Shaakuntalam Review: `శాకుంతలం` మూవీ రివ్యూ, రేటింగ్.. సమంత మ్యాజిక్ పనిచేసిందా?
సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `శాకుంతలం`. గుణశేఖర్ రూపొందించిన ఈ చిత్రం నేడు శుక్రవారం విడుదలైంది. పురాణాల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం విజువల్ వండర్‌గా నిలిచిందా? ప్రేమ కావ్యంగా నిలచిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
దర్శకుడు గుణశేఖర్.. తెలుగులో భారీ విజువల్ గ్రాండియన్ చిత్రాలకు కేరాఫ్. కానీ ఆ విషయంలోనే ఆయన మెప్పించడం లేదు. `రుద్రమదేవి` లాంటి భారీ చిత్రాన్ని తీసి కొంత విమర్శల పాలయ్యారు. ఈసారి వాటిని దాటుకుని `శాకుంతలం` చిత్రంతో మెప్పించేందుకు వచ్చారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం కావ్యాన్ని ఆధారంగా చేసుకుని `శాకుంతలం` చిత్రాన్ని రూపొందించారాయన. శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో సమంత.. శకుంతలగా నటించింది. దేవ్ మోహన్.. దుష్యంతుడి పాత్రలో నటించారు. గుణా టీమ్‌వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకాలపై నీలిమా గుణ, దిల్‌రాజు నిర్మించారు. ఈ సినిమా నేడు(శుక్రవారం) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూ(Shaakuntalam Review)లో తెలుసుకుందాం.
కథః
పురాణాలైన మహాభారతంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా రూపొందించిన చిత్రమిది. మేనక, విశ్వామిత్రుల ప్రేమకి చిన్నంగా పుట్టింది శకుంతల. మేనక దేవత కావడంతో మనిషి అయిన తన కూతురు శకుంతల(సమంత)ని భూమిపైనే పక్షులకు వదిలేసి వెళ్తుంది. ఆ పక్షుల ద్వారా ఆ చిన్నారి శకుంతల కణ్వ మహర్షి వద్దకు చేరుతుంది. ఆ చిన్నారిని చూసి ముచ్చటపడిన కణ్వ మహర్షి తన దత్త పుత్రికగా స్వీకరించి పెంచి పెద్ద చేస్తాడు. మహర్షి లేని సమయంలో ఆ ఆశ్రమానికి వస్తాడు దుష్యంత మహారాజు(దేవ్ మోహన్). వేట కోసం వచ్చిన ఆయన ఆపదలో ఉన్న స్థానిక ప్రజలను కాపాడతాడు. అలాగే యాగంలో ఉన్న మహర్షులకు రాక్షసుల నుంచి రక్షణగా ఉంటాడు. ఈ క్రమంలో ఆయన కణ్వ మహర్షి ఆశ్రమం వద్ద అందగత్తె అయిన శకుంతలని చూస్తాడు. ఆమె అందానికి ముగ్దుడవుతాడు. అతడి వీరత్వానికి, మాటలకు శకుంతల కూడా మాయలో పడిపోతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. గంధర్వ వివాహం చేసుకుని శారీరకంగానూ కలుస్తారు.
అయితే దుష్యంతుడు తన రాజ్యానికి వెళ్లిపోవాల్సిన సమయం వస్తుంది. దీంతో శకుంతలను ఒప్పించి రాజ్యానికి వెళ్లిపోతాడు. తాను సకల రాచ మర్యాదలతో తన పట్టపు మహారాణిగా శకుంతలని తీసుకెళ్తానని, తన రాజ్య ప్రజలకు పరిచయం చేస్తానని చెబుతాడు. తమ ప్రేమిక చిహ్నంగా ఆమెకి తన ఉంగరాన్ని ఇస్తాడు. యాగం పూర్తి చేసుకుని వచ్చిన కణ్వ మహర్షి ఈ విషయం తెలిసి సంతోషిస్తాడు. అయితే రోజులు గడుస్తున్నా దుష్యంతుడు రాడు, ఈ లోపు శకుంతల గర్భవతి కూడా అవుతుంది. సమయం మించి పోతున్న నేపథ్యంలో కణ్వ మహర్షి.. ఓ ఉత్తరం రాస్తూ శకుంతలని దుష్యంతుడి వద్దకి పంపిస్తాడు. రాజ్యానికి చేరిన శకుంతలని చూసిన దుష్యంతుడు ఆమె ఎవరో తెలియదని, తాను మొదటిసారి చూస్తున్నానని చెప్పడంతో శకుంతల ఖంగుతింటుంది. దీంతో అతను ఇచ్చిన అంగుళికాన్ని చూపించేందుకు ప్రయత్నించగా, అది ఎక్కడో జారిపోతుంది. మరి శకుంతలని దుష్యంతుడు ఎందుకు గుర్తుపట్టలేదు? దుష్యంతుడు.. శకుంతలని ఏం చేశాడు? ఆ రాజ్య ప్రజలు శకుంతలని ఎందుకు చంపాలనుకుంటారు? గర్భవతిగా ఉన్న శకుంతల.. వారి నుంచి ఎలా తప్పించుకుంది? దుర్వాసుడు(మోహన్‌బాబు) శకుంతలని ఎందుకు శపించాడు? ఇంతకి శకుంతులని దుష్యంతుడు స్వీకరించాడా? లేదా? ఈ క్రమంలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల సమాహారమే ఈ సినిమా.
