పల్లవి ప్రశాంత్ మరోసారి బిగ్ బాస్ హౌజ్‌లోకి.. ఆ డిమాండ్ వెనుక కారణం ఇదే
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌కి సంబంధించిన అదిరిపోయే వార్త వైరల్‌గా మారింది. ఈ సారి షోకి పల్లవి ప్రశాంత్ కంటెస్టెంట్‌గా రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది.

బిగ్ బాస్ తెలుగు 9 ప్రారంభానికి సన్నాహాలు
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌కి రంగం సిద్ధమవుతుంది. మరో ఐదు రోజుల్లోనే ఇది స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం కంటెస్టెంట్లని ఫైనల్ చేయడంతోపాటు ఏవీలు షూట్ చేస్తున్నారట. మరోవైపు అగ్నిపరీక్ష ద్వారా వచ్చే కామనర్స్ కి సంబంధించిన ఎంపికపై కూడా ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బిగ్ బాస్ 9 లోకి రాబోతున్న కంటెస్టెంట్లకి సంబంధించిన వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
బిగ్ బాస్ తెలుగు 9లోకి పల్లవి ప్రశాంత్?
తాజాగా ఓ క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సారి హౌజ్‌లోకి బిగ్ బాస్ విన్నర్‌ని దించబోతున్నారట. బిగ్ బాస్ తెలుగు 7లో విన్నర్‌గా నిలిచిన పల్లవి ప్రశాంత్ మరోసారి బిగ్ బాస్ హౌజ్‌లోకి రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ సారి బిగ్ బాస్ షోని రక్తికట్టించేలా, బాగా టీఆర్‌పీ రేటింగ్ వచ్చేలా షోని ప్లాన్ చేస్తున్నారట. ట్విస్ట్ లు, టర్న్ లు చాలా ఉంటాయట. ఈ సారి రణరంగమే అని పదే పదే ప్రోమోల్లో చెబుతున్నాడు నాగార్జున. అదే రేంజ్‌లో షోని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
షోని రక్తికట్టించేందుకు పల్లవి ప్రశాంత్‌ని దించుతున్నారా?
అందులో భాగంగానే మరోసారి పల్లవి ప్రశాంత్‌ని హౌజ్‌లోకి తీసుకురాబోతున్నట్టు ఓ వార్త వైరల్‌గా మారింది. 7వ సీజన్‌లో పాల్గొన్న ప్రశాంత్ `అన్నా మల్లొచ్చినా.. తగ్గేదెలే` అంటూ హౌజ్‌లో తనదైన స్టయిల్‌లో రచ్చ చేశాడు. నామినేషన్లలో గట్టిగా వాదించి ఇతర కంటెస్టెంట్లకు చుక్కలు చూపించాడు. గొడవలు క్రియేట్ చేసి కంటెంట్ ఇవ్వడంలో ముఖ్య పాత్ర పోషించారు. అందుకే ఈ సారి మళ్లీ పల్లవి ప్రశాంత్‌ని తీసుకురావాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనికితోపాడు అభిమానుల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తుంది. మరోసారి పల్లవి ప్రశాంత్‌ని హౌజ్‌లోకి తీసుకురావాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారట. మరి నిజంగానే పల్లవి ప్రశాంత్‌ని తీసుకొస్తారా? ఆయన వస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది.
బిగ్ బాస్ తెలుగు 9 కంటెస్టెంట్లు వీరే
అయితే తెలుస్తోన్న సమాచారం ప్రకారం పల్లవి ప్రశాంత్ రావడం లేదని, ఆయన్ని అప్రోచ్ కాలేదని సమాచారం. ఆల్‌రెడీ విన్నర్ అయ్యాక మళ్లీ రావడం కష్టం. అయితే ఫ్యాన్స్ డిమాండ్ మేరకు మధ్యలో తీసుకొస్తారా? లేక గెస్ట్ లాగా ఏదైనా ప్లాన్ చేస్తారా? అనేది చూడాలి. ఇక ఈ సారి హౌజ్‌లోకి వచ్చే కంటెస్టెంట్లలో దీపికా, తేజస్విని గౌడ, శివ కుమార్, బంచిక్ బబ్లూ, భరణి, సుధాకర్ కోమాకుల, సుమంత్ అశ్విన్, తనూజా, దేబ్జానీ, ఇమ్మాన్యుయెల్, కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ, సాయి కిరణ్, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య, ఆశా షైనీ, నాగదుర్గ వంటి వారి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు ఐదుగురు కామనర్స్ రాబోతున్నారు.
సెప్టెంబర్ 7న గ్రాండ్‌గా `బిగ్ బాస్ తెలుగు 9` ప్రారంభం
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్‌లోకి మొదటి 18 మంది కంటెస్టెంట్లని పంపించబోతున్నారట. తొమ్మిది జంటలుగా వీరిని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. నాగార్జున హోస్ట్ గా చేయబోతున్న ఈ షో సెప్టెంబర్ 7న ప్రారంభం కానుంది. స్టార్ మాలో రోజూ రాత్రి 9.30గంటలకు ప్రసారం కానుంది. అలాగే జీయో హాట్ స్టార్‌లో లైవ్‌స్ట్రీమింగ్ కానుంది.