శివాని, శివాత్మిక కోసం ఆస్తులు అమ్ముకున్నాం, ఏది కావాలంటే అది చేశాం.. జీవిత ఎమోషనల్ కామెంట్స్
హర్ష పులిపాక దర్శకత్వంలో తెరకెక్కిన పంచతంత్రం చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జీవిత రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక రాజశేఖర్ కూడా కీలక పాత్రలో నటించింది.
యాంగ్రీ హీరో రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత తరచుగా వార్తల్లో కెక్కడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మా అసోసియేషన్ కార్యక్రమాలు, ఎన్నికల సమయంలో జీవిత రాజశేఖర్ హంగామా ఎక్కువగానే ఉంటుంది. ఇక నటనలో వారి వారసత్వం అందిపుచ్చుకున్న కుమార్తెలు శివాని, శివాత్మిక హీరోయిన్లుగా రాణిస్తున్నారు.
తమ కుమార్తెలు నటీమణులు కావడంపై జీవిత ఓ మీడియా సమావేశంలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తమ పిల్లలు జీవితంలో ఎదగాలని, పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని తల్లి దండ్రులు ఎన్నో కష్టాలు పడుతుంటారు. తాము కూడా అలాగే కష్టాలు పడ్డాం అని జీవిత అన్నారు.
హర్ష పులిపాక దర్శకత్వంలో తెరకెక్కిన పంచతంత్రం చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్రహ్మానందం, స్వాతిరెడ్డి , రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. జీవిత రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక రాజశేఖర్ కూడా కీలక పాత్రలో నటించింది.
ఈ సందర్భంగా జీవిత పంచతంత్రం చిత్రం గురించి మాట్లాడింది. చిన్నప్పటి నుంచి మా పిల్లలు శివాని, శివాత్మిక సినిమాల్లోనే పెరిగారు. కానీ వాళ్ళు సినిమాల్లోకి వస్తారని అనుకోలేదు. కానీ పెద్దయ్యాక మేము కూడా యాక్ట్ చేస్తాం అని చెప్పారు. అప్పుడు నేను, రాజశేఖర్ అందరి తల్లిదండ్రుల లాగే చిన్న టెన్షన్ కి గురయ్యాం. సినిమాల్లో రాణించడం అంత సులభం కాదు.
చిన్నప్పటి నుంచి మా పిల్లల కోసం ఎంతో కష్టపడ్డాం. వాళ్ళ కోసం ఆస్తులు అమ్ముకున్నాం. వారు ఏది అడిగితే అది చేశాం. కానీ సినిమాల్లో రాణించాలంటే మంచి పాత్రలు రావాలి. వాటిని కొనలేం. మీరు సినిమాల్లో నాటింస్తానంటే మా సపోర్ట్ కూడా ఉంటుంది. కానీ సినిమాల్లో సక్సెస్ రావచ్చు, రాకపోవచ్చు. ఏం జరిగినా నిరాశపడకూడదు అని చెప్పినట్లు జీవిత తెలిపింది.
పంచతంత్రం చిత్రాన్ని దర్శకుడు చాలా నేచురల్ గా తెరకెక్కించారు. ఈ చిత్రం చూశాక దర్శకుడు హర్ష చిన్న వయసులోనే జీవితాన్ని చాలా స్టడీ చేశాడని అనిపించింది. ఈ చిత్రంలో పాత్రలు అనుభవించే కష్టాలు రియల్ లైఫ్ కి దగ్గరగా ఉంటాయి.