రజినీకాంత్ సోదరుడికి గుండెపోటు.. బెంగళూరుకు హుటాహుటిన సూపర్ స్టార్
Rajinikanth Brother: నటుడు రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణకు అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. ఆయన్ని చూసేందుకు రజినీ బెంగళూరు వెళ్లారు.

రజినీకాంత్ సోదరుడికి గుండెపోటు
బెంగళూరులోని హోసకెరెహళ్లిలో నివసించే సూపర్ స్టార్ రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఐసీయూలో ఉన్న సత్యనారాయణకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
అన్నయ్య కోసం హుటాహుటిన బెంగళూరుకు
సత్యనారాయణ వయసు ప్రస్తుతం 84 ఏళ్లు. తన సోదరుడిని ఆసుపత్రిలో చేర్చారన్న వార్త తెలియగానే నటుడు రజినీకాంత్ వెంటనే చెన్నై నుంచి బెంగళూరుకు బయలుదేరారు. రజినీ సోదరుడు ఆసుపత్రిలో చేరారని తెలిసి, ఆయన త్వరగా కోలుకోవాలని సూపర్ స్టార్ అభిమానులు ప్రార్థిస్తున్నారు.
వరుసగా ఆసుపత్రి పాలవుతున్న సత్యనారాయణ
ఆసుపత్రిలో ఉన్న తన సోదరుడిని రజినీకాంత్ పరామర్శిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రజినీకాంత్ తన అన్నయ్యను ఎంతగానో గౌరవిస్తారు. ఆయన తనకు అన్నయ్య కాదు, తండ్రి లాంటి వారని రజినీకాంత్ చాలా వేదికలపై చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సత్యనారాయణ ఆరోగ్యం క్లిష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది.కొంత కాలం క్రితం సత్యనారాయణకి మోకాలి శస్త్ర చికిత్స జరిగింది. ఆపైన ఆయనకి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చాయి.