అల్లు అర్జున్ కి తెలంగాణ మంత్రి ఝలక్, రేవతి కుటుంబానికి ఆర్థిక సహాయం, ఆపై విమర్శలు!
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధితురాలు రేవతి భర్తను కలిశారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరపున రూ. 25 లక్షల చెక్ అందజేశారు. అల్లు అర్జున్ ప్రకటించిన రూ. 25 లక్షలు బాధితురాలి కుటుంబానికి ఇవ్వలేదని ఆరోపణలు చేశారు.
అల్లు అర్జున్ కేంద్రంగా తెలంగాణ ప్రభుత్వం-టాలీవుడ్ మధ్య కోల్డ్ వార్ షురూ అయిన సూచనలు కనిపిస్తున్నాయి. పుష్ప 2 థియేటర్ వద్ద తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబానికి మంత్రి కోమటిరెడ్డి ఆర్ధిక సహాయం చేశాడు. అలాగే అల్లు అర్జున్ పై విమర్శలు గుప్పించాడు.
కారణం ఏదైనా టాలీవుడ్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నాడేమో అనిపిస్తుంది. సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటలో మహిళ మృతి చెందగా, తెలంగాణా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టుల పర్వానికి తెరలేపారు. కేసులో ఏ 11గా అల్లు అర్జున్ పేరు పొందుపరిచారు.
అరెస్ట్ అయిన అల్లు అర్జున్ బెయిల్ పై విడుదలయ్యారు. ఒక రోజు జైలు జీవితం గడిపిన అల్లు అర్జున్ కి టాలీవుడ్ సంఘీభావం తెలిపింది. పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు అల్లు అర్జున్ ని నేరుగా కలిశారు. అల్లు అర్జున్ ని చిత్ర ప్రముఖులు కలవడాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. అల్లు అర్జున్ కి ఏమైందని టాలీవుడ్ పెద్దలు కలిశారు. మరి ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజ్ ని ఒక్కరైనా పరామర్శించారా? అని అసహనం వ్యక్తం చేశాడు.
తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాధితురాలు రేవతి భర్తను కలిశారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరపున రూ. 25 లక్షల చెక్ అందజేశారు. అల్లు అర్జున్ ప్రకటించిన రూ. 25 లక్షలు బాధితురాలి కుటుంబానికి ఇవ్వలేదని ఆరోపణలు చేశారు. శ్రీతేజ్ చికిత్సకు అయ్యే ఖర్చు కూడా తెలంగాణ గవర్నమెంట్ భరిస్తుందని.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టత ఇచ్చారు.
మరోవైపు అల్లు అర్జున్ తన ఆవేదన వెళ్లగక్కారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారు. రెండు దశాబ్దాలు కష్టపడి సంపాదించుకున్న గౌరవాన్ని ఒక రాత్రి జరిగిన సంఘటనతో పోయేలా చేస్తున్నారని అన్నారు. నాకు ప్రమాదం జరిగిన విషయం ఉదయాన్నే తెలిసింది. వెంటనే స్పందించాను.
శ్రీతేజ్ ని ఆసుపత్రిలో కలవాలని అనుకున్నాను. బన్నీ వాసుతో పాటు సన్నిహితులు ఆసుపత్రికి వెళ్లారు. నన్ను రావొద్దని అన్నారు. లీగల్ ట్రబుల్స్ రీత్యా నేను రేవతి కేసు గురించి మాట్లాడలేని పరిస్థితి ఉందని అల్లు అర్జున్, మనోవేదన వ్యక్తం చేశారు.