కోట్లాది మంది అభిమానులకు షాక్ ఇవ్వబోతున్న నయనతార.. సినిమాలకు గుడ్ బై ?
లేడీ సూపర్ స్టార్ నయనతార త్వరలో పెట్టి పీఠలెక్కబోతుంది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ఓ రూమర్ వైరల్ అవుతుంది. ఆమె అభిమానులకు షాకివ్వబోతుందని తెలుస్తుంది.

ఓ గ్లామర్ హీరోయిన్ నుంచి ఇప్పుడు లేడీ సూప్టర్ స్టార్‌గా ఎదిగింది నయనతార(Nayanathara). ఆమె జర్నీ ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా సాగిందని చెప్పొచ్చు. ఆటుపోట్లు ఎన్నో ఎదుర్కొంది నిలబడింది. తనని తాను తెలుసుకుంటూ, నటిగా తనని తాను ఆవిష్కరించుకుంది నయన్. లేడీ సూపర్ స్టార్‌గా స్టార్ హీరోలకు దీటుగా ఇమేజ్‌ని తెచ్చుకుంది.
నయనతార సినిమాలు హిట్ అయితే హీరోలకు సమానంగా కలెక్షన్లు రాబడుతుండటం విశేషం. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఆమె కేరాఫ్‌గా నిలుస్తుంది. తమిళ చిత్ర పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టుంది. హీరోయిన్ల పాత్రలకు సంబంధించిన విప్లవాత్మకమైన మార్పులకు కారణమైంది నయనతార.
ప్రస్తుతం మహిళా ప్రధాన పాత్రలు, పెద్ద హీరోల సినిమాల్లో బలమైన పాత్రలు చేస్తూ రాణిస్తుంది. తెలుగులో ఆమె చిరంజీవి నటిస్తున్న`గాడ్ ఫాదర్`లో కీలక పాత్ర చేస్తుంది. ఆయనకు చెల్లిగా కనిపించబోతుంది. మరోవైపు హిందీలో షారూఖ్ ఖాన్‌తో చేస్తుంది నయనతార అలాగే ఆమె నటించిన `ఓ2`, `గోల్డ్` చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇదిలా ఉంటే నయనతారకి సంబంధించిన ఓ షాకింగ్ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతుంది. కోట్లాది మంది అభిమానులకు ఆమె త్వరలో పెద్ద షాక్ ఇవ్వబోతుందనే వార్త చక్కర్లు కొడుతుంది. నయనతార త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పబోతుందనే వార్త ఫ్యాన్స్ ని కలవరానికి గురి చేస్తుంది.
నయనతార త్వరలోనే మ్యారేజ్ చేసుకోబోతుంది. ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్(Vignesh Shivan)ని వివాహం చేసుకోనుంది. పెళ్లి కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. తమిళనాడు సీఎం స్టాలిన్‌ని ఆహ్వానించింది నయనతార టీమ్. జూన్ 9న నయన్-విఘ్నేష్ పెళ్లిపీఠలెక్కబోతున్నారట. తిరుమలలో వీరి వివాహం జరగబోతున్నట్టు సమాచారం.
మ్యారేజ్ తర్వాత నయనతార (Nayanathara Vignesh Wedding) సినిమాలు మానేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఆ మధ్య తనకు ఫ్యామిలీ లైఫ్ ముఖ్యమని తెలిపింది. వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేయాలని ఉందని, వ్యక్తిగత జీవితానికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తానని నయనతార చెప్పినట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల్లో నయనతార మ్యారేజ్ చేసుకోబోతున్న నేపథ్యంలో ఇప్పటికే సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని నిర్ణయించుకుందని టాక్.
అందుకే కొత్తగా నయనతార సినిమాలు ఒప్పుకోవడం లేదని కోలీవుడ్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. ప్రస్తుతం చేస్తున్నా సినిమాలన్నీ గతేడాది కమిట్ అయినవే. చాలా కాలంగానే నయనతార కొత్త సినిమాలకు సైన్ చేయలేదు. షారూఖ్‌తో చేయబోయే సినిమా కూడా రెండేళ్ల క్రితమే కమిట్ అయ్యింది. దీంతో ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసి, ఆ తర్వాత ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితం కావాలని నయన్ భావిస్తున్నట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ పుకార్లతో ఆమె అభిమానులు కలవరానికి గురవుతున్నారు. ఆందోళన చెందుతున్నారు.
నయనతార `చంద్రముఖి` డబ్బింగ్ చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. `లక్ష్మీ` సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ `బాస్`, `యోగి`, `దుబాయ్ శ్రీను`, `తులసి`, `ఆంజనేయులు`, `అదుర్స్`, `సింహా`, `శ్రీరామరాజ్యం`, `కృష్నం వందే జగద్గురుమ్`, `గ్రీకు వీరుడు`, `అనామిక`, `బాబు బంగారం`, `జై సింహా`, `సైరా`, ఇప్పుడు `గాడ్ ఫాదర్` చిత్రంలో నటిస్తుంది.