వెంకటేష్ 'నారప్ప' రివ్యూ
తమిళ్ స్టార్ హీరో ధనుష్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అసురన్ తెలుగు లో చేస్తున్నారనగానే రకరకాల కామెంట్స్ వినపడ్డాయి. అంత సీరియస్ సినిమా తెలుగులో ఆడుతుందా అలాగే..తమిళ నేటివిటీ బాగా ఉన్న ఆ సినిమాని తెలుగుకు మెప్పించే విధంగా మార్చటం సాధ్యమా..దానికి తోడు వెంకటేష్ ...యంగ్ క్యారక్టర్ లో ఎలా కనపడతారు...
కథేంటి
ఎనభైల్లో అనంతపురం ప్రాంతం ఓ మారుమూల పల్లెలో జరిగే ఈ కథ ఇది. అక్కడ ఊరవతల చిన్న గుడిసెలో భార్య సుందరమ్మ(ప్రియమణి), ముగ్గురు పిల్లలు.. మునికన్నా(కార్తీక్ రత్నం), సిన్నబ్బ(రాఖీ), బుజ్జమ్మ(చిత్ర) , బావ బసవయ్య(రాజీవ్ కనకాల)లతో ప్రశాంతంగా జీవితం గడుపుతూ ఉంటాడు నారప్ప(వెంకటేష్). ఎదుటివారు రెచ్చగొట్టినా ఎలాంటి గొడవలకు వెళ్లడు.అతనికో మూడు ఎకరాల పొలం ఉంటుంది. దానిపై ఆ ఊరి భూస్వామి, ఊరి పెద్ద పండు స్వామి (ఆడుకాలం నరేన్) కన్నేస్తాడు.
తన తమ్ముడి దొరస్వామి(దీపక్ శెట్టి) సిమెంట్ ఫ్యాక్టరీ కోసం కోసం ఊళ్లో పేదల భూములన్నీ తీసేసుకుంటాడు. కానీ, నారప్ప తన మూడెకరాల భూమిని మాత్రం ఇవ్వడు. అక్కడ గొడవ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత నారప్ప పెద్ద కొడుకు ..మునికన్న పొలం సరిహద్దుల విషయంలో ఆ భూస్వామితో గొడవ పెట్టుకుంటాడు. పోలీస్ స్టేషన్ కు పంపి కుళ్లబొడిపిస్తారు. నారప్ప వెళ్లి అందరి కాళ్లు పట్టుకుని తన కొడుకుని విడిపించుకొస్తాడు.
ఆ విషయం తెలిసిన మునికన్నా వెళ్లి పండుస్వామి ని కొడతాడు. దాంతో ఆ కక్ష మనుస్సులో పెట్టుకుని ఓ రాత్రి దారుణంగా చంపేస్తారు. కొడుకు చనిపోయినా నారప్ప సైలెంట్ గా ఉండిపోతాడు. తన కొడుకును చంపేశారని సుందరమ్మ (ప్రియమణి) బాధపడుతూనే ఉంటుంది. తల్లి బాధను చూడలేక నారప్ప రెండో కొడుకు సిన్నబ్బ (రాఖీ) పాండుసామిని చంపేస్తాడు. ఇక తన రెండో కొడుకు అయినా కాపాడుకోవాలని నారప్ప తన కొడుకుని తీసుకుని అడవి దారి పడతాడు. పండుస్వామి మనుషులు తప్పించుకు పారిపోయిన ఈ కుటుంబం వెనుక పడతారు.అప్పటిదాకా తాగుబోతుగా, ఏమీ చేతగాని వాడిలా నిమ్మకు నీరెత్తినట్లు కనిపించే నారప్ప గతం బయట పడుతుంది. ఆ గతం ఏమిటి...అసలు నారప్ప ఎందుకు అలా తాగుబోతుగా, ఏమీ చేతగాని వాడిలా ఉన్నాడు? చివరకు నారప్ప తన చిన్న కొడుకును కాపాడుకున్నాడా? లేదా? అన్నదే కథ.