విశ్లేషణః
కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలంలోని శకుంతల-దుష్యంతుల ప్రేమ కథని యదాతథంగా తెరకెక్కించాడు దర్శకుడు గుణశేఖర్. అయితే ఇది చాలా వరకు అందరికి తెలిసిన కథే. తెలిసిన కథని ఆడియెన్స్ కి ఆకట్టుకునేలా, వారి మనుసులను హత్తుకునేలా తెరకెక్కించడమే పెద్ద సవాల్. కథని మార్చడానికి లేదు, ఉన్నదాన్నే చాలా ఎఫెక్టీవ్‌గా, మరింత నాటకీయంగా తెరపై ఆవిష్కరించాలి. విజువల్ గ్రాండియర్‌గా చూపించేందుకు స్కోప్ ఉంది కాబట్టి ఆ పరంగా ఎంతటి సాహసమైనా చేయోచ్చు. ఎంత గ్రాండియర్‌గా చూపిస్తే ఈ సినిమాకి అంతటి అందం వస్తుంది. దర్శకుడు గుణశేఖర్ విజువల్ గ్రాండియర్‌గా శకుంతల, దుష్యంతుల ప్రేమకథని చెప్పాలనుకున్నారు. శృంగార కథగా ఉన్నదాన్ని భావోద్వేగాల అంశాలు ప్రధానంగా చూపించాలనుకున్నారు. లవ్ స్టోరీ రొటీన్ అవుతున్న నేపథ్యంలో ఎమోషన్స్ ప్రధానంగా సినిమాని చూపించే ప్రయత్నం చేశానని ఇంటర్వ్యూలో తెలిపాడు. కానీ ఆయన రెండింటిని సమపాళ్లలోనే చూపించాడు. ఇంకా చెప్పాలంటే ప్రేమ కథకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడని సినిమా చూస్తే తెలుస్తుంది.
దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాకి సంబంధించి నీట్‌గా స్క్రీన్‌ప్లేని రాసుకుని దాన్ని అంతే నీట్‌గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఎంపిక విషయంలో ఆయన అంతో ఇంతో విజయం సాధించారు. కానీ మిగిలిన ఏ విషయంలోనూ ఆయన మెప్పించలేకపోయారు. ప్రేమ కథగా రూపొందించిన ఈ చిత్రంలో అసలు ఫీలే లేదు. ప్రేమకి ఫీలింగే ముఖ్యం. ఆ ఫీల్ ని ఆడియెన్స్ కనెక్ట్ అయితే సినిమాతో ట్రావెల్ చేస్తారు. లేదంటే సినిమా సీన్లుగానే మిగిలిపోతుంది. శాకుంతల విషయంలోనూ అదే జరిగింది. శకుంతలని చూసి దుష్యంతుడు ఎంతగా ఎందుకు ముగ్డుడయ్యాడు, దుష్యంతుడిలో శకుంతల ఏం ప్రేమని చూసిందనేది అంతు పట్టని అంశం. ఏదో ప్రేమించుకోవాలనేది తప్పిస్తే, వీరి ప్రేమ కథలో సహజత్వం పండలేదు. ఆ శృంగారం కూడా భరించలేని విధంగా ఉంది. పైగా స్లో నెరేషన్ చిరాకు తెప్పించే అంశం. వినోదానికి ఆస్కారం లేకపోవడంతో బోర్ తెప్పిస్తుంది. శకుంతల చాలా వరకు కణ్వ మహర్షి ఆశ్రమంలో జంతువులు, పక్షుల మధ్య పెరుగుతుంది. వాటితో మంచి బాండింగ్ ఉంటుంది. కానీ దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు. ఆమెని ఇన్నోసెంట్‌ని చూపించలేదు. డైరెక్ట్‌గా దుష్యంతుడు ఆమెని చూడటం, ప్రేమలో పడటం అనేది ఆడియెన్స్ కి కన్విన్సింగ్‌గా అనిపించదు.
ఇక సినిమా మొదటి భాగం మొత్తం శకుంతల, దుష్యంతుల ప్రేమ కథతో సాగుతుంది. ఈ ఎపిసోడ్ మొత్తం ఓ సీరియల్‌ని తలపించేలా ఉంటుంది. సీన్ బై సీన్లు వస్తుంటాయి తప్ప ఎక్కడ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉండవు, ఏం చూస్తున్నామో కూడా ఆడియెన్స్ కి అర్థం కాదు. ఇక సెకండాఫ్‌లో భావోద్వేగాల పార్ట్ ని ఎంచుకున్నాడు దర్శకుడు గుణశేఖర్. దుష్యంతుడు తన కోసం రాకపోవడంతో ఆమె బాధపడటం, ఉండలేక రాజ్యానికి వెళ్లడం, అక్కడ తనకు అవమానాలు ఎదురుకావడం, తనని ప్రజలంతా రాళ్లతో కొట్టడం, చంపేందుకు ప్రయత్నించడం వంటి సీన్లు అలా వచ్చిపోతుంటాయి. భావోద్వేగాల్లోనూ డ్రామా పండలేదు. సంఘర్షణకు ఏమాత్రం స్కోప్ ఇవ్వలేదు. శకుంతలని రిజెక్ట్ చేసినప్పుడు ఆమె పడే సంఘర్షణలోనూ నాటకీయతని పండించలేకపోయాడు దర్శకుడు. దీంతో సినిమాతో ఆడియెన్స్ పూర్తిగా డిస్ కనెక్ట్ అవుతారు. అయితే చివర్లో అల్లు అర్హ.. భరతుడిగా ఇచ్చిన ఎంట్రీ బాగుంది. ఆమె నటన, డైలాగులు ముచ్చటగా అనిపిస్తూ ఆ సమయంలో ఎమోషన్స్ బాగా పండాయి. అక్కడ కాస్త ఆడియెన్స్ గుండె బరువెక్కినట్టుగా ఉంటుంది. అల్లు అర్హ ముద్దుముద్దు మాటలు అబ్బురపరుస్తాయి.
ఇక ఇలాంటి సినిమాలకు కావాల్సింది, దర్శకుడు గుణశేఖర్ చూపించాల్సింది విజువల్ గ్రాండియర్ నెస్‌ని. ఆ విషయంలో కంప్లీట్ నెస్ రాలేదు. పైగా త్రీడీ అంటూ ఆయన చేసిన సాహసం సక్సెస్ కాలేదు. హాలీవుడ్ సినిమాలు, అవతార్ లాంటి విజువల్ గ్రాండియర్ ఉన్నసినిమాలు చూస్తున్న ఆడియెన్స్ ఈ `శాకుంతలం` వీఎఫ్‌ఎక్స్ అంతగా మెప్పించలేవు. త్రీడీలో చూడాల్సినంత ఏముందనే ఫీలింగ్ కలుగుతుంది. `రుద్రమదేవి` చిత్రానికి ఇలాంటి విమర్శలే ఎదుర్కొన్నాడు దర్శకుడు. ఇప్పుడు మళ్లీ అలాంటి విమర్శలు తప్పవు. భారీగా ఒరిజినల్ నగలను వాడామని చెప్పారు. అసలు నగలు చూపించేందుకు ఆస్కారమే లేదు. చివర్లో ఓ రెండు నిమిషాలు కనిపిస్తాయి, మధ్యలో దుష్యంతుడి నగలు ఓ సారి కనిపిస్తాయి. మహా అయితే సినిమా మొత్తంలో ఐదు నిమిషాలు కూడా ఆ నగలు కనిపించవు, కానీ 14కోట్ల నగలను ఉపయోగించామని చెప్పడం హాస్యాస్పదం.
నటీనటుల నటనః
శకుంతలగా సమంత బాగా చేసింది. తన వంతుగా పాత్రని పండించే ప్రయత్నం చేసింది. తనదైన భావోద్వేగాలను పండించింది. కానీ ఈ పాత్రకి ఆమె రాంగ్ ఛాయిస్ అనిపించేలా ఉండటం గమనార్హం. ఇక దుష్యంతుడిగా దేవ్ మోహన్ తన పాత్ర మేరకు బాగా చేశాడు. కానీ తెలిసిన ఫేస్ కాకపోవడంతో ఆ పాత్ర పెద్దగా ఎక్కదు. కణ్వ మహర్షిగా సచిన్ ఖేడ్కర్ బాగా చేశాడు. పాత్రకి బాగా ఫిట్ అయ్యారు. దుర్వాసన మహార్షిగా మోహన్‌బాబు కాసేపు మెరిసి మెప్పించాడు. చెలికత్తే అనసూయగా అనన్య నాగళ్ల ఆకట్టుకుంది. శకుంతలని పెంచిన అమ్మగా గౌతమి యాప్ట్ గా ఉంది. మరోవైపు మేనకగా మధుబాల ఓకే అనిపించారు. ఆమె దేవలోక చెలికత్తేగా వర్షిణి సౌందరాజన్‌కి మంచి పాత్ర దక్కిందని చెప్పాలి. ఫైనల్‌గా భరతుడిగా అల్లు అర్హ పాత్ర సర్‌ప్రైజింగ్. సినిమాలో హైలైట్ పార్ట్.
సాంకేతిక వర్గంః
దర్శకుడు గుణశేఖర్.. ఎంతసేపు తాను దుష్యంతుడు, శకుంతల ప్రేమని దృశ్యకావ్యంలా చూపించే ప్రయత్నం చేశాడు కానీ, ప్రేమలో ఫీల్‌ని తీసుకొచ్చే విషయంలో, డ్రామాని పండించే విషయంలో, భావోద్వేగాలను పండించే విషయంపై ఫోకస్ పెట్టలేదు. సమంత పడే సంఘర్షణని బలంగా చూపించలేకపోయారు. అదే ఈ సినిమాకి పెద్ద మైనస్. పురాణాల్లో చదివిన కథకి దృశ్యరూపం ఇచ్చాడనిపిస్తుంది తప్ప, అద్భుతమైన దృశ్య కావ్యాన్ని చూశామన్న ఫీలింగ్‌ని తీసుకురాలేకపోయారు. నిజానికి ఇలాంటి సినిమాలకు విజువల్సే ప్రధానం. ఆ విషయంలో టీమ్ రాజీపడ్డారని అర్థమవుతుంది. దీంతో గుణశేఖర్ కష్టం బూడిదలో పోసిన పన్నీరులా మిగిలింది. టెక్నీకల్‌గా కెమెరా వర్క్ బాగుంది. విజువల్‌గా అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. మణిశర్మ సంగీతం బాగుంది. కానీ ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. సినిమా నిడివి తక్కువే. ఇంకా ఇరవై నిమిషాలు లేపేసినా నష్టం లేదు. నిర్మాణ విలువల విషయంలో నిర్మాతలు రాజీపడ్డారని స్పష్టమవుతుంది. సమంతపై ఇంత బడ్జెట్ అవసరమా అని వాళ్లే అనుకుని ఉంటారు. దీంతో చుట్టేశారనే విషయం స్పష్టమవుతుంది.
ఫైనల్‌గాః `శాకుంతలం`.. అటు దృశ్య కావ్యం కాదు, ఇటు ప్రేమ కావ్యం కాదు. ఆడియెన్స్ కి పరీక్షా కాలం.
రేటింగ్‌ః 2
నటీనటులు : సమంత, దేవ్ మోహన్, మోహన్ బాబు, అల్లు అర్హ, శివ బాలాజీ, ప్రకాష్ రాజ్, మధుబాల, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, జిష్షు సేన్ గుప్తా తదితరులు
మూలకథ : కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా
మాటలు : సాయి మాధవ్ బుర్రా
పాటలు : చైతన్య ప్రసాద్, శ్రీమణి
ఛాయాగ్రహణం : శేఖర్ వి. జోసెఫ్
సంగీతం : మణిశర్మ
నిర్మాణ సంస్థలు : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, గుణ టీమ్ వర్క్స్
సమర్పణ : 'దిల్' రాజు
నిర్మాత : నీలిమా గుణ
రచన, దర్శకత్వం : గుణశేఖర్
విడుదల తేదీ: ఏప్రిల్ 14, 2022