వెయ్యి కోట్ల పారితోషికంపై క్లారిటీ ఇచ్చిన సల్మాన్ ఖాన్.. ఐటీ దాడులు చేస్తారేమో అంటూ సెటైర్లు
బిగ్ బాస్ హిందీ సీజన్‌కి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షోకిగానూ ఆయన వెయ్యి కోట్లు పారితోషికం తీసుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.
దేశంలో అత్యంత పాపులర్ షోగా రన్ అవుతుంది `బిగ్ బాస్`. హిందీతోపాటు ఇది సౌత్ అన్ని భాషల్లోనూ ప్రసారమవుతుంది. హిందీలో ఇది పదిహేను సీజన్లు పూర్తి చేసుకోగా, పదహారో సీజన్‌కి సిద్ధమవుతుంది. తెలుగులో ఇప్పుడు ఆరో సీజన్ రన్ అవుతున్న విషయం తెలిసిందే. పదిహేను సీజన్లకిగానూ దాదాపు 11సార్లు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించారు. హిందీ బిగ్‌బాస్ ని తనదైన స్టయిల్‌లో రక్తికట్టిస్తున్నారు.
హోస్ట్ గా ఈ షోకి సల్మాన్ భారీగానే పారితోషికం అందుకుంటున్నారు. దీనికిగానూ ఆయన వందల కోట్లు పారితోషికం పొందుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. గత సీజన్‌కి ఆయన ఏకంగా రూ.350కోట్లు తీసుకున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. త్వరలో ప్రారంభం కాబోతున్న 16వ సీజన్‌కి వెయ్యి కోట్లు పారితోషికంగా తీసుకోబోతున్నట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా ఈవార్త చక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ ప్రశ్న సల్మాన్‌ఖాన్‌కి ఎదురైంది.
తాజాగా బిగ్ బాస్ 16 లాంచ్ ఈవెంట్‌లో సల్మాన్ ఖాన్ దీనిపై స్పందించారు. బిగ్ బాస్ షో చేయడానికి మీరు వెయ్యికోట్లు తీసుకుంటున్నారా? అన్ని హోస్ట్ గా ఉన్న గౌహర్‌ఖాన్ అడిగారు. దీనికి సల్మాన్ స్పందిస్తూ అందులో నిజం లేదన్నారు. అవన్నీ తప్పుడు వార్తలని, వెయ్యి కోట్లు ఇస్తూ జీవితాంతం మరే పనిచేయకుండా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తానని తెలిపారు. `ఆ వార్తల్లో నిజం లేదు. అంత డబ్బు ఇస్తే జీవితంలో ఎప్పటికీ వర్క్ చేయకుండా లైఫ్‌ని ఎంజాయ్ చేసేవాడిని. కానీ నాకు అంత డబ్బు ఇచ్చే రోజు జీవితంలో వస్తుందని ఆశిస్తున్నా` అని చెప్పారు సల్మాన్.
ఆయన ఇంకా చెబుతూ, తనకు చాలా ఖర్చులున్నాయని, లాయర్ల ఖర్చులు వంటివి, వాటికి డబ్బు కావాలంటూ సెటైర్లు పేల్చాడు. వెయ్యి కోట్లలో కనీసం పావు వంతు కూడా తనకు రాదని చెప్పాడు. ఐటీ డిపార్ట్ మెంట్, ఈడీ అధికారులు ఈ నివేదికలను చదివి ఇంటికి వచ్చి తనిఖీచేస్తారు, అప్పుడు నా దగ్గర ఉన్న వాటి గురించి అందరికి నిజం తెలుస్తుందని వెల్లడించారు సల్మాన్. మొత్తంగా ఈ వార్తలను ఆయన ఖండించారు. అయితే గత సీజన్ కంటే ఎక్కువే పారితోషికం ఇస్తున్నట్టు టాక్.
అయితే తనకు బిగ్ బాస్ కి హోస్ట్ గా చేయాలని లేదట. షోలో తనకు చాలా సందర్భాల్లో చిరాకు వస్తుందని, కంటెస్టెంట్లు అతి చేస్తుంటారని తెలిపారు. దీంతో తాను కూడా పరిమితులు దాటాల్సి వస్తుందన్నారు. కానీ తప్పడం లేదని, నిర్వహకులకు మరో ఆల్టర్‌నేట్ లేకపోవడంతో నా వద్దకు వస్తున్నారని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో హోస్ట్ గా చేయాల్సి వస్తుందని, ఆ ఛాయిస్ ఉంటే నన్ను ఎప్పుడో తీసేసే వారని పేర్కొన్నారు సల్మాన్. అయితే తన స్థానాన్ని భర్తీ చేసే వాళ్లు ఉన్నప్పటికీ నిర్వహకులు ఆ పని చేయడం లేదన్నారు.
ఇదిలా ఉంటే హిందీ బిగ్ బాస్ 16వ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే అంటూ కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో మొదటి కంటెస్టెంట్ పేరుని ప్రకటించారు సల్మాన్. కజికిస్తాన్ ఆర్టిస్టు అబ్దు రోజిక్ మొదటి కంటెస్టెంట్‌గా చెప్పారు. వీరితోపాటు టీనా దత్తా, గౌతమ్ విగ్, షాలినీ భానోత్, సుంబుల్ తౌకీర్, నిమృత్ కౌర్ అహ్లువాలియా వంటి వారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బిగ్ బాస్ 16 లాంచింగ్ ఈవెంట్లో సల్మాన్ మొగాబో అవతార్‌లో కనిపించడం విశేషం.
సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `గాడ్ ఫాదర్` చిత్రంలో చిరంజీవితో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు జరగబోతున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 5న దసరా కానుకగా ఈచిత్రం రిలీజ్ కానుంది. దీంతోపాటు `కిసి కా భై కిసి కి జాన్` చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయిక, వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రామ్‌చరణ్ ఓ పాటలో మెరవబోతున్నారు. అలాగే `టైగర్ 3` చిత్రం చేస్తున్నారు సల్లూ భాయ్.