విశ్లేషణ
హాయిగా ఉన్నంత కాలం అంతా బాగానే ఉంటుంది. అయితే అస్తిత్వానికి అవమానం జరిగినప్పుడు మనలో ఒకరు తన ఆలోచనలు, చర్యలు ద్వారా తన జాతి ఆలోచనలకి పదును పెడతారు. తిరగబడతారు. అలాంటి కథే ఇది. దళిత జాతి అవమానాల్లోంచి, ఆర్థిక పీడనల్లోంచి, అవహేళనలలోంచి, అమానుషత్వంలోంచి పుట్టింది.మన దేశంలో దళితులపై జరిగిన ఎన్నో దాడులును గుర్తు చేసి గుండెల్లో మంట పుట్టిస్తుంటుంది.
దళితుల జీవితాలను ప్రతిబింబిస్తూ తమిళంలో సినిమాలు రావడం కొత్తేమీ కాదు. వారి సమస్యల్ని, కష్టాల్ని, అణచివేత, దోపిడీలకు గురైన విధానాన్ని మళ్ల కళ్లెదరుగా సాక్షాత్కరింప చేస్తూ చాలా సినిమాలు వచ్చాయి. వెట్రిమారన్ ‘అసురన్’, పా రంజిత్ ‘కాలా’, మారి సెల్వరాజ్ ‘పరియేరుం పెరుమాళ్’, అంశన్ కుమార్ ‘మనుసంగదా’,ధనుష్ ‘కర్ణన్’ లాంటి చిత్రాలు దళితుల సమస్యలను, వివక్షను చాలా బలంగా చూపించాయి. వాటిల్లో ‘అసురన్’ ఓ సెన్సేషన్. అణిగి అణిగి తిరగబడే పాత్రల్లో తన నటనా సామర్థ్యం ఏంటో ‘అసురన్’లో ధనుష్ చూపించాడు. ఇప్పుడీ సినిమా వెంకటేష్ తెలుగులో చేసారు అనటం కన్నా యాజటీజ్ చాలా దించేసారనే చెప్పాలి. అయితే ఒరిజనల్ లో ఉన్న ఆ ఆవేశం, కసి, తిరుగుబాటు నైజాన్ని అవలీలగా తెరమీద పలికించటంతో ఇబ్బంది అనిపించలేదు.
ఇక తమిళంలో వెట్రిమారన్ అసురన్ స్క్రిప్టుకు మూలం పూమాని రాసిన వెక్కై నవల. వెక్కై అంటే వేడి అని అర్దం. ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే.. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటుగా యదార్ధ సంఘటనలు అద్భుతంగా జొప్పించటం. ఇది ఓ ఛేజ్ స్టోరీలా ,రివేంజ్ కథలా, మాస్ కు నచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ తో నేరేషన్ సాగుతుంది. బ్రిలియెంట్ రైటింగ్. ఈ సినిమాలో అన్ని సినిమాల్లోని పాత్రలు నిజమైనవే అంటారు. అలాగే ఈ సినిమాలో జనాలకు కావాల్సిన సామజిక సందేశాన్ని కూడా దర్శకుడు అద్భుతంగా చెప్పాడు. పొలాలు ఉంటే లాక్కుంటారు.. డబ్బును దోచుకెళ్తారు.. అదే మన దగ్గర చదువుంటే.. అది వాళ్ళు ఎప్పటికి తీసుకెళ్లలేరని చెప్పటంతో సినిమా నెక్ట్స్ లెవిల్ కు వెళ్లింది. అయితే నేటివిటీ కోసమో, సహజత్వం కోసమో.. రక్తపాతం, హింస డోస్ మరీ ఎక్కువ పెంచేసారు. దాంతో కొన్నిసార్లు అసలు కాన్సెప్టు ప్రక్కకు పోయి...ఇదో సగటు ప్రతీకారపు సినిమాగా అనిపిస్తుంది. కాకపోతే సహజమైన గ్రామీణ వాతావరణం నారప్పను చాలా మటుకు కాపాడేసింది.
సినిమా ఎన్ని మార్పులు చేసినా పూర్తి తమిళ నేటివిటీకి దగ్గరగా ఉందనేది కాదనలేని సత్యం. అలాగే , కొన్ని చోట్ల శ్రుతిమించిన నటన అతిగా అనిపిస్తుంది. తమిళ ధనుష్ ని యాజటీజ్ కొన్ని చోట్ల దింపేయాలనుకోవటంతో ఈ సమస్య వచ్చినట్లుంది. అలాగే ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కు లోటు లేదు. ఫస్టాప్ అంతా నారప్ప చాలా సైలెంట్ గా అవమానాలు భరిస్తాడు..ఓ చేతకానివాడుగా ఎస్టాబ్లిష్ అవుతాడు. ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి ఓ పెద్ద యాక్షన్ ఎపిసోడ్ తో తనేంటో చూపెడతాడు. ఆ తర్వాత అతనికో ప్లాష్ బ్యాక్ ఉందని బయిటపడుతుంది. క్లైమాక్స్ లో మరో యాక్షన్ ఎపిసోడ్ తో ముగుస్తుంది. అయితే సినిమాకు ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ వాటిపైకి దృష్టిపోనివ్వదు. కథపైనే దృష్టి పెట్టేలా చేస్తుంది.
దర్శకత్వం,మిగతా విభాగాలు
ఎవరు ఎంత రెచ్చగొట్టినా, చివరకు నువ్వు చచ్చిపోయినా బాగుండును అని కొడుకే అన్నా మౌనంగా భరించే పాత్రలో వెంకటేష్ జీవించాడు.యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో వెంకటేష్ అనుభవం కనిపిస్తుంది. ఒకప్పటి ధర్మచక్రం, గణేష్, జయం మనదేరా లాంటి వింటేజ్ వెంకీ గుర్తువస్తారు. అయితే ప్లాష్ బ్యాక్ లో వచ్చే వెంకటేష్ సెట్ కాలేదనిపిస్తుంది. ఏజ్ బాగా కనపడిపోయింది. అలాగే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కాస్త తగ్గిస్తే బాగుండేది. వెంకటేష్ లవ్ స్టోరీ కూడా పండలేదు. సుందరమ్మ పాత్రలో ప్రియమణి ,ముని కన్నాగా కార్తీక్ రత్నం, సిన్నబ్బగా రాఖీ, బసవయ్యగా రాజీవ్ కనకాల, లాయర్ వరదరాజులుగా రావు రమేష్, శంకరయ్యగా నాజర్ ఇలా ప్రతీ ఒక్కరూ కూడా తమ పాత్రలకు వంద శాతం న్యాయం చేసారు.
టెక్నికల్ విషయాలకు వస్తే కెమెరావర్క్ సినిమాకు ప్రాణం పోసింది. డైలాగ్స్, కాస్టూమ్స్ డిజైన్ బాగున్నాయి. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్..యాజటీజ్ అనురన్ ని లేపుకొచ్చినట్లు ఉంది. దర్శకుడుగా శ్రీకాంత్ అడ్డాల, నారప్ప తో మంచి రీఎంట్రీ ఇచ్చాడనే చెప్పాలి. పాటలు అర్థవంతంగా బాగున్నాయి. రీమేక్ కావటం,పెద్దగా మార్పులు చేయకపోవటంతో దర్శకుడుకి ప్రత్యేకంగా చెప్పుకోవటానికి ఏమీ లేదు. అదే.. ఈ సినిమాలోని లోపం.
ఫైనల్ థాట్
డబ్బులు పెట్టి రీమేక్ రైట్స్ కొన్నాం కదా అని .. డ్రస్,గెటప్,మేకప్ లతో సహా దింపేస్తే ఎలా?
Rating:2.5
---సూర్య ప్రకాష్ జోశ్యుల
ఎవరెవరు..
బ్యానర్: సురేశ్ ప్రొడక్షన్స్, వి.క్రియేషన్స్;
నటీనటులు: వెంకటేశ్, ప్రియమణి, కార్తీక్ రత్నం, రావు రమేశ్, నాజర్, రాజీవ్ కనకాల, అమ్ము అభిరామ్ తదితరులు
సంగీతం: మణిశర్మ;
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు;
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్;
నిర్మాత: కలైపులి ఎస్.థాను, డి.సురేశ్‌బాబు;
రచన: వెట్రిమారన్(అసురన్);
స్క్రీప్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల;
విడుదల: అమెజాన్ ప్రైమ్ వీడియో
రన్ టైమ్:2 గంటల 35 నిముషాలు
విడుదల తేదీ:20 జూలై,2021