- Home
- Entertainment
- ఈ వారం థియేటర్లో విడుదలయ్యే సినిమాలు.. రీ రిలీజ్‌లతో పోటీ పడుతున్న చిత్రాలివే, పోటీలో చిరంజీవి
ఈ వారం థియేటర్లో విడుదలయ్యే సినిమాలు.. రీ రిలీజ్‌లతో పోటీ పడుతున్న చిత్రాలివే, పోటీలో చిరంజీవి
ఈ వారం చిన్నచిత్రాలకు పండగే పండగ. ఓ వైపు అల్లరి నరేష్, ప్రియదర్శితోపాటు చిరంజీవి, కార్తి చిత్రాలు కూడా ఈ వారం ఆడియెన్స్ ముందుకు వస్తున్నాయి. స్ట్రెయిట్ మూవీస్, రీ రిలీజ్‌ల సందడి నెలకొంది.

ఈ వారం థియేటర్లో విడుదలయ్యే చిత్రాలివే
ఈ మధ్య పెద్ద సినిమాలు లేకపోవడంతో చిన్న చిత్రాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. చాలా రోజులుగా థియేటర్ల కోసం వెయిట్ చేస్తోన్న చిత్రాలన్నీ ఇప్పుడు వరుసగా క్యూ కడుతున్నాయి. ఈ శుక్రవారం నాలుగైదు మూవీస్ పోటీకి దిగాయి. అయితే ఈ సారి పెద్ద సినిమాలు కూడా సందడి చేయబోతున్నాయి. మెగాస్టార్, కార్తి మూవీ రీ రిలీజ్ అవుతున్నాయి. దీంతో ఈ వారం బాక్సాఫీసు వద్ద విచిత్రమైన పోటీ నెలకొంది. రీ రిలీజ్ చిత్రాలు, స్ట్రెయిట్ మూవీస్‌కి మధ్య తీవ్రమైన పోటీ నెలకొందని చెప్పొచ్చు.
క్రైమ్ థ్రిల్లర్‌తో వస్తోన్న అల్లరి నరేష్
ఈ వారం విడుదలవుతున్న చిత్రాల్లో అల్లరి నరేష్ మూవీ `12A రైల్వే కాలనీ` ప్రధానంగా ఉంది. కామాక్షి బాస్కర్ల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి నాని కాసరగడ్డ దర్శకుడు. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఓ మర్దర్ కేసు చుట్టూ తిరిగే ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ట్రైలర్‌తో బజ్ క్రియేట్ చేసుకుంది. ఈ వారం రాబోతున్న చిత్రాల్లో ఇది పెద్ద చిత్రంగా చెప్పొచ్చు. ఇటీవల వరుసగా పరాజయాలు ఫేస్ చేస్తున్న అల్లరి నరేష్ మరోసారి హిట్ కొట్టేందుకు ఈ చిత్రంతో రాబోతున్నారు. ఈ నెల 21న విడుదల కాబోతున్న ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
లవ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా `ప్రేమంటే`
ఈ నెల 21న విడుదలవుతున్న మరో మూవీ ప్రియదర్శి నటించిన `ప్రేమంటే`. ఆనంది ఇందులో హీరోయిన్‌గా నటించగా, సుమ కనకాల కీలక పాత్ర పోషిస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నరంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ (SVCLLP) బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. ఆదిత్య మెరుగు సహ నిర్మాత. లవ్, రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంతో హిట్ కొట్టేందుకు వస్తున్నారు ప్రియదర్శి. ఇటీవల ఆయన చేసిన చిత్రాలు కూడా ఆశించిన ఫలితాలను అందుకోలేదు. దీంతో `ప్రేమంటే` మూవీతో సక్సెస్ కొట్టాలని భావిస్తున్నారు. మరి సాధ్యమవుతుందా అనేది చూడాలి.
కామెడీ థ్రిల్లర్‌గా రాజ్ తరుణ్ `పాంచ్ మినార్`
అలాగే ఈ వారం రాబోతున్న సినిమాల్లో రాజ్ తరుణ్ నటించిన `పాంచ్ మినార్` కూడా ఉంది. రాశీ సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి వంటి వారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రామ్ కడుముల దర్శకత్వం వహిస్తున్నారు. మాధవి అద్దంకి, ఎమ్‌ఎంఎస్ రెడ్డి నిర్మాతలు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతుంది. ఇటీవల `చిరంజీవ`తో ఓటీటీలోకి వచ్చిన రాజ్ తరుణ్ ఇప్పుడు `పాంచ్ మినార్`తో సక్సెస్ కొట్టేందుకు వస్తున్నాడు. మరి ఆ విజయం దక్కుతుందా అనేది చూడాలి.
విలేజ్ లవ్ స్టోరీతో `రాజు వెడ్స్ రాంబాయి` మూవీ
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 21న విడుదలవుతున్న ఈ మూవీని వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. విలేజ్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్‌తోనే ఆకట్టుకుంది. సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
క్రేజీ లవ్ స్టోరీతో `ఇట్టు మీ ఎదవ` మూవీ
త్రినాధ్ కఠారి హీరోగా, ఆయన స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'ఇట్లు మీ ఎదవ'. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సాహితీ అవాంఛ హీరోయిన్‌గా నటించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కి యూత్ ఆడియన్స్ నుండి అనూహ్య స్పందన లభించింది. ట్రైలర్‌లో చూపించిన ఫన్ ఎలిమెంట్స్, ప్రేమ సన్నివేశాలు, భావోద్వేగాలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఆద్యంతం ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ మూవీ కూడా ఈ నెల 21న విడుదల కాబోతుంది. ఇలా ఐదు స్ట్రెయిట్ మూవీస్ ఈ వారం థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.
చిరంజీవి `కొదమసింహం` రీ రిలీజ్
వీటితోపాటు మెగాస్టార్ చిరంజీవి నటించిన `కొదమసింహం` మూవీ రీ రిలీజ్ అవుతోంది. చిరంజీవి నటించిన ఒకే ఒక కౌబాయ్ సినిమా ఇది. 1990, ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించిన "కొదమసింహం" సినిమాను ఈ నెల 21వ తేదీన 4కే కన్వర్షన్, 5.1 డిజిటల్ సౌండింగ్ తో సరికొత్తగా రమా ఫిలింస్ అధినేత కైకాల నాగేశ్వర రావు రీ రిలీజ్ చేస్తున్నారు. అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ మూవీపై కూడా మంచి బజ్ ఉంది. మరి ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.
`ఆవారా` రీ రిలీజ్
అలాగే కోలీవుడ్ స్టార్ కార్తి హీరోగా, తమన్నా హీరోయిన్‌గా నటించిన `ఆవారా` చిత్రం కూడా ఈ వారమే రీ రిలీజ్ కాబోతుంది. ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2010 ఏప్రిల్ 2న విడుదలైంది. అప్పట్లో ఈ మూవీ బాగా ఆదరణ పొందింది. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ ఆకట్టుకుంది. 15ఏళ్ల తర్వాత మళ్లీ ఆడియెన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ నెల 22న ఈ చిత్రం రీ రిలీజ్ అవుతుంది. మరి ఈ చిత్రాల్లో ఏది ఈ వారం ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి.

