నాగార్జున 100వ మూవీ టైటిల్, స్టోరీ ఇదే.. ఇద్దరు హీరోయిన్లు ఫిక్స్
Nagarjuna: నాగార్జున తన 100వ మూవీకి సంబంధించి అదిరిపోయే అప్ డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ టైటిల్, స్టోరీ, నాగ్ రోల్, హీరోయిన్లకి సంబంధించిన సమాచారం ఆసక్తికరంగా మారింది.

`కూలీ`తో విలన్‌గా మారిన నాగార్జున
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా సినిమా చేస్తున్నాడు. ఆయన కొత్త సినిమాకి ఆల్మోస్ట్ రెండేళ్లు పట్టిందని చెప్పొచ్చు. గతేడాది సంక్రాంతికి ఆయన `నా సామి రంగ` చిత్రంతో వచ్చాడు. హిట్ అందుకున్నాడు. సంక్రాంతి పండుక్కి రావడంతో ఇది డీసెంట్ ఆడింది. మొత్తంగా నాగార్జునకి సోలో హీరోగా హిట్ ని అందించింది. ఆ తర్వాత కొత్త సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చాడు నాగ్. మధ్యలో ఆయన నెగటివ్ రోల్స్ కి సై అన్నాడు. రజనీకాంత్ `కూలీ` చిత్రంలో ఆయన విలన్‌గా కనిపించిన విషయం తెలిసిందే. దీనికి విశేష స్పందన లభించింది. దీని కంటే ముందే `కుబేర`లో కీలక పాత్ర పోషించారు. ఇది కూడా బాగానే ఆడింది.
వందవ మూవీని ప్రారంభించిన నాగ్
ఇక ఇప్పుడు సోలో హీరోగా సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. ఇటీవలే ఈ మూవీ ప్రారంభమైంది. ఇది నాగార్జున వందవ సినిమా కావడం విశేషం. తమిళ దర్శకుడు ఆర్‌ఏ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో ఆయన పరిచయం కాబోతున్నాడు అన్నపూర్ణ స్టూడియో ఈ మూవీని నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన పలు క్రేజీ విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కథ గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది. టైటిల్ కూడా లీక్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి `లాటరీ కింగ్` అనే టైటిల్‌ని అనుకుంటున్నారట. ఆల్మోస్ట్ ఇది కన్ఫమ్ అంటున్నారు.
ద్విపాత్రాభినయం చేయబోతున్న నాగ్
ఇక ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. `సోగ్గాడే చిన్నినాయన`లో చిత్రంలో నాగ్ ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పుడు మరోసారి రెండు పాత్రల్లో అలరించబోతున్నారు. అయితే ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుందని, లేటెస్ట్ పాలిటిక్స్ ని ప్రతిబింబించేలా సినిమా సాగుతుందని సమాచారం. రాజకీయాలపై ఒక సెటైర్‌లాగా ఉంటుందని, చాలా ట్రెండీగా ఉంటుందని సమాచారం. ఇందులో నాగార్జున ఒక పాత్రలో రాజకీయ నాయకుడిగా, మరో పాత్రలో సామాన్యుడిగా కనిపించబోతున్నారట. రెండూ విభిన్నమైన పాత్రలు అని, చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయని సమాచారం.
హీరోయిన్‌గా అనుష్క
ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. హీరోయిన్లు ఎవరనేది ఆసక్తికరంగా మారింది. హీరోయిన్‌గా అనుష్క శెట్టిని కన్ఫమ్ చేసినట్టు సమాచారం. నాగార్జున, అనుష్కల మధ్య మంచి అనుబంధం ఉంది. ఆమెని తెలుగుకి పరిచయం చేసిందే నాగ్. `సూపర్` చిత్రంతో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత `డాన్`, `ఢమరుకం`, `రగడ`, `ఊపిరి` వంటి చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి నటించబోతున్నారు. వెండితెరపై రొమాన్స్ కి రెడీ అవుతున్నారు. అయితే ఆమెది కీ రోల్ అని అంటున్నారు. నాగ్‌తో రొమాన్స్ ఉంటుందా? లేదా అనేది తెలియదు.
సీఎం పాత్రలో టబు
అంతేకాదు ఇందులో మరో హీరోయిన్ ఉండబోతుందని, టబు కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. పొటిలికల్ డ్రామా కావడంతో ఇందులో టబు సీఎం రోల్‌ని పోషిస్తుందని సమాచారం. నాగార్జున, టబు కాంబినేషన్‌లో గతంలో `నిన్నే పెళ్లాడతా`, `ఆవిడ మా ఆవిడే` చిత్రాలు వచ్చాయి. దాదాపు 27 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరు కలిసి నటిస్తుండటం విశేషం. దీంతో ఈ మూవీపై ప్రారంభం నుంచి హైప్ నెలకొంది. మరోవైపు ఇది తన 100వ మూవీ కావడంతో దీన్ని చాలా స్పెషల్‌గా భావిస్తున్నారట నాగార్జున. అందుకే ఇందులోస్పెషల్ రోల్స్ చాలానే ఉండబోతున్నాయని సమాచారం. అందులో భాగంగా నాగచైతన్య, అఖిల్ కూడా గెస్ట్ లుగా మెరిసే అవకాశం ఉందని టాక్. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.