- Home
- Entertainment
- Illu Illalu Pillalu Today Episode Dec 30: అమూల్య పెళ్లిని చెడగొట్టేందుకు వల్లితో కలిసి విశ్వక్ ప్లాన్
Illu Illalu Pillalu Today Episode Dec 30: అమూల్య పెళ్లిని చెడగొట్టేందుకు వల్లితో కలిసి విశ్వక్ ప్లాన్
Illu Illalu Pillalu Today Episode Dec 30: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో రామరాజు పెద్ద నిర్ణయం తీసుకుంటాడు. అమూల్యకు పెళ్లి చేస్తానని చెబుతాడు. ఆ పెళ్లిని చెడగొట్టేందుకు విశ్వ సిద్ధమవుతాడు. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూడండి.

అమూల్యకు రామరాజు వార్నింగ్
ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో రామరాజు అమూల్యకు పెళ్లి చేయాలన్న తన నిర్ణయాన్ని కుటుంబ సభ్యులకు చెబుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ‘ఇంత జరిగిన తర్వాత కూడా తనకి పెళ్లి చేయకుండా కాలేజీకి పంపిస్తే... రేపు జరగరానిది జరిగితే మా గుండె పగిలిపోతుంది’ అని రామరాజు చెబుతాడు. నర్మద కల్పించుకుని అమూల్యకు అర్థమయ్యేలా చెప్పమని అడుగుతుంది. దానికి రామరాజు ఏమాత్రం ఒప్పుకోడు. తను చెప్పాల్సింది చెప్పడానికి అందర్నీ పిలిచానని, మీ అభిప్రాయాలతో నాకు సంబంధం లేదని చెబుతాడు. నా నిర్ణయం ప్రకారమే నా కూతురు పెళ్లి జరుగుతుంది, నా నిర్ణయం ప్రకారమే ఇక్కడ ఉన్న అందరూ నడుచుకోవాలి.. అంతే తప్పా జోక్యం చేసుకోవడానికి గానీ, ఎదురు చెప్పడానికిగానీ వీలు లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు.
అమూల్యకు కూడా గట్టిగానే వార్నింగ్ ఇస్తాడు రామరాజు. నేను చూసిన వాడిని తలవంచుకుని, తాళి కొట్టించుకోవాలి తప్పా నోరెత్తడానికి వీల్లేదని అమూల్యతో చెబుతాడు. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమూల్య హాల్లో మిగిలిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది.
బయటకు వచ్చిన ధీరజ్ దగ్గరకి ప్రేమ వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ధీరజ్ కు జరిగిన గొడవ పదేపదే గుర్తొస్తుంది. ప్రేమ ‘అమూల్యకు ఇప్పుడు పెళ్లి ఏంటి? చదువుకునే అమ్మాయికి లైఫ్ లో ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. మీరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు. మీ నాన్నతో మీరు మాట్లాడొచ్చు కదా’ అని చెబుతుంది.
ప్రేమ ధీరజ్ మధ్య పెరిగిన దూరం
ప్రేమ అన్నమాట ధీరజ్ కు విపరీతంగా కోపం వస్తుంది. ‘నోర్మూయ్.. ఏంటి మా నాన్న నిర్ణయం నీకు నచ్చలేదా? నీకు మా నాన్న నిర్ణయం నచ్చదు, మా నాన్న నచ్చడు. నేను నచ్చను, ఈ ఇల్లే నీకు నచ్చదు. ఎందుకంటే నీ మనసులో ఉన్న అసలు ఉద్దేశం వేరు. కాబట్టి అవి ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి’ అని అంటాడు ధీరజ్. మీ అన్నయ్యతో అమూల్య పెళ్లి చేయాలన్నదే కదా అని అసలు ప్లాన్ అంటాడు. దానికి ప్రేమ ‘నేను అమూల్య భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉంటే నువ్వు ఏదైనా ఊహించుకొని బుద్ధి లేకుండా మాట్లాడతావేంటి’ అని అడుగుతుంది. ఇద్దరి మధ్య కాసేపు గొడవ జరుగుతుంది. ప్రేమ మాట్లాడుతూ అమూల్య వైపు నుంచి తప్పు ఉందని, అమూల్య మా అన్నయ్యని ప్రేమించిందని మళ్లీ అంటుంది.
దీంతో ధీరజ్ కు కోపం వచ్చి కొట్టేందుకు చెయ్యి ఎత్తుతాడు. ఇంకోసారి నా చెల్లెలిది తప్పని నువ్వు మాట్లాడావంటే అస్సలు బాగోదు, మా నాన్న తీసుకున్నది కరెక్ట్ నిర్ణయం.. అమూల్యకు పెళ్లి చేయాలనుకుంటున్న మా నాన్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను అని గట్టిగా చెబుతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతూ మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ క్షణం నుంచి నువ్వు నాతో మాట్లాడకు అని చెబుతాడు. దీంతో ప్రేమ అక్కడ నిల్చని ఏడుస్తుంది. నీతో మాట్లాడితేనే నాకు కంపరంగా ఉంది అని ధీరజ్ అంటాడు. దీంతో ప్రేమ చాలా బాధపడుతూ ఏడుస్తుంది.
అమూల్య పెళ్లిని చెడగొట్టమన్న విశ్వ
ఇక్కడి నుంచి సీన్ ఇడ్లీ బాబాయ్, భాగ్యం దగ్గరికి మారుతుంది. అక్కడికి శ్రీ వల్లి వస్తుంది. మా మామయ్య గారు అమూల్య కి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని చెబుతుంది. అది విని భాగ్యం, ఇడ్లీ బాబాయ్ షాక్ అవుతారు. ఈలోపు అక్కడికి విశ్వక్ వస్తాడు. ఆ విషయం గమనించకుండా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. భాగ్యం మాట్లాడుతూ ‘మనం అమూల్యతో పెళ్లి చేస్తామని విశ్వక్ దగ్గర పది లక్షలు తీసుకున్నాం కదా... ఇప్పుడు అమూల్యకు వేరే వాడితో పెళ్లంటే ఆ బండోడు వచ్చి మన గొంతు పట్టుకుంటాడు’ అని భాగ్యం భయపడుతూ చెబుతుంది.
ఈలోపు వల్లి మాట్లాడుతూ ఆ బండోడి నుంచి తప్పించుకోవడానికి, మన చేతులకు మట్టి అంటకుండా ఆ దేవుడు మనకు ఇచ్చిన అవకాశం ఇది, మా మామయ్య గారే అమూల్యకు పెళ్లి చేస్తానంటున్నారు అని అంటుంది. వల్లి మాటలు విశ్వ వినేస్తాడు. విశ్వను చూసి చాలా షాక్ అవుతారు. విశ్వ మాట్లాడుతూ ‘అమూల్యకు వచ్చిన సంబంధాన్ని మీరే చెడగొట్టాలి. లేకుంటే అసలు అమూల్యను, నన్ను కలిపింది వల్లీయేనని, మా ప్రేమకు నువ్వే సూత్రధారివి అని, మా ప్రేమకు నువ్వే కారణం అని మీ మావయ్యతో చెప్పేస్తా’ అని బెదిరిస్తాడు. పెళ్లి సంబంధాన్ని చెడగొట్టే బాధ్యత వల్లి బ్యాచ్ కు అప్పజెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ప్రేమపై మండిపడిన వేదవతి
ఇక్కడి నుంచి సీన్ ప్రేమ దగ్గరికి మారుతుంది. ప్రేమ వంటింట్లో వేదవతి దగ్గరికి వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంది. ‘అత్తా.. అమూల్య చదువుకుంటుంది. చదువుని మధ్యలో ఆపేసి పెళ్లి చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు ఆలోచించండి’ అని అంటుంది. దానికి వేదవతికి చాలా కోపం వచ్చి ‘నువ్వు ఎవరు నాకు చెప్పడానికి, మా కూతురు పెళ్లి ఎప్పుడు చేయాలో మాకు తెలియదా? నువ్వు చెబితే తెలుసుకునే పరిస్థితిలో మేమున్నామా?’ అని గట్టిగా అరుస్తుంది. దీంతో ప్రేమ ఏడ్చుకుంటూ బయటికి వచ్చేస్తుంది.
వేదవతి దగ్గరికి నర్మద వస్తుంది. ‘అత్తయ్య ప్రేమ మాట్లాడిన దాంట్లో తప్పేముంది? మీరు అంతగా ఎందుకు కోప్పడుతున్నారు?’ అని అడుగుతుంది. దానికి వేదవతి మేనకోడలని నెత్తిన పెట్టుకున్నాను కదా, అందుకే తప్పంతా నాదే.. ఆమె ఏం మాట్లాడిందో మర్చిపోయావా? నా కూతురే వాడి వెంటపడిందని నడివీధిలో మాట్లాడింది. అందుకే కదా అందరూ మమ్మల్ని తిట్టారు, అమూల్య పెళ్లి అర్జెంటుగా చేయడానికి కూడా ఇదే కారణం కదా అని గట్టిగా చెబుతుంది.
వేదవతికి తన ప్రేమ పెళ్లిని గుర్తు చేసిన నర్మద
నర్మద మాట్లాడుతూ ‘ప్రేమ చిన్న పిల్ల కాబట్టి తనకి ఏం మాట్లాడాలో తెలియలేదు. తను తప్పే చేసింది. కానీ మరి మీరు చేసింది ఏంటి? మీరు పెద్దవారు, అన్నీ తెలిసినవారు.. ఇంత జీవితాన్ని చూసినవారు. మంచేదో చెడేదో.. ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో తెలిసినవాళ్లు. మరి మీరు చేసింది ఏమిటి? ప్రేమను తన కన్న వాళ్ళు సరిగా పెంచలేదని, అందుకే ఆమె లేచిపోయిందని మీరు అనలేదా? ఎంత కోపం వస్తే మాత్రం కూతురు లాంటి ఒక ఆడపిల్లని అంత మాట అనొచ్చా? తన పుట్టింటి వాళ్లు తనను సరిగా పెంచలేదని మాట్లాడారు. తనకంటే ముందు అది మీ పుట్టినిల్లు.. ఆ విషయం మర్చిపోయారా? ప్రేమ కూడా మీ పుట్టింటి వాళ్ళు మిమ్మల్ని సరిగా పెంచలేదని, మీరు కూడా లేచిపోయి పెళ్లి చేసుకున్నారని తిరిగి అంటే మీరేం చేస్తారో చెప్పండి. కూతురు విషయంలో మీకు బాధ ఉంది. కానీ ఒక మాట అనే ముందు ఎదుటి వాళ్ళ మనసు ఎంత బాధ పడుతుందో మీరే ఆలోచించకపోతే ఎలా చెప్పండి’ అని నెమ్మదిగా చెబుతోంది.
దాంతో వేదవతి కూడా ఆలోచనలో పడుతుంది. ‘ప్రేమ తన అన్నయ్య చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మింది. ఆ మాటలు వెనక నిజా నిజాలను తెలుసుకోలేక పోయింది. అందుకే అలా మాట్లాడింది. ఏదో రోజు తన తప్పు తను తెలుసుకుంటుంది. పశ్చాత్తాపడుతుంది. తనకి ఆ టైం ఇవ్వకుండా లేచిపోయిందని మాట జారడం, బాధ పెట్టడం కరెక్ట్ కాదు అత్తయ్య’ అని చెబుతుంది నర్మద. దీంతో వేదవతి కూడా చాలా బాధపడుతుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగిసిపోతుