- Home
- Entertainment
- Kajal Aggarwal: రైతులంతా నేరస్థులే అంటూ కోర్టులో కాజల్ రచ్చ.. సంచలన పాయింట్ తో తెరకెక్కించిన మూవీ ఓటీటీలోకి
Kajal Aggarwal: రైతులంతా నేరస్థులే అంటూ కోర్టులో కాజల్ రచ్చ.. సంచలన పాయింట్ తో తెరకెక్కించిన మూవీ ఓటీటీలోకి
కాజల్ అగర్వాల్ నటించిన కోర్ట్ రూమ్ డ్రామా ది ఇండియా స్టోరీ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఒక సంచలన పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దానికి సంబంధించిన కీలక విషయాలు ఈ కథనంలో తెలుసుకోండి.

The India Story
కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సెకండ్ ఇనింగ్స్ లో సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. మునుపటిలా ఆమెకి హీరోగా అవకాశాలు రావడం లేదు. దీనితో కాజల్ సోలో హీరోయిన్ చిత్రాలు, కథా బలం ఉన్న చిత్రాలని ఎంచుకుంటున్నారు. కాజల్ అగర్వాల్ నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం 'ది ఇండియా స్టోరీ' ఆ మధ్యన థియేటర్స్ లో విడుదలయింది. తాజాగా సెప్టెంబర్ లో ఈ చిత్రాన్ని ఓటీటీలోకి రిలీజ్ చేశారు. అయితే తెలుగు వెర్షన్ ని మాత్రం అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మూవీ ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో కాజల్ ప్రధాన పాత్రలో నటించగా శ్రేయాస్ తల్పడే, మురళి శర్మ, మనీష్ వాద్వా కీలక పాత్రలో నటించారు.
మంచి ప్రయత్నం కానీ
ఈ చిత్రాన్ని ఒక మంచి ప్రయత్నం గా చెప్పొచ్చు. దర్శకుడు చేతన్ డీకే సంచలన పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ ప్రయత్నానికి అభినందనలు తెలపాల్సిందే. అయితే ఆ ప్రయత్నం పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదు. ఒక యావరేజ్ అటెంప్ట్ లాగే మిగిలిపోయింది. రసాయనిక ఎరువులతో వ్యవసాయం చేసి పంటలు పండించడం, కల్తీ ఆహారం లాంటి అంశాలు ప్రస్తుతం పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి అనే కథాంశంతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దీనిని కోర్టు రూమ్ డ్రామాగా చెప్పాలని అనుకున్నారు. కానీ కోర్టు సన్నివేశాలు తేలిపోయాయి.
కథ ఏంటంటే
ఇండియన్ ఆర్మీలో పని చేసే యోగేష్ అనే సైనికుడు చిన్నారి అయిన తన కుమార్తెని కోల్పోతాడు. ఆ చిన్నారి క్యాన్సర్ కారణంగా మరణించినప్పటికీ.. తన కూతురు రసాయనిక ఎరువుల ద్వారా పండించిన పంటలు, కల్తీ ఆహారం వల్లే మరణించింది అని మర్డర్ కేసు పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. రసాయనిక ఎరువుల ద్వారా పంటలు పండించే రైతులు, ప్రభుత్వం పైనే మర్డర్ కేసు పెట్టాలి అనేది అతడి పోరాటం. కానీ అతడి కేసుని ఏ లాయర్ కూడా తీసుకోరు. చివరికి అడ్వాకెట్ అర్చన .. యోగేష్ తరుపున కేసు వాదించడానికి ముందుకు వస్తుంది. హై కోర్టులో ఈ కేసుని ప్రారంభించడంతోనే ఆమె.. ఈ దేశంలో రైతులంతా నేరస్థులే అని అని వాదిస్తుంది. ఆమె వాదనతో జడ్జీలతో సహా దేశ ప్రజలు ఆశ్చర్యపోతారు. ఆమెపై తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతాయి. రైతులనే నేరస్థులు అంటూ ఆరోపణలు చేసిన అర్చన చివరికి కేసు గెలిచిందా ? క్యాన్సర్ కారణంగా చనిపోయిన చిన్నారి కేసుని ఆమె ఎందుకు తీసుకుంది ? యోగేష్ తో ఆమెకి సంబంధం ఏంటి ? లాంటి అంశాలు ఈ చిత్రం చూసే తెలుసుకోవాలి.
రైతులంతా నేరస్థులే
దేశంలోని రైతులంతా నేరస్థులు అని కేసు ప్రారంభించినప్పుడు ఆమె వాదనలు, ఇన్వెస్టిగేషన్ కూడా అంతే బలంగా ఉండాలి. రసాయనిక ఎరువుల ద్వారా పండించే పంటలు, ఆహారం స్లో పాయిజన్ గా మారుతోంది నిజమే. కానీ దాని వెనుక ఉన్న సైంటిఫిక్ వాస్తవాలు, ఆధారాలని, ఇన్వెస్టిగేషన్ ని దర్శకుడు సరిగ్గా చూపించలేదు. రసాయనిక ఎరువుల ద్వారా వ్యవసాయం చేయడం నేరం అని చెప్పినప్పుడు దానికి బలమైన ప్రత్యామ్నాయ పద్ధతి కూడా సూచించాలి.
హరిత విప్లవం
అసలు ఇండియాలో రసాయనిక ఎరువులు, పురుగు మందుల ద్వారా వ్యవసారం 1960లో ఇండియా చైనా యుద్ధం తర్వాత ప్రారంభం అయింది అని ఆసక్తికరంగా చూపించారు. యుద్ధం తర్వాత ఏర్పడ్డ ఆహార కొరతని అప్పటి ప్రభుత్వం గుర్తించి హరిత విప్లవం తీసుకువచ్చింది. హరిత విప్లవం ద్వారా రసాయనిక ఎరువులని, హైబ్రిడ్ విత్తనాల్ని ఇండియాలోకి ప్రవేశపెట్టారు అని చూపించారు. ఆ అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. కానీ దానిని ఆసక్తికరంగా కొనసాగించలేదు. కోర్ట్ రూమ్ డ్రామాలో ఎమోషన్స్ కంటే ఇన్వెస్టిగేషన్, ఆధారాలు బలంగా ఉండాలి. కానీ వాటికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఎమోషన్స్ తోనే నడిపించాలి అని దర్శకుడు భావించారు. దీనితో సన్నివేశాలు ఆకట్టుకోలేదు. అక్కడక్కడా కొన్ని మంచి సన్నివేశాలు, ఆసక్తికర కథాంశం కోసం అయితే ఈ చిత్రాన్ని ఒకసారి ట్రై చేయొచ్చు.

