేకపోతే కొంత కొత్త, కొంత పాత, మరికొంత రోత గా మారుతుంది.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.5
నటీనటులు:విజయ్ ఆంటోని, కావ్య థాపర్, దాతో రాధా రవి, వై.జి. మహేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్, హరీష్ పెరడి, జాన్ విజయ్, దేవ్ గిల్, యోగి బాబు తదితరులు.
ఎడిటర్ : విజయ్ ఆంటోనీ
సంగీతం : విజయ్ ఆంటోనీ
సినిమాటోగ్రాఫర్స్ : విజయ్ మిల్టన్, ఓమ్ ప్రకాష్
ఆర్ట్ డైరెక్టర్ : ఆరుసామి
యాక్షన్ : రాజశేఖర్, మహేష్ మాథ్యూ
రచయితలు : విజయ్ ఆంటోనీ, కె పళని, పాల్ ఆంటోని
నిర్మాత : ఫాతిమా విజయ్ ఆంటోని
దర్శకుడు : విజయ్ ఆంటోని
విడుదల తేదీ : 19, మే 2023.