16 మందికి రెండే బాత్రూమ్స్, అక్కడో క్యూ లైన్, ఉడకని ఆహారం, బిగ్ బాస్ షో బండారం బయటపెట్టిన నాగ మణికంఠ!
అనారోగ్య కారణాలతో బిగ్ బాస్ షో నుండి తప్పుకున్న నాగ మణికంఠ, హౌస్లో ఇబ్బందులను బయటపెట్టాడు. పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉంటాయో వెల్లడించాడు.
నాగ మణికంఠ గత వారం సెల్ఫ్ ఎలిమినేటైన సంగతి తెలిసిందే. నాగ మణికంఠకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. అతడు భారీగా బరువు తగ్గాడు. ఓట్లు వేయవద్దని ప్రేక్షకులను నాగ మణికంఠ వేడుకున్నాడు. తనకు హౌస్లో ఉండాలని లేదని ఆవేదన చెందాడు.
అత్యల్ప ఓట్లు తెచ్చుకున్న గౌతమ్ ఎలిమినేట్ కావాల్సి ఉంది. కానీ నాగ మణికంఠ నిర్ణయంతో అతడు సేవ్ అయ్యాడు. బయటకు వచ్చిన నాగ మణికంఠ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్లో పరిస్థితులు వెల్లడించాడు. అనేక విషయాల్లో ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుందని నాగ మణికంఠ వెల్లడించాడు.
ఆయన మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్లో నాలుగు బాత్ రూమ్స్ ఉంటాయి. అందులో రెండు యూరినల్స్ కి , మరో రెండో స్నానానికి. ఉదయం లేవగానే బాత్ రూమ్స్ ముందు క్యూ ఉంటుంది. నేను ముందెళ్తా లేదు నేను ముందెళ్తా అని పోటీ పడాల్సి ఉంటుంది. కిచెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వంట చేయాలి కాబట్టి వాళ్ళకు అవకాశం ఇచ్చేవాళ్ళు.
ఉదయాన్నే లేవడం పెద్ద సమస్య. ఒక్కసారిగా పెద్ద సౌండ్ తో మ్యూజిక్ మొదలవుతుంది. నాకు భయం వేసేది. ఉలిక్కి పడి లేచేవాడిని. నిర్ణీత సమయంలో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక్కోసారి సమయం సరిపోదు. ఫుడ్ పూర్తిగా ఉడకడు. రేషన్ తెచ్చుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది. కొన్నిసార్లు అత్యవసర సామాగ్రి మర్చిపోతారు. దాని వలన మరో ఇబ్బంది. ఒక్కోసారి రైస్ ఉండేది కాదు.
రెండు మూడు రోజులు చపాతీ తిని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఉప్పు ఉంటే కారం ఉండేది కాదు. కారం ఉంటే ఉప్పు ఉండదు. నేను చిన్న నిమ్మకాయ చెక్కను రెండు రోజులు వాడాను. ఫుడ్ వేస్ట్ చేస్తే బిగ్ బాస్ ఊరుకోడు. ఫుడ్ విలువ బాగా తెలుస్తుంది. బిగ్ బాస్ షో జీవితాన్ని నేర్పుతుందని.. అన్నారు.
ఇక నాగ మణికంఠ ఎలిమినేషన్ ఒకింత ఫ్యాన్స్ ని నిరాశకు గురి చేసింది. నాగ మణికంఠ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనడంలో సందేహం లేదు. అతడి గేమ్ మొదట్లో విమర్శలపాలైంది. కానీ ప్రేక్షకుల్లో తనకంటూ నాగ మణికంఠ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. టాప్ 5లో నాగ మణికంఠ ఖచ్చితంగా ఉండేవాడు.
నాగ మణికంఠ చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఒప్పందం పై హౌస్లో అడుగుపెట్టాడని సమాచారం. వారానికి రూ.1.25 లక్షలు నాగ మణికంఠ తీసుకున్నాడని తెలుస్తుంది. నాగ మణికంఠ హౌస్ నుండి బయటకు రావడానికి కూడా కారణం ఇది కావచ్చు. డబ్బుల కోసం లైఫ్ రిస్క్ లో పెట్టకూడదని నాగ మణికంఠ భావించాడట.
ఇక స్టార్ మా తో అగ్రిమెంట్ ప్రకారం ఒక ఏడాది పాటు నాగ మణికంఠ అందుబాటులో ఉండాలి. ఇతర టెలివిజన్ ఛానల్స్ లో షోలు చేయకూడదు. సినిమా ఆఫర్స్ వచ్చినప్పటికీ వాళ్లకు సమాచారం అందించి, నటించాల్సి ఉంటుంది. మరోవైపు ప్రియతో తనకు ఎలాంటి విబేధాలు లేవని, హౌస్ నుండి వచ్చాక మాట్లాడానని అంటున్నాడు.
25 ఏళ్ల వయసులో నాగ మణికంఠ ఎన్నారై అయిన ప్రియను వివాహం చేసుకున్నాడు. ఆమెతో పాటు అమెరికాకు వెళ్ళిపోయాడు. డిపెండెంట్ వీసా మీద అమెరికాలో ఉన్న నాగ మణికంఠకు వీసా ఆలస్యం అయ్యిందట. దాంతో జాబ్ లేక భార్యపై ఆధారపడాల్సి వచ్చిందట. వీసా వలనే ప్రియతో అప్పుడప్పుడు గొడవలు జరిగేవని నాగ మణికంఠ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.