ఎన్టీఆర్ మీద కోపంతో సినిమా తీసి, అప్పులపాలైన స్టార్ హీరో ఎవరో తెలుసా?
NTR vs Krishna : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దేవుడిగా కొలిచే ఎన్టీఆర్ కు పోటీగా పనిచేసిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. కానీ ఆయనతో పోటీపడి గెలవడం అంత ఈజీ కాదు. ఎన్టీఆర్ కు పోటీగా సినిమా తీసి.. అప్పులపాలైన స్టార్ హీరో ఎవరో మీకు తెలుసా?

టాలీవుడ్ కీర్తి కిరీటం
తెలుగు సినీ పరిశ్రమకు మొదటి తరం హీరోలుగా ఎన్టీఆర్, ఏఎన్నార్ ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ను తెలుగు జనాలు దేవుడిలా కొలుస్తుంటారు. ఆయన చేసిన భక్తి సినిమాలు, ఆయన చేసిన పాత్రలు తెలుగువారి మనసుల్లో నిలిచిపోయాయి. రాముడిగా, కృష్ణుడిగా, బ్రహ్మేంద్రస్వామిగా, శంకరుడిగా, ఎన్టీఆర్ ను రకరకాల పాత్రల్లో చూసిన ఆనాటిప్రేక్షకులు.. ఎన్టీఆర్ ను భగవంతుడిగా కొలిచేవారు. తిరుపతి యాత్రలకు వెళితే.. అటునుంచి చెన్నై వెళ్లి.. ఎన్టీఆర్ దర్శనం కూడా చేసుకుని వచ్చేవారు. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తో విభేదించిన హీరోలు కూడా ఉన్నారు. ఆయకు పోటీగా సినిమాలు చేసినవారు కూడా లేకపోలేదు. మరీ ముఖ్యంగా ఎన్టీరామారావుతో కృష్ణకు ఎక్కువగా కోల్డ్ వార్ నడించింది. పెద్దాయనకు వ్యతిరేకంగా కృష్ణ సినిమాలు కూడా చేశారు.
ఎన్టీ రామారావు మీద పోటీగా..
టాలీవుడ్ చరిత్రలో అలనాటి స్టార్ హీరోల మధ్య పోటీ హోరా హోరీగా జరిగేది. అయితే అందులో కొంత మంది మధ్య మాత్రం కోల్డ్ వార్ గట్టిగా నడిచేది. ముఖ్యంగా నందమూరి తారక రామారావు , సూపర్ స్టార్ కృష్ణ మధ్య పోటీ అప్పటి సినీ వర్గాల్లో ఎక్కువ చర్చకు దారితీసింది. ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలు చూసి.. నటుడు కావాలన్న కోరికతో.. ఇండస్ట్రీకి వచ్చిన కృష్ణ.. ఆతరువాత కాలంలో ఎన్టీఆర్ తో పోటీగా సినిమాలు చేశారు. ఎన్టీఆర్ వద్దు బ్రదర్ అని చెప్పినా కూడా వినకుండా కృష్ణ సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ వద్దన్నా కృష్ణ తీసి సక్సెస్ అయిన సినిమా అల్లూరి సీతారామరాజు ఒక్కటే. కానీ ఒకసారి మాత్రం ఎన్టీఆర్ మీద పైచేయి సాధించాలన్నఆలోచనతో.. పౌరాణిక సినిమా చేసి, చేతులు కాల్చుకున్నారు సూపర్ స్టార్.
దానవీరశూరకర్ణ వర్సెస్ కురుక్షేత్రం
ఎన్టీ రామారావు దానవీరశూరకర్ణ సినిమా చేయాలి అనుకున్నారు. ఈసినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించాలని ఆయన ప్లాన్ చేశారు. దీని గురించి చాలా కాలం బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా చేశారు ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ లా పౌరాణిక పాత్రలు ఎవరూ చేయలేరు అన్న పేరు అప్పట్లో ఉండేది. సరిగ్గా అప్పుడే ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ సినిమాకు పోటీగా కృష్ణ కురుక్షేత్రం మొదలు పెట్టారు. ఎన్టీఆర్ సినిమాకు పోటీగా ఈసినిమాను నిలబెట్టి విజయం సాధించి చూపించాలని కృష్ణ అనుకున్నారు. అప్పుడు ఎన్టీఆర్ కృష్ణను పిలిచి.. పౌరాణిక సినిమాలు చేసి ఇబ్బంది పడతావ్ బ్రదర్.. వద్దు ఆ ప్రయత్నం మానుకో అని చెప్పారట. కానీ కృష్ణ మాత్రం.. ఆ విషయాన్ని నెగెటీవ్ గా తీసుకున్నారని.. ఓ ఇంటర్వ్యూలో నటుడు చలపతిరావు చెప్పారు.
40 రోజుల్లో సినిమా పూర్తి చేసిన ఎన్టీ రామారావు
అంతే కాదు ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ చిత్రానికి పెద్ద పెద్ద నటులు ఎవరు దొరకకుండా ఉండేందుకు.. ముందుగానే అందరిని బుక్ చేశారట కృష్ణ. వారు ఎన్టీఆర్ సినిమా కోసం అందుబాటులో ఉండకూడదని.. అందరిని అవుట్‌డోర్ షూటింగ్‌కు తీసుకెళ్ళారట. ఇక అప్పుడు ఎన్టీఆర్ తనకు అందుబాటులోఉన్న నటీనటులతోనే దానవీరశూరకర్ణ సినిమాను స్టార్ట్ చేశారు. తన ఇద్దరు కొడుకులు హరికృష్ణ, బాలకృష్ణలు కూడా ఈ సినిమాల నటించారు. చలపతిరావు అయితే ఏకంగా ఈసినిమాలో 5 పాత్రల్లోకనపించారు. అందుబాటులో ఉన్ననటులతో పాటు, తానే నాలుగు విభిన్న పాత్రల్లో నటిస్తూ దానవీరశూరకర్ణ సినిమాను కేవలం 40 రోజుల్లో పూర్తిచేశారు ఎన్టీఆర్.
బ్లాక్ బస్టర్ గా నిలిచిన దానవీరశూరకర్ణ
చివరకు రెండు సినిమాలు విడుదలయ్యే సరికి పరిస్థితి స్పష్టమైంది. దానవీరశూరకర్ణ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి విశేష విజయాన్ని అందుకుంది. కానీ కురుక్షేత్రం మాత్రం భారీ డిజాస్టర్‌గా మారింది. ఈ సినిమా పరాజయం కారణంగా పద్మాలయ స్టూడియో కూడా తీవ్ర ఆర్థిక సమస్యల్లోకి వెళ్లిందని ఇండస్ట్రీ లో గట్టి టాక్ నడిచింది. సినిమా వల్ల కృష్ణకు అప్పులు పెరిగాయని కూడా అంటుంటారు. .అప్పటి పరిస్థితుల్లో కృష్ణను ఎన్టీఆర్‌తో పోటీ చేయొద్దని పలువురు సూచించినప్పటికీ, ఆయన వినేవారు కాదట. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళిన తరువాత కృష్ణ కూడా పాలిటిక్స్ లోకి వెళ్లారు. ఎంపీగాపోటీ చేసి గెలిచారు. అయితే తాను రాజీవ్ గాంధీ రిక్వెస్ట్ చేయడంతోనే పాలిటిక్స్ లోకి వెళ్లానని కృష్ణ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాజీవ్ గాంధీ మరణం తరువాత కృస్ణ రాజకీయాలకు దూరం అయ్యారు. ఎంత పోటీపడ్డా.. ఎన్టీఆర్ కృష్ణ మాత్రం ఆతరువాత కాలంలో.. ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. జరిగినవన్నీ మర్చిపోయి సొంతవారిలా మెలిగారని.. విజయనిర్మల ఓ సందర్భంలో వెల్లడించారు. చివరి రోజుల్లో.. ఎన్టీఆర్ భోజనానికి పిలిచి.. స్వయంగా వడ్డించిన రోజును ఆమె గుర్తుచేసుకున్నారు.