- Home
- Entertainment
- Giribabu Passed Away: టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత.. కారణం ఏంటంటే?
Giribabu Passed Away: టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత.. కారణం ఏంటంటే?
Giribabu Passed Away: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, నిర్మాత, దర్శకుడు గిరిబాబు కన్నుమూశారు. శనివారం మధ్యాహ్నం ఆయన కన్నుమూసినట్టు సమాచారం.

సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
టాలీవుడ్ల విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ దిగ్బ్రాంతికి గురయ్యింది. ఆరువందలకుపైగా చిత్రాల్లో నటించి మెప్పించి ఆయన మరణం ఇప్పుడు టాలీవుడ్‌ని షాక్‌కి గురి చేస్తోంది.
గిరిబాబు బయోగ్రఫీ..
తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్‌గా, హీరోగా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు గిరిబాబు. ఆయన అసలు పేరు యర్రా శేషగిరిరావు. 1943 జూన్ 8న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో జన్మించారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయనకు చిన్నప్పటి నుంచే నాటకాలపై ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టారు.
జగమే మాయతో సినీ రంగ ప్రవేశం..
1973లో విడుదలైన 'జగమే మాయ' సినిమాతో గిరిబాబు నటుడిగా పరిచయమయ్యారు. మొదట్లో హీరోగా సినిమాలు చేయాలనే ఆశతో ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ, విలన్ పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత హీరోగా, ప్రతినాయకుడిగా, హాస్యనటుడిగా, సహాయ నటుడిగా ఎన్నో విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను అలరించారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి, రజనీకాంత్, వెంకటేష్ వంటి అగ్ర నటులతో కలిసి నటించారు. తన నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణంలో 600కు పైగా సినిమాల్లో నటించినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. అందులో సుమారు 100 సినిమాల్లో హీరోగా, 300 సినిమాల్లో విలన్‌గా నటించినట్లు తెలిపారు.
నిర్మాతగా, దర్శకుడిగా కూడా..
నటనతోనే కాకుండా నిర్మాణ రంగంలోనూ గిరిబాబు తన ప్రతిభను చాటుకున్నారు. జయభేరి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై దేవతలారా దీవించండి, సింహగర్జన, మెరుపు దాడి, పసుపు కుంకుమ వంటి సినిమాలను నిర్మించారు. రణరంగం, ఇంద్రజిత్, నీ సుఖమే నే కోరుతున్నా వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.
సినిమాల్లోనే గిరిబాబు కొడుకులు
గుర్తుండిపోయే సినిమాలు..
జగమే మాయ, జ్యోతి, ఉర్వశి, ఛైర్మన్ చాణక్య, సింహగర్జన, మెరుపు దాడి, నివురుగప్పిన నిప్పు, అతడు, గమ్యం, డమరుకం, గీత గోవిందం వంటి చిత్రాలు ఆయన సినీ ప్రస్థానంలో ప్రత్యేకంగా నిలిచాయి. ముఖ్యంగా కొత్తతరం సినిమాల్లో తండ్రి, తాతయ్య పాత్రల్లోనూ మెప్పించారు.
ఆయన కుమారుడు రఘుబాబు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ హాస్యనటుడిగా కొనసాగుతున్నారు. మరో కుమారుడు బోసుబాబు కూడా సినిమాల్లో నటించారు. గిరిబాబు సతీమణి 2016లో కన్నుమూశారు. ఆయన నటించిన చివరగా `అన్నీ మంచి శకునములే` చిత్రంలో కనిపించారు. వయసు రీత్య సినిమాలు తగ్గించారు. విలన్‌గా భయపెట్టి, హాస్యనటుడిగా నవ్వించి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా భావోద్వేగాలను పండించిన గిరిబాబు తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటని చెప్పొచ్చు.













