- Home
- Entertainment
- ఒక్క మనిషిలో ఇంత టాలెంటా? బిగ్ బాస్ అగ్నిపరీక్ష లో జడ్జ్ లను కదిలించిన ప్రసన్న కుమార్ కథ
ఒక్క మనిషిలో ఇంత టాలెంటా? బిగ్ బాస్ అగ్నిపరీక్ష లో జడ్జ్ లను కదిలించిన ప్రసన్న కుమార్ కథ
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం అగ్ని పరీక్ష కొనసాగుతోంది. సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకునే ఆలోచనతో జరుగుతున్న ఈ సెలక్షన్స్ లో, జడ్జ్ లకు షాక్ ల మీద షాకులు ఇస్తున్నారు కంటెస్టెంట్లు. కొంత మంది మాత్రం తమ టాలెంట్ తో మెస్మరైజ్ చేస్తున్నారు.

సామాన్యులను తీసుకోవాలని
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో సామాన్యులను తీసుకోవాలనే కొత్త కాన్సెప్ట్ తో బిగ్ బాస్ టీమ్ స్టార్ట్ చేసిన కార్యక్రమం బిగ్ బాస్ అగ్నిపరీక్ష. ఇందులో భాగంగా నవదీప్, అభిజీత్, బిందుమాధవి మగ్గురు కలిసి కంటెస్టెంట్స్ ను సెలక్ట్ చేసే పనిలో ఉన్నారు. అయితే సామాన్యులు ఒక్కొక్కరు తమ టాలెంట్ ను చూపిస్తూ, జడ్జ్ లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలో ఫస్ట్ ఎపిసోడ్ లో కొంత మంది కంటెస్టెంట్స్ ఏమాత్రం సాధన లేకుండా వచ్చి.. ఏం చేయలేక తేలిపోయారు. కొంత మంది కాస్త టాలెంట్ చూపించినా.. జడ్జ్ ల నుంచి మాత్రం ఫుల్ మార్క్స్ కొట్టేయలేకపోయారు. ఈక్రమంలో ఆయూబ్ అనే మోడల్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలని ఎంతో ఆశతో అగ్నిపరీక్షకు వచ్చాడు. మంచి ఫిజిక్ కలిగిన యంగ్ పర్సన్.. టాకింగ్ టాలెంట్ ను కూడా చూపించాడు. కండల ప్రదర్శనతో పాటు, తాను ఏం చేయాలి అనుకున్నది క్లియర్ గా చెప్పాడు. కాని చివరిగా జడ్జ్ ల నుంచి ఫుల్ మార్క్స్ సాధించలేకపోయాడు.
అగ్నిపరీక్ష గెలిచిన ఇద్దరు
ఇక బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఫస్ట్ ఎపిసోడ్ లో ఇద్దరే ఇద్దరు ఫుల్ మార్క్స్ సాధించి నెక్ట్స్ రౌండ్ కు వెళ్ళారు. అందులో మొదటగా వచ్చిన దివ్యతో పాటు, చివరిగా వచ్చిన ప్రసన్న కుమార్ కూడా ఫుల్ మార్క్స్ సాధించారు. ఒక కాలును కోల్పోయినా.. ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా, పట్టుదలతో ఎన్నో సాధించాడు ప్రసన్న కుమార్. దివ్యాంగుడైన ప్రసన్నకుమార్ బిగ్ బాస్ అగ్నిపరీక్షలో ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు. ఇతను ఫోటోగ్రాఫర్, ట్రావెలర్, లెక్చరర్, జావెలిన్ త్రో స్టేట్ ప్లేయర్, బాడీ బిల్డర్, బైక్ రైడర్. మారథాన్‌లో పరిగెత్తి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఇవన్నీ ఒక కాలుతోనే చేయగలిగాడు ప్రసన్న.
కాలు కోల్పోయిన ప్రసన్న కుమార్
కాలేజీ చదువుతున్న రోజల్లో యాక్సిడెంట్ వల్ల కాలు కోల్పోయిన ప్రసన్న అక్కడితో జీవితం ఆపేయకుండా కష్టపడుతున్నాడు. తన టాలెంట్ ను వివిధ రంగాల్లో చూపిస్తున్నాడు. ఇక అగ్నిపరీక్షలో నవదీప్ అదే ప్రశ్న అడిగారు. మీరు ఇవన్నీ యాక్సిడెంట్ తరువాత సాధించారా అని, అన్ని తాను ఒక్క కాలుతోనే సాధించానని ప్రసన్న చెప్పగానే నవదీప్ లేచి నిల్చొని చపట్లు కొట్టారు. నవదీప్ మాట్లాడుతూ, ‘’ మీ గురించి చాలా తెలుసుకోవాలి. కాని ముందు మీకు నేను గ్రీన్ ఇచ్చిన తరువాత మాట్లాడుతాను'' అని అన్నారు నవదీప్. 'అగ్నిపరీక్ష'లో ప్రసన్నకుమార్ తన జర్నీ గురించి వివరించారు.
ప్రసన్న కుమార్ పట్టుదలకు జడ్జెస్ ఫిదా
ప్రసన్న కుమార్ స్టోరీ విన్న జడ్జెస్ ఫిదా అయిపోయారు. బిగ్ బాస్ లోకి ఎందుకు రావాలి అనుకుంటున్నారని బిందు మాధవి అతన్ని అడిగారు. దానికి ప్రసన్న మాట్లాడుతూ.. ‘’నేను నిలబడడమే గొప్ప, నడవడం, పరిగెత్తడం ఇవన్నీ చేయడం బిగ్గెస్ట్ అఛీవ్‌మెంట్, అందుకే ఒక కాలుతో నేను ఇంత సాధించాను. నన్ను చూసి ఎంతో కొంత మార్పు వస్తే బాగుంటుంది అని నాప్రయత్నం ‘’ అంటూ ప్రసన్నకుమార్ చెప్పగా... 'మీ కథను మేము ప్రపంచానికి చూపించకుంటే మాకు నిద్ర ఉండదు.' అందుకే మీరు బిగ్ బాస్ లో ఉండాలి, అని అందరు జడ్జులు ప్రసన్నకు గ్రీన్ ఇచ్చారు. దాంతో ప్రసన్న నెక్ట్స్ రౌండ్ కు సెలక్ట్ అయ్యారు.
గతంలో కూడా
ఇక ప్రసన్న కుమార్ ఇప్పుడే కాదు గతంలో కూడా ఆహా అన్ స్టాపబుల్ విత్ NBK షో లో కనిపించారు. బాలయ్య స్వయంగా ప్రసన్న కుమార్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి అభినందించాడు కూడా. అలాంటి వ్యక్తి బిగ్ బాస్ షోలో అడుగు పెడితే చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని బిగ్ బాస్ అభిమానులు భావిస్తున్నారు. అయితే తాను కూడా బిగ్ బాస్ కు రావడం అనేది నలుగురుకి ఆదర్శంగా ఉంటుందని, అందుకే బిగ్ బాస్ లోకి రావాలి అనుకుంటున్నట్టు ప్రసన్న కుమార్ వెల్లడించడం విశేషం.