సరిలేరు నీకెవ్వరు, భోళాశంకర్, డియర్ కామ్రేడ్, లియో.. సాయిపల్లవి రిజెక్ట్ చేసిన సినిమా లిస్ట్ పెద్దదే!
సాయిపల్లవి నటించిందంటే ఆ సినిమాలో విషయం ఉన్నట్టే. కానీ ఆమె రిజెక్ట్ చేసిందంటే దాని గురించి ఆలచించాల్సిందే. మరి ఇటీవల సాయిపల్లవి రిజెక్ట్ చేసిన సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.
సాయి పల్లవి.. లేడీ పవర్ స్టార్‌గా రాణిస్తుంది. ఆమెకి ఉన్న క్రేజ్ మామూలు కాదు. కారణం అద్భుతమైన నటన మాత్రమే కాదు, అంతకు మించిన డాన్సులు. ఆమె డాన్సు చేస్తే థియేటర్లు షేక్ అయిపోవాల్సిందే. ఆడియెన్స్ ముగ్దులై కూర్చోవాల్సిందే. అంతగా అలరిస్తుంది. పైగా ఆమె నటించిన సినిమాలో మంచి కంటెంట్ ఉంటుంది. ఆమె పాత్రకి ప్రయారిటీ ఉంటుంది. అలా తనదైన యాక్టింగ్ తోనూ మెప్పిస్తుంది.
సాయిపల్లవి సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటుందే, చాలా సెలక్టీవ్‌గా ఉంటుంది. నచ్చని స్క్రిప్ట్ లను ఈజీగా రిజెక్ట్ చేస్తుంది. అది పెద్ద స్టార్ అయినా తను కేర్ చేయదు. ఆ మధ్య చిరంజీవి నటించిన `భోళా శంకర్`ని రిజెక్ట్ చేసినట్టు చెప్పిన విషయం తెలిసిందే. కానీ ఆమె రిజెక్ట్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇందులో పెద్ద సినిమాలుండటం విశేషం. మరి ఆ మూవీస్ ఏంటో ఓ లుక్కేద్దాం.
సాయి పల్లవి తన సినిమాలో చేయనని చెప్పిందని ఆ మధ్య `లవ్ స్టోరీ` మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పారు చిరంజీవి. అయితే ఆమె తిరస్కరించడం తనకు సంతోషంగానే ఉందన్నారు. ఎందుకంటే ఆ సినిమాలో సాయిపల్లవిని అడిగింది చెల్లి పాత్రకి. ఆ పాత్రలో ఆమె నటిస్తే తర్వాత తన సరసన ఆమె హీరోయిన్‌గా చేయడం కుదరదు అని, సాయి పల్లవితో తాను డాన్సులు వేయాలని ఉందని చెప్పాడు చిరు. ఆయన కామెంట్స్ రచ్చ చేశాయి. కానీ బాగా వైరల్ అయ్యాయి. అదే సమయంలో ఆ మూవీ(భోళా శంకర్) డిజాస్టర్ అయ్యింది. ఈ విషయంలో సాయిపల్లవి నిర్ణయం కరెక్ట్ అనే కామెంట్స్ వచ్చాయి. ఇందులో చెల్లి పాత్రలో కీర్తిసురేష్ నటించిన విషయం తెలిసిందే.
మరోవైపు ఇప్పుడు సాయిపల్లవి రిజెక్ట్ చేసిన సినిమాలు మరికొన్ని తెరపైకి వచ్చాయి. జనరల్‌గా చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తారు. కానీ పెద్ద హీరోల సినిమాలను మాత్రం హీరోయిన్లు రిజెక్ట్ చేయరు. అది మేకర్స్ చేతుల్లోనే ఉంటుంది. కానీ సాయిపల్లవి మరో స్టార్ హీరో సినిమాని తిరస్కరించిందట. అది ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో హీరోయిన్‌గా సాయిపల్లవిని అడిగారట. తన పాత్ర, స్క్రిప్ట్ విన్నాక ఆమె తిరస్కరించింది. పాత్ర నచ్చకపోవడం వల్ల ఆమె నో చెప్పిందట. ఆ పాత్రలో రష్మిక మందన్నా నటించింది. ఆమెకి పెద్దగా పేరు రాలేదు. సినిమా క్రెడిట్ మహేష్ ఖాతాలోకి చేరిన విషయం తెలిసిందే. పైగా అది పెద్ద హిట్ ఏం కాదు.
ఇంకోవైపు ఈ రౌడీ బేబీ.. రౌడీ బాయ్‌ని కూడా రిజెక్ట్ చేసిందట. విజయ్ దేవరకొండతో `డియర్ కామ్రేడ్` సినిమాలో నటించే అవకాశం మొదట ఆమెకే వచ్చిందట. కానీ ఆ పాత్రలో నటించేందుకు నో చెప్పిందట. ఆ పాత్రలో రష్మిక మందన్నా నటించింది. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. కానీ రష్మిక పాత్రకి మంచి పేరొచ్చింది.
దీంతోపాటు దళపతి విజయ్ సినిమాని కూడా సాయి పల్లవి రిజెక్ట్ చేసిందట. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో `లియో` మూవీ రూపొందింది. ఇది యావరేజ్‌గా ఆడింది. ఇందులో విజయ్ సరసన త్రిష నటించింది. త్రిష రోల్‌కి సాయి పల్లవిని అడిగారట. కానీ ఆమె స్క్రిప్ట్ విన్నాక నో చెప్పిందట. ముఖ్యంగా హీరోయిన్ పాత్ర విషయంలో తను సాహసం చేయదలుచుకోలేదట. అలా ఆమె నో చెప్పిందట. గతేడాది వచ్చిన `లియో` మూవీ యావరేజ్ ఫలితాన్ని చవిచూసింది. కలెక్షన్లు మాత్రం బాగానే వచ్చాయి.
ఇలా బయటకు వచ్చిన సినిమాలు ఇవైతే, బయటకు రానివి ఇంకా ఎన్ని ఉన్నాయో. మొత్తంగా సాయిపల్లవి నో చెప్పిందంటే ఆ మూవీ గురించి ఆలోచించాల్సిందే అనే పరిస్థితి తీసుకొచ్చిందీ నేచురల్ బ్యూటీ. బలమైన కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె చేతిలో `తండేల్`, శివకార్తికేయన్ మూవీ, అలాగే హిందీలో మరో సినిమా చేస్తుంది సాయిపల్లవి.