- Home
- Entertainment
- గెస్ట్ లుగా స్టార్స్.. ప్రభాస్, బన్నీ, చరణ్, విజయ్, రజనీ, షారూఖ్, సల్మాన్ వరుసగా అతిథి పాత్రలు..
గెస్ట్ లుగా స్టార్స్.. ప్రభాస్, బన్నీ, చరణ్, విజయ్, రజనీ, షారూఖ్, సల్మాన్ వరుసగా అతిథి పాత్రలు..
తోటి హీరో సినిమాల్లో అతిథి పాత్రలో మెరవడమనేది ఇప్పుడొక ట్రెండ్‌లా మారిపోయింది. గతంలో అడపాదడపా ఇలాంటి సంఘటనలు సినిమాల్లో జరిగేవి. అవి సినిమాలో క్రేజ్‌ని తీసుకొచ్చేవి. కానీ ఇప్పుడు ఓ ట్రెండ్‌లా మారింది. టాప్ స్టార్స్ సైతం తోటి హీరోల సినిమాల్లో అతిథి పాత్రలో నటించేందు సుముఖత చూపుతున్నారు. సక్సెస్‌లో భాగమవుతున్నారు. తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ పలు సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఇటీవల `విక్రమ్` సినిమాలో సూర్య గెస్ట్ రోల్ చేసి సినిమా హిట్ క్రెడిట్‌లో తన వంతు భాగమయ్యారు. అలాగే బాలీవుడ్ సంచలనం `పఠాన్`లో సల్మాన్ గెస్ట్ రోల్ చేశారు. వీరి పాత్రలు సినిమాకి ఎంతటి క్రేజ్‌ని, మైలేజ్‌ని తీసుకొచ్చాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రానున్న సినిమాల్లో ఈ గెస్ట్ రోల్స్ లో మెరవడం మరింత ఊపందుకున్నా. ఐదారు సినిమాల్లో సూపర్ స్టార్స్ గెస్ట్ లుగా నటించబోతుండటం విశేషం. ఆ వివరాలు చూస్తే,
లోకేష్ కనగరాజ్ .. విజయ్ హీరోగా రూపొందిస్తున్న చిత్రం `లియో`. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తోన్న చిత్రమిది. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. సహజంగా లోకేష్ సినిమాల్లో క్లైమాక్స్ లో గెస్ట్ రోల్‌లో స్టార్ హీరోలను దింపి సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తున్నారు. కమల్ నటించిన `విక్రమ్`లో రోలెక్స్ పాత్రలో సూర్యని దించి వాహ్ అనిపించారు. సూర్య ఎంట్రీతో సినిమా ఇంకో స్థాయికి చేరుకుంది. అది సీక్వెల్‌కి హింట్‌గానూ మారింది. ఇప్పుడు విజయ్‌తో చేస్తున్న `లియో`లోనూ గెస్ట్ రోల్ ఉండబోతుందట. అందులో రామ్‌చరణ్ కనిపించనున్నారని సమాచారం. డాన్ పాత్రలో చరణ్‌ని చివర్లో చూపించబోతున్నారట. చెర్రీ కూడా ఓకే చెప్పారని సమాచారం.
ప్రభాస్ సైతం ఫస్ట్ టైమ్ గెస్ట్ గా కనిపించనున్నారు. ఆయన బాలీవుడ్ మూవీ `ఫైటర్`లో అతిథి పాత్రలో నటించబోతున్నారట. `పఠాన్`ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్ హీరోగా `ఫైటర్` చిత్రం రూపొందుతుంది. ఇందులో గెస్ట్ రోల్ లో ప్రభాస్‌ని అడగ్గా, ఆయన ఓకే చెప్పారట. షారూఖ్ `పఠాన్`లోనూ సల్మాన్‌ని గెస్ట్ రోల్ చేయించిన విషయం తెలిసిందే. సల్మాన్, షారూఖ్ ఒకరి సినిమాల్లో ఒకరు గెస్ట్ గా చేయడం అనవాయితీగానూ వస్తుంది. దీనికితోడు సిద్ధార్థ్ ఆనంద్‌తో ప్రభాస్ నెక్ట్స్ ఓ సినిమా చేస్తున్నారు. ఆ చనువుతో `ఫైటర్`లో చేసేందుకు ఓకే చెప్పారని టాక్.
మరోవైపు సల్మాన్ హీరోగా రూపొందుతున్న `టైగర్3`లో షారూఖ్, రామ్‌చరణ్ నటిస్తున్నారు. ఇటీవల `గాఢ్ ఫాదర్` చిత్రంలో సల్మాన్ కీలక పాత్రలో మెరిశారు. చరణ్‌తో ఉన్న స్నేహం కోసం ఆయన ఇందులో నటించినట్టు చిరు చెప్పారు. అందులో భాగంగానే `టైగర్3`లో షారూఖ్ ఖాన్‌తోపాటు చరణ్ మెరవనున్నారని టాక్. ఇదిలా ఉంటే ప్రస్తుతం సల్మాన్ నటిస్తున్న మరో మూవీ `కిసి కా భాయ్ కిసి కి జాన్` చిత్రంలో వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తుండగా, ఓ పాటలో చరణ్ మెరవనున్నారు.
షారూఖ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో `జవాన్` మూవీ తెరకెక్కుతుంది. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ రోల్ చేస్తున్నారట. బన్నీ మాత్రమే కాదు, దళపతి విజయ్ కూడా గెస్ట్ రోల్‌లో మెరవనున్నారు. దర్శకుడు అట్లీ కోసం ఈ ఇద్దరు `జవాన్`లో నటించబోతున్నట్టు సమాచారం. అట్లీతో ఆల్‌రెడీ విజయ్ `థెరి`, `మెర్సల్`, `బిగిల్` చిత్రాలు చేశారు. బన్నీతో నెక్ట్స్ ఓ సినిమా చేయబోతున్నారు అట్లీ. ఆ పరిచయంతోనూ అల్లు అర్జున్ ఈ సినిమాలో గెస్ట్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీలోనే ఇద్దరు సూపర్‌స్టార్లు గెస్ట్ లుగా కనిపించబోతుండటం విశేషం. రజనీకాంత్ ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో `జైలర్` సినిమా చేస్తున్నారు. ఇందులో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్ చేస్తుండటం విశేషం. అంతేకాదు తన కూతురు ఐశ్వర్యా రజనీకాంత్ రూపొందిస్తున్న `లాల్ సలామ్` మూవీలో రజనీ గెస్ట్ గా కనిపించబోతున్నారు.
ఇలా బాలీవుడ్ టూ టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్, మాలీవుడ్.. అందరు సూపర్ స్టార్లు గెస్ట్ రోల్ చేస్తుండటం, ఏక కాలంలో వివిధ సినిమాల్లో అతిథులుగా కనిపించబోతుండటం అభిమానులకు కళ్ల సంబురంగా ఉండబోతుంది. తెరపై తమ అభిమాన హీరోలను చూడ్డానికి వారికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. ఇది ఇప్పుడు నయా ట్రెండ్‌గా మారడం విశేషం.
ప్రస్తుతం ఇండియన్ సినిమాలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. పాన్ ఇండియా ట్రెండ్ ఊపందుకుంది. భాషాభేదం అనే బౌండరీలు చెదిరిపోతున్నాయి. దీంతో హీరోలు ఇతర భాషల్లో మార్కెట్‌ని, ఇమేజ్‌ని పెంచుకునే పనిలో పడుతున్నారు. ఇతర స్టార్ హీరో సినిమాల్లో నటించడం వల్ల తమ మార్కెట్ పెరగడంతోపాటు, ఆ హీరోతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. అది తమ సినిమాలకు ఉపయోగపడుతుంది. తాను నటించే సినిమాలకు ఆయా భాషల్లో ఆయా హీరోల అభిమానుల ఆదరణ దక్కుతుంది. ఇలా ఇచ్చిపుచ్చుకోవడం అటు సినిమాకి, ఇటు వ్యక్తులుగా ఇద్దరికీ ఉపయోకరంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమలో మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది.