పరిశ్రమలో డైరెక్టర్ పూరి నా బద్దశత్రువు, అతని ఫోటో రోజూ చూస్తూ ఉంటా... రాజమౌళి తండ్రి షాకింగ్ కామెంట్స్!
దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దేశం మొత్తం మెచ్చిన స్టార్ రైటర్. బాహుబలి, భజరంగీ భాయ్ జాన్ వంటి చిత్రాలు ఆయన ఫేమ్ ఎక్కడికో తీసుకెళ్లాయి. రాజమౌళిని స్టార్ డైరెక్టర్ గా చేసిన ఛత్రపతి, సింహాద్రి, మగధీర వంటి కథలు ఆయన కలం నుండి జాలువారినవే. రాజమౌళి లేటెస్ట్ ప్రాజెక్ట్ ఆర్ ఆర్ ఆర్ కథ కూడా విజయేంద్ర ప్రసాద్ సమకూర్చారు.
సక్సెస్ ఫుల్ రైటర్ గా తిరుగులేని విజయాలు అందుకున్న విజయేంద్ర ప్రసాద్, తాజా ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఆయన ఆలీతో సరదాగా టాక్ షోలో పాల్గొనడం జరిగింది. ఈ షోలో ఆలీ అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు.
భజరంగీ భాయ్ జాన్ కథకు చిరంజీవి పసివాడి ప్రాణం మూవీతో పోల్చారు కదా అని ఆలీ అడుగగా.. పసివాడి ప్రాణం మూవీ అంటే నాకు చాలా ఇష్టం. చాలా సార్లు చూశాను కూడా. ఓ సారి మా కుటుంబ సభ్యులతో కలిసి చూస్తున్నప్పుడు ఈ కథ చాలా బాగుంది, కొట్టేద్దామా అన్నాడట ఆయన. భజరంగీ భాయ్ జాన్ కథకు ఆ సినిమా స్ఫూర్తి అని ఆయన ఒప్పుకున్నారు.
ఇక పరిశ్రమలో రాజమౌళి కాకుండా మీకు నచ్చిన దర్శకుడు ఎవరని అడుగగా.. పూరి జగన్నాద్ పేరు చెప్పారు విజియేంద్ర ప్రసాద్. ఆయనను నేను శత్రువుగా భావిస్తాను. పూరి గారంటే నాకు ఈర్ష్య. అందుకే అతనిని రోజూ చూడడం కోసం అతని ఫోటో వాల్ పేపర్ గా పెట్టుకున్నాని మొబైల్ స్క్రీన్ చూపించాడు విజయేంద్ర ప్రసాద్.
ఒక రచయితగా మంచి కథలు రాసే పూరి జగన్నాధ్ అంటే తనకు ఇష్టంతో పాటు, పోటీగా ఫీల్ అవుతానని పరోక్షంగా ఆయన చెప్పడం జరిగింది.
రచయితలు కథలు రాయడానికి కొందరు విదేశాలకు, కొందరు విహార ప్రాంతాలకు వెళతారు. మీరు కథలు ఎక్కడ రాస్తారని అడుగగా.. నేను నాలుగు గోడల మధ్య ఆఫీస్ లో కూర్చొని కథ రాసుకుంటాను. పేరుకు స్టార్ రైటర్ నే కానీ ఒక్కడు కూడా ఎక్కడికి తీసుకెళ్లేదని చమత్కరించారు.
మీరు రైటర్ గా సక్సెసా లేక డైరెక్టర్ గా సక్సెసా అన్న ప్రశ్నకు. రైటర్ గానే సక్సెస్ అన్నారు విజయేంద్ర ప్రసాద్. డైరెక్టర్ గా ఎందుకు సక్సెస్ కాలేకపోయారని అడుగగా అది తెలిస్తే రెండు మూడు హిట్ సినిమాలు తీసేవాడిని అన్నారు.
ఇక తన దర్శకత్వంలో వచ్చిన రాజన్న సినిమా చూసి మెచ్చకున్న కొడుకు రాజమౌళి, శ్రీవల్లి సినిమా చూసి మీకు దర్శకత్వం రాదని చెప్పాడని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.
చివరిగా ఆర్ ఆర్ ఆర్ గురించి కూడా ఆయన కొన్ని ఆసక్తికర అప్డేట్స్ ఇచ్చారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తాను చూశానని, చాలా బాగా ఉందని ఆయన తెలియజేశారు.