పుష్ప 2 విషాదం: బెనిఫిట్ షోలకు తెలంగాణ సర్కార్ బ్రేక్
పుష్ప 2 ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని ప్రకటించింది. ఈ నిర్ణయం సంక్రాంతి సినిమాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
Pushpa 2, Box Office, sukumar, allu arjun
తెలంగాణా ప్రభుత్వం సినిమా పరిశ్రమకు చేయగలగిన మేరకు చేస్తూనే వస్తోంది. ముఖ్యంగా బెనిఫిట్ షోలు, ఫ్యాన్స్ షోలకు, రేట్లు పెంచుకునేందుకు ఫర్మిషన్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ‘దేవర’, ‘పుష్ప 2’లకు భారీ ఎత్తున బెనిఫిట్ షోలు వేసారు నిర్మాతలు. మంచి లాభాలు వచ్చాయి.
అయితే ఇక మీదట తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు నో చెప్పబోతోంది. ఈ మేరకు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ కీలక నిర్ణయం తీసుకొన్నారు. ఇక మీదట తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వమని ప్రకటించారు. దానికి పుష్ప 2నే కారణం.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన బాధ కలిగించిందన్నారు. రేవతి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇక నుంచి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వమంటూ సంచలన ప్రకటన చేశారు. హీరోలు అలాంటి టైంలో వెళ్ళడం కరెక్టేనా అని ప్రశ్నించారు. ఈ ఘటనపై చట్ట పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై హీరో కానీ చిత్ర యూనిట్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. మనిషి ప్రాణం తీస్కొస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలకోట్ల కలక్షన్స్ అని చెప్తున్నారు కదా బాధితులకు 25 లక్షలు ఇవ్వాలని.. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘ఆ సినిమా హీరోకి , ప్రొడ్యూసర్స్‌కు చెప్తున్న.. వాళ్ళని ఆదుకోండి’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే... బుధవారం రాత్రి 9.30 నిమిషాలకు పుష్ప 2 ప్రీమియర్లు పడినప్పుడు ఈ దుర్గఘన చోటు చేసుకుంది. ఆర్.టీ.సీ. క్రాస్ రోడ్స్ దగ్గర అభిమానుల గలాటా జరిగింది. అల్లు అర్జున్ సంథ్య థియేటర్‌కి వస్తున్నాడని తెలియగానే అభిమానులు ఎక్కడెక్కడ వాళ్లు వచ్చేసారు.
ఆర్.టీ.సీ క్రాస్ రోడ్స్ మొత్తం అభిమానులతో కిక్కిరిసిపోయి, జనాల తోపులాట మొదలైంది. ఈ క్రమంలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన భాస్కర్ కుటుంబం సినిమాను చూసేందుకు సంధ్యా థియేటర్‌కు వచ్చారు.
ఈ తొక్కిసలాటలో భాస్కర్ భార్య రేవతి, కుమారుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే బాలుడికి అక్కడి పోలీసులు సీపీఆర్ చేసి ఆ తరువాత దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు చికిత్స పొందుతున్నాయి.
అయితే రేవతి తీవ్ర అస్వస్థతతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తమ కుమారుడు పుష్ప హీరోను అభిమానిస్తాడని.. అందుకోసమే సినిమా చేసేందుకు వచ్చామని.. కానీ ఇలా తన భార్య ప్రాణాలను కోల్పోతుందని ఊహించలేకపోయాని భర్త భాస్కర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదన్న ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొందని తెలుస్తోంది.
ఈ బెనిఫిట్ షోలు రద్దు ప్రభావం సంక్రాంతి సినిమాలపై పడే అవకాశం ఉంది. సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకూ మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలపై మంచి బజ్ ఉంది. సంక్రాంతి సీజన్ కాబట్టి, ప్రీమియర్లతో హడావుడి చేసే ప్లాన్ లో ఉన్నారు నిర్మాతలు.
కానీ ఇప్పుడు ఆ అవకాశం లేనట్టే అని తేలిపోయింది. అయితే ఆంధ్రాలో ప్రీమియర్లకు అనుమతి ఇవ్వొచ్చు. లేదా ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా అక్కడి ప్రభుత్వం కూడా `నో` చెప్పవచ్చు అంటున్నారు.