శ్రీదేవి స్పెషాలిటీ: తండ్రితో చేసేటప్పుడు ఒకలా, కొడుకుతో ఇంకోలా
ఒక హీరోయిన్‌తో 24 సినిమాలు చేసే అవకాశం ఇచ్చిన ఆ భగవంతుడికి ధన్యవాదాలు. 54 ఏళ్ల వయసులోనే శ్రీదేవిని ఆ దేవుడు తీసుకెళ్లినందుకు బాధపడుతున్నా అంటారు.
అతిలోక సుందరి అంటే శ్రీదేవే. ఆమె తర్వాత ఆ స్దాయి, ఆ అందం ,గ్రేస్ ఎవరికీ రాలేదు. అందానికి, నటనకు కేరాఫ్ అడ్రస్ గా వెలిగిన ఆమె జాతీయ స్ధాయిలో నెంబర్ వన్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఇంకా ఎంతో భవిష్యత్ ఉండగానే ప్రమాదవశాత్తు మరణించారు.
ఆమె లేరు అన్న నిజాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేరు. ఈ నేపధ్యంలో శ్రీదేవి గురించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని, గొప్పతనాన్ని ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావుగారు షేర్ చేసుకున్నారు. అదేంటో చూద్దాం.
శ్రీదేవి భారతదేశం గర్వించతగ్గ గొప్ప నటి. 1963 లో జన్మించారు. సినిమాలంటే చిన్నతనం నుంచి ఉన్న ఆసక్తితో 4 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ‘కంధన్ కరుణై’ అనే తమిళ సినిమాలో నటించారు. దక్షిణ భారతీయ భాషలు మాట్లాడటం నేర్చుకున్నారు. తమిళం, తెలుగు, మళయాళ సినిమాల్లో నటించడానికి ఈ భాషలు ఆమెకు ఎంతగానో సహకరించాయి.
1976 లో కె.బాలచందర్ డైరెక్షన్ లో వచ్చిన ‘మూండ్రు ముడిచు’ సినిమాతో శ్రీదేవి జాతీయ స్ధాయిలో గుర్తింపు పొందారు. అటు బాలీవుడ్‌లో యాక్షన్ కామెడీ సినిమా ‘హిమ్మత్ వాలా’లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. సద్మా, చాల్ బాజ్ సూపర్ హిట్ అయ్యాయి.
హిందీలో జితేంద్ర పక్కన ఎక్కువ సినిమాల్లో నటించారు శ్రీదేవి. నగీన, మిస్టర్ ఇండియా, చాందినీ, చాల్ బాజ్ సినిమాలు మంచి పేరు తెచ్చాయి. రాఘవేంద్రరావుగారితో ఆమె 24 సినిమాలు చేసారు. ఆమె గురించి ఆయనకే ఎక్కువ తెలుసు.
రాఘవేంద్రరావు మాట్లాడుతూ... శ్రీదేవి సిల్వర్ స్క్రీన్‌కి ఎలా వచ్చింది? ఎంత ఎదిగింది? అని స్వయంగా చూశాను. మా నాన్నగారు (కె.ఎస్. ప్రకాశ్‌రావు) డైరెక్ట్ చేసిన ‘నా తమ్ముడు’ సినిమాలో శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది. నేను శ్రీదేవిని ఎత్తుకుని షూటింగ్ లొకేషన్‌కి తీసుకువెళ్లేవాణ్ణి.
ఆ సినిమాలో తను నెహ్రూ క్యారెక్టర్ చేసింది. అంత చిన్న పిల్ల నుంచి ప్రేక్షకుల మనసుల్లో అతిలోక సుందరిగా ఎదిగిన వరకూ శ్రీదేవిని నేను చూశాను. ఒక హీరోయిన్‌తో 24 సినిమాలు చేసే అవకాశం ఇచ్చిన ఆ భగవంతుడికి ధన్యవాదాలు. 54 ఏళ్ల వయసులోనే శ్రీదేవిని ఆ దేవుడు తీసుకెళ్లినందుకు బాధపడుతున్నా అంటారు.
శ్రీదేవి ప్రత్యేకత గురించి రాఘవేంద్రరావు చెప్తూ...ఆమె తండ్రి,కొడుకుడు ఇద్దరితోనూ చేసారు. నాగేశ్వరరావుతో ప్రేమాభిషేకం చేస్తే, కొడుకు నాగార్జునతో ఆఖరి పోరాటం, గోవిందా గోవిందా చేసారు. ఆఖరి పోరాటం 1988లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇందులో అక్కినేని నాగార్జున, శ్రీదేవి, అమ్రిష్ పురి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని అశ్వనీదత్ వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మించాడు. ఇళయరాజా సంగీతం అందించాడు.
ఆఖరి పోరాటం సమయంలో తన ఎక్సపీరియన్స్ చెప్తూ రాఘవేంద్రరావు...శ్రీదేవి ఊరికినే పైకి రాలేదు. ఈ స్దాయికి ఎదగలేదు. పెద్ద వాళ్లతో చేసేటప్పుడు వాళ్ల ఏజ్ కు తగినట్లుగా తెరపై కనిపించేది. అలాగే వాళ్ల కొడుకులతో చేసేటప్పుడు హెయిర్ స్టైయిల్ దగ్గర నుంచి ఎక్సప్రెషన్ దాకా మొత్తం మార్చేసేది.
పెద్ద దొంగ తను అంటారు ఆయన . ఆఖరి పోరాటంలో ఓ పాటలో ఆమె ప్రేక్షకుల వంక చూసి కన్ను కొట్టే ఎక్సప్రెషన్ ని తను కానీ, డాన్స్ డైరక్టర్ గా నీ చెప్పలేదు అని,ఆమే ఇంప్రవైజ్ చేసిందని, నాగార్జున వంటి హీరో ప్రక్కన చేసేటప్పుడు ఆ చిలిపితనం చూపెట్టాలని ఆమెకు తెలుసు అనే విషయం ప్రస్తావించారు.
గ్లామర్ ఒక్కటే సరిపోదు. ఆ ఒక్కటితోనే శ్రీదేవి ఈ స్థాయికి రాలేదు. తను మల్టీ టాలెంటెడ్. ఎన్ని రకాల పాత్రలు ఇస్తే అన్నీ చేయగల సత్తా తనకుంది. ప్రతి పాత్రకీ వ్యత్యాసం చూపించగలదు. తెలుగులో ‘పదహారేళ్ల వయసులో’తో మొదలుపెట్టి తనతో ఎన్నో సినిమాలు చేశా. తెలుగు, తమిళ నుంచి జాతీయ.. అంతర్జాతీయ స్థాయి వరకు శ్రీదేవి అధిరోహించని మైలురాయి లేదంటే అతిశయోక్తి కాదు. బాలనటి నుంచి కథానాయిక వరకూ నాతో ప్రయాణం చేసిన శ్రీదేవి నా సక్సెస్ లో ఓ భాగం అంటారాయన.