- Home
- Entertainment
- పూజా, రష్మిక, అనుష్క, కృతిశెట్టి, నభా, శ్రీలీల.. టాలీవుడ్‌ని ఊపేస్తున్న కన్నడ భామలు.. వీరుంటే హిట్టే?
పూజా, రష్మిక, అనుష్క, కృతిశెట్టి, నభా, శ్రీలీల.. టాలీవుడ్‌ని ఊపేస్తున్న కన్నడ భామలు.. వీరుంటే హిట్టే?
తెలుగులో స్టార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు పూజా హెగ్డే, రష్మిక మందన్నా, అనుష్క శెట్టి, కృతి శెట్టి, నేహా శెట్టి, శ్రీలీల, నభా నటేష్, వర్ష బొల్లమ్మ వంటి కథానాయికలు. వీరు హీరోయిన్‌గా ఉంటే సినిమా హిటే అనే పేరుని తెచ్చుకున్నారీ కన్నడ భామలు.

ఒకప్పుడు టాలీవుడ్‌లో హీరోయిన్ అంటూ ముంబయి నుంచీ తీసుకురావాల్సిందే అనే మాట వినిపించేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కన్నడ నుంచి తీసుకురావాలనే పరిస్థితులొచ్చాయి. ప్రస్తుతం టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేస్తున్న స్టార్ హీరోయిన్లలో మేజర్‌గా కన్నడ భామలే ఉండటం విశేషం. పూజా హెగ్డే, రష్మిక మందన్నా, అనుష్క శెట్టి, కృతి శెట్టి, నేహా శెట్టి, శ్రీలీల, నభా నటేష్, వర్ష బొల్లమ్మ వంటి కన్నడ హీరోయిన్లు ఇప్పుడు తెలుగులో స్టార్లుగా రాణిస్తున్నారు. సక్సెస్‌కి కేరాఫ్‌గా నిలుస్తున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తుంది పూజా హెగ్డే. `ముకుందా`, `ఒక లైలా కోసం` చిత్రాలతో తెలుగు తెరని పలకరించిన ఈ భామ ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. స్టార్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా, అత్యంత కాస్ట్లీ హీరోయిన్‌గా రాణిస్తుంది. లక్కీ హీరోయిన్‌గానూ పేరుతెచ్చుకున్న ఈ భామ కర్నాటకలోని ఉడిపికి చెందిన అమ్మాయి కావడం విశేషం. ప్రస్తుతం పూజా `రాధేశ్యామ్`, `ఆచార్య`, మహేష్-త్రివిక్రమ్ సినిమా, పవన్-హరీష్ శంకర్ చిత్రాలు చేస్తుంది.
నేషనల్ క్రష్‌గా, అత్యంత క్రేజీ హీరోయిన్‌గా రాణిస్తున్న రష్మిక మందన్నా `ఛలో` చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది. `గీతగోవిందం`, `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ`, `పుష్ప` చిత్రాలతో విజయాలు అందుకుని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ రాణిస్తున్న ఈ భామ పూర్తి కన్నడ(విరాజ్‌పేట్) భామే కావడం విశేషం. ప్రస్తుతం తెలుగులో `పుష్ప 2`లో నటిస్తుంది రష్మిక. బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సినిమాలున్నాయి.
ఇక టాలీవుడ్‌లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న అనుష్క శెట్టి కన్నడ భామలకు పెద్ద దిక్కుగా ఉందని చెప్పొచ్చు. `సూపర్`తో ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల సోయగం టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడు సెలెక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. స్వీటీది కూడా కన్నడనే. మంగుళూరుకి చెందిన ఈ భామ ఇప్పుడు కొంత గ్యాప్‌తో మళ్లీ తెలుగులో సందడి చేయడానికి రాబోతుంది.
టాలీవుడ్‌లో తొలి చిత్రంతోనే స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది కృతి శెట్టి. `ఉప్పెన`తో ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయిన కృతి శెట్టి ఇప్పుడు టాలీవుడ్‌లో లక్కీ ఛార్మ్ గా నిలుస్తుంది. సక్సెస్‌కి పర్యాపదంగా నిలుస్తుంది. మరోవైపు `అ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, `మాచెర్ల నియోజకవర్గం`, `ది వారియర్స్` చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న కృతి శెట్టిది కూడా కన్నడనే. ఈ మంగుళూరుకి చెందిన తులు ఫ్యామిలీ నుంచి వచ్చింది. టాలీవుడ్‌ని షేక్ చేస్తుంది.
`చూసి చూడంగానే`, `జాను`, `మిడిల్ క్లాస్ మెలోడీస్`, `పుష్పక విమానం` చిత్రాలతో వరుస సక్సెస్‌లు అందుకున్న వర్ష బొల్లమ్మ కూడా కన్నడ హీరోయినే. కూర్గ్ కి చెందిన వర్ష ఇప్పుడు `స్టాండ్ ఆప్ రాహుల్`, `స్వాతిముత్యం` చిత్రాల్లో నటిస్తుంది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది.
`ఇస్మార్ట్ శంకర్` చిత్రంతో టాలీవుడ్‌లో హాట్ హీరోయిన్‌గా, సెన్సేషన్ బ్యూటీగా నిలిచిన నభా నటేష్ కూడా కన్నడ భామనే. ఉడిపికి చెందిన నభా నటేష్ `నన్ను దోచుకుందువటే`, `ఇస్మార్ట్ శంకర్`,`డిస్కోరాజా`, `సోలోబ్రతుకే సో బెటర్`, `అల్లుడు అదుర్స్` , `అంధాదూన్` వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఇటీవల `పెళ్లిసందడి`తో అందరి హృదయాలను గెలుచుకుంది శ్రీలీల. ప్రస్తుతం యంగ్ స్టర్స్ కి బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్న శ్రీలీల కూడా కన్నడ అమ్మాయినే.
`మెహబూబా`, `గల్లీ రౌడీ`, `డీజే టిల్లు` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ని పలకరించింది నేహాశెట్టి. `డీజే టిల్లు`తో స్ట్రాంగ్ హిట్‌ని అందుకుని ప్రామిసింగ్ హీరోయిన్‌గా నిలిచిన నేహా శెట్టి సైతం మంగుళూరుకి చెందిన భామ కావడం విశేషం. ఇలా కన్నడకి చెందిన హీరోయిన్లు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేస్తున్నారు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న దీపికా పదుకొనె ఇప్పుడు ప్రభాస్‌తో `ప్రాజెక్ట్ కే`లో నటిస్తుంది. ఆమెది కూడా బెంగుళూరే కావడం విశేషం.