నాగార్జున 100వ సినిమాకు ముహూర్తం ఫిక్స్, అతిథులుగా పాన్ ఇండియా హీరోలు ఎవరంటే?
కింగ్ నాగార్జున తన కెరీర్ లో 100వ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈసినిమా ఓపెనింగ్ కు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. ఇక ఈ సినిమా వేడుకకు ఇద్దరు పాన్ ఇండియా హీరోలు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ వారు ఎవరంటే?

నాగార్జున 100 వ సినిమా
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తన సినీ ప్రస్థానంలో మరో కీలక మైలురాయిని చేరుకుంటున్నారు. ఇటీవలే 99వ సినిమాను పూర్తి చేసిన ఆయన, ప్రస్తుతం తన 100వ సినిమా ప్రారంభానికి రెడీ అవుతున్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని మరింత ప్రత్యేకంగా మార్చేందుకు, దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా లాంచింగ్ వేడుకను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
చిరంజీవి, ఎన్టీఆర్ అతిధులు
ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ భారీ కార్యక్రమానికి ఇద్దరు పాన్ ఇండియా హీరోలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి తో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని టాక్. నాగార్జున, చిరంజీవి మధ్య వ్యక్తిగతంగా మంచి స్నేహం ఉండటంతో పాటు, హరికృష్ణతో ఉన్న అనుబంధం, ఎన్టీఆర్‌ను నాగార్జున తన పెద్ద కొడుకులా భావిస్తారని, అందుకే తారక్ ను కూడా ఆహ్వానించినట్టు సమాచారం.
చిరంజీవి చేతుల మీదుగా తొలి క్లాప్
ఈ నేపథ్యంలో చిరంజీవి చేతుల మీదుగా తొలి క్లాప్ కొట్టించి సినిమా ప్రారంభించాలనే యోచనలో నాగార్జున ఉన్నట్టు తెలిసింది. ఎన్టీఆర్ హాజరైతే ఈ వేడుక మరింత హైలెట్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈసినిమా విషయానికొస్తే, తమిళ దర్శకుడు కార్తీక్ ఈ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేయబోతున్నారు. ఆయన గతంలో కొంత క్రియేటివ్ కాన్సెప్ట్ ఆధారిత సినిమాలను రూపొందించినప్పటికీ, ఈ సినిమా మాత్రం యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ మేళవించిన కమర్షియల్ ఎంటర్‌టైనర్గా ఉండనుందని సమాచారం.
నాగార్జున సేఫ్ గేమ్
నాగార్జున గతంలో కూడా ప్రయోగాత్మక సినిమాల కంటే ఫ్యామిలీ డ్రామాలు, యాక్షన్ బేస్డ్ కంటెంట్‌లోనే ఎక్కువ విజయాలు అందుకున్నారు. అందుకే 100వ చిత్రం కోసం ఆయన అదే ఫార్ములాను ఎంచుకుని సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు తెలుస్తోంది.ఈ ప్రతిష్ఠాత్మక సినిమా నాగార్జున తన సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మించనున్నారు. సినిమాకు ‘100 నాటౌట్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాలీవుడ్ టాక్. ఇక లాంచింగ్ వేడుకకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.