12ఏళ్ల తర్వాత సక్సెస్.. మంచు మనోజ్ ఎమోషనల్.. అతను నా కుటుంబాన్ని నిలబెట్టాడు
మంచు మనోజ్ `మిరాయ్` సక్సెస్ మీట్‌లో ఎమోషనల్ అయ్యారు. 12ఏళ్ల తర్వాత సక్సెస్ వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ సినిమాతో తన కుటుంబం నిలబడిందని చెప్పడం విశేషం.

`మిరాయ్` సక్సెస్‌తో మంచు మనోజ్ ఎమోషనల్ కామెంట్
మంచు మనోజ్ హీరోగా నటించి చాలా కాలం అవుతుంది. `ఆపరేషన్ 2019` తర్వాత ఆయన సినిమాలకు దూరమయ్యాడు. కొంత కాలం బ్రేక్ తీసుకోగా, కరోనా రావడంతో అటోమెటిక్ గా గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత హీరోగా పలు సినిమాలు చేయాలని భావించినా అవి పట్టాలెక్కలేదు. దీంతో విలన్‌గా టర్న్ తీసుకున్నారు మనోజ్. ఆ మధ్య `భైరవం` చిత్రంలో కీలక పాత్ర పోషించారు. తనదైన యాక్టింగ్‌తో మెప్పించాడు. ఇప్పుడు `మిరాయ్`తో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఇందులోనూ విలన్ రోల్ చేశారు. రెచ్చిపోయి యాక్ట్ చేశాడు. ఆయన నటనకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో తనకు ఇంత గ్యాప్ తర్వాత సక్సెస్ వచ్చిన నేపథ్యంలో మంచు మనోజ్ ఎమోషనల్ అయ్యాడు.
12ఏళ్ల తర్వాత సక్సెస్‌పై మనోజ్ ఎమోషనల్
శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన `మిరాయ్` సక్సెస్ మీట్‌లో మంచు మనోజ్ మాట్లాడుతూ, దాదాపు12 ఏళ్ల తర్వాత సక్సెస్‌తో నా ఫోన్ మోగుతూనే ఉంది. నిన్నటి నుంచి అభినందనలు వస్తున్నప్పటికీ నాకు ఇదంతా కలలా ఉంది. ఈ సినిమాలో నన్ను భాగం చేసినందుకు డైరక్టర్ కార్తీక్‌కు జన్మంతా రుణపడి ఉంటాను. ఇంతకుముందు నేను ఎక్కడికి వెళ్లినా ‘అన్నా సినిమా ఎప్పుడు. కమ్‌బ్యాక్ ఎప్పుడు?’ అని అందరూ అడిగేవారు. త్వరలోనే వస్తాను అని చెప్పేవాడిని. వాళ్లతో బయటకు ధైర్యంగా మాట్లాడినా.. లోపల తెలియని భయం ఉండేది. అలాంటి టైమ్‌లో కార్తిక్ రావడం నా అదృష్టం. నన్ను మాత్రమే నిలబెట్టలేదు.. నాతో పాటు నా కుటుంబాన్ని కూడా నిలబెట్టారు. నేను పెరిగినట్లు నా పిల్లల్ని పెంచగలనా అని ఎప్పుడూ భయపడుతూ ఉండేవాడిని. ఆ భయాన్ని కార్తిక్ చంపేశారు` అని తెలిపారు మనోజ్.
తేజ గొప్ప స్థాయికి వెళ్తాడు
మనోజ్ ఇంకా చెబుతూ, ``నిర్మాత విశ్వప్రసాద్ ప్యాషన్‌కి హ్యాట్సప్. ఒక అద్భుతంగా ఈ సినిమాని నిర్మించారు. తమ్ముడు తేజ మరింత గొప్ప స్థాయికి వెళ్తాడు. అందరినీ ఇండస్ట్రీలో కలుపుకుంటూ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. రితిక అద్భుతంగా చేసింది. తనకు మంచి భవిష్యత్తు ఉంది. నా చిన్ననాటి క్యారెక్టర్ చేసిన ఇద్దరూ యాక్టర్స్ కూడా చాలా అద్భుతంగా చేశారు. గౌరీ హర సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఒక మంచి సినిమా తీసినప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ఒక హీరోలాగా కనిపిస్తుంటారు. మా డైరెక్టర్ కి హాట్సాఫ్. శ్రీకర్ ప్రసాద్ కి నేను చిన్నప్పుడు నుంచి పెద్ద ఫ్యాన్ ని. ఆయనతో కలిసి వర్క్ చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రతి ఇంట్లో నుంచి మనోజ్ గెలవాలి అని కోరుకున్న వారందరికీ పేరుపేరునా పాదాభివందనం`` అని తెలిపారు మంచు మనోజ్.
ప్రభాస్‌ది గోల్డెన్ హార్ట్
హీరో తేజ సజ్జా మాట్లాడుతూ, ఈ సినిమాని మీ గుండెల్లో పెట్టి ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియా వారికి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీ సపోర్ట్ వల్లే నేను సినిమాలు చేయగలుగుతున్నాను. సినిమా చూసిన ఆడియన్స్ సపరేట్ గా రీల్స్ చేస్తూ సినిమా గురించి ప్రమోట్ చేస్తుంటే ఆనందంగా అనిపించింది. డైరెక్టర్ కార్తీక్, నిర్మాత విశ్వప్రసాద్ వల్లే ఈ సినిమా సాధ్యమైంది. వాళ్ళిద్దరూ లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. ఏ సినిమా అయినా డైరెక్టర్ తోనే మొదలవుతుంది. మా వెనుక ఒక ఎమోషనల్ సపోర్ట్ లాగా ఒక పిల్లర్ లాగా నిలబడ్డారు నిర్మాత విశ్వ ప్రసాద్ . మనోజ్ కి థాంక్యూ సో మచ్. ఆయన ప్రాజెక్టులో భాగం కావడంతో సినిమా మరో స్థాయికి వెళ్ళింది. జగపతి బాబు, శ్రీయ, జయరాం వీళ్ళందరూ చాలా గొప్ప నటులు. మా పాషన్ చూసి మాతో ట్రావెల్ అయ్యారు. చాలా సపోర్ట్ చేశారు. కుర్రాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే మా గోల్డెన్ హార్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ కి థాంక్యూ. సినిమా బిగినింగ్ లో ప్రభాస్ ఈ కథని నరేట్ చేయడం వల్లే ఈ కథకు సినిమాకి మంచి వెయిటేజ్ వచ్చింది. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు` అని తెలిపారు తేజ.
`మిరాయ్` ఫస్ట్ డే కలెక్షన్లు
తేజ సజ్జా హీరోగా, మంచు మనోజ్ విలన్‌గా నటించిన చిత్రం `మిరాయ్`. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో శ్రియా, జగపతిబాబు, జయరాం, రితిక నాయక్ ముఖ్య పాత్రలు పోషించారు. శుక్రవారం ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలైంది. పాజిటివ్ టాక్‌ని తెచ్చుకుంది. తొలి రోజు ఈ చిత్రం ఏకంగా రూ.27కోట్ల కలెక్షన్లు రాబట్టడం విశేషం.