`జబర్దస్త్` షోకి జడ్జ్ మారింది.. ఖుష్బూ స్థానంలో మహేశ్వరి.. అప్పుడు యాంకర్, ఇప్పుడు జడ్జ్ ఏం జరుగుతుంది?
`జబర్దస్త్` కామెడీ షో లో ఇటీవల చోటు చేసుకుంటున్న మార్పులు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ మధ్య యాంకర్ ని మార్చేశారు. ఇప్పుడు ఏకంగా జడ్జ్ ని మార్చేశారు. మరి ఏం జరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.
`జబర్దస్త్` కామెడీ షో ప్రధానంగా రెండు షోలుగా ప్రసారం అవుతుంది. `జబర్దస్త్` గురువారం ప్రసారమవుతుంది. దీనికి కృష్ణభగవాన్, ఇంద్రజ జడ్జ్ లుగా చేస్తున్నారు. సిరి యాంకర్ గా ఉంది. అయితే అంతకు ముందు అనసూయ యాంకర్‌గా చేసేది. గతేడాది నుంచి సౌమ్యరావు యాంకర్‌గా చేస్తూ వచ్చింది. గత మూడు వారాలుగా సౌమ్య రావు మారింది. ఇప్పుడు కొత్తగా బిగ్ బాస్ సిరి వచ్చింది.
ఇక `ఎక్స్ ట్రా జబర్దస్త్` షోకి రష్మి యాంకర్‌గా చేస్తూ వస్తుంది. ప్రారంభం నుంచి రష్మినే ఉంది. అయితే దీనికి మొదట నాగబాబు, రోజా జడ్జ్ లుగా ఉన్నారు. రెండు షోలకు వాళ్లే జడ్జ్ లు. అయితే నాగబాబు మొదట షోని వీడాడు. ఇతర షోస్‌కి వెళ్లాడు. ఆ తర్వాత రోజా వీడింది. ఆమెకి మంత్రి పదవి రావడంతో జబర్దస్త్ ని మానేసింది. ఆమె స్థానంలో ఇంద్రజ వచ్చింది. చాలా మంది హీరోయిన్లతో ప్రయత్నించినా చివరకు ఇంద్రజ సెట్ అయ్యింది. ఎక్స్ ట్రా జబర్దస్త్ కి ఖుష్బూని ఫిక్స్ చేశారు. చాలా రోజులుగా ఈ విధంగానే షోస్ రన్ అవుతున్నాయి.
తాజాగా `ఎక్స్ ట్రా జబర్దస్త్`కి సంబంధించి జడ్జ్ మారడం విశేషం. ఇప్పటి వరకు ఖుష్బు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. కృష్ణభగవాన్ తో కలిసి ఆమె జడ్జ్ గా చేసింది. తనదైన మాటలతో అలరిస్తూ, అదరగొడుతూ వస్తున్నారు. తాజాగా ఆమె స్థానంలో కొత్త జడ్జ్ రావడం విశేషం. ఒకప్పటి నటి మహేశ్వరి ఆమె స్థానంలో వచ్చారు.
తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో మహేశ్వరి ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటించిన `గులాబి` చిత్రంలోని పాటతో ఆమె ఎంట్రీ ఇవ్వడం విశేషం. జడ్జ్ గానూ నవ్వులు పూయిస్తూ ఆకట్టుకున్నారు. నవ్వులతోనే ఆమె మెప్పించారు. అయితే ఖుష్బూ స్టయిల్ హుందాతనం మిస్ అవుతుంది. ఏదో లోటు అనిపిస్తుంది.
మరి మహేశ్వరి ఒకటి రెండు షోలకే పరిమితమా? కంటిన్వ్యూ అవుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఖుష్బూ తన వ్యక్తిగత కారణాలతో గ్యాప్ ఇచ్చారా? లేక తొలగించారా? అనేది తెలియాల్సి ఉంది. కానీ వరుసగా యాంకర్, తర్వాత జడ్జ్ మారడం ఆశ్చర్యపరుస్తుంది.
ఇక మహేశ్వరి.. `గులాబి` చిత్రంతో పాపులర్ అయ్యింది. ఆమె తొలి బ్రేక్ అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకి వరుసగా ఆఫర్లు వచ్చాయి. `ఖైదీ ఇన్‌స్పెక్టర్`, `దెయ్యం`, `మృగం`, `జాబిలమ్మ పెళ్లి`, `పెళ్లి`, `ప్రియరాగాలు`, `వీరుడు`, `మా బాలాజీ`, `ఓ పనైపోతుంది బాబూ`, `ప్రేమించేది ఎందుకమ్మ`, `రామసక్కనోడు`, `వెలుగు నీడలు`, `నీ కోసం`, `బలరాం`, `మా అన్నయ్య`, `తిరుమల తిరుపతి వెంకటేశ` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ని అలరించింది.
కేవలం ఆరు ఏళ్లు మాత్రమే ఆమె నటిగా రాణించింది. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. మెరుపు తారగా నిలిచింది. ఆ తర్వాత టీవీ షోస్ చేసింది. పెళ్లి తర్వాత పూర్తిగా దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు సడెన్‌గా `జబర్దస్త్` షోలో మెరవడంతో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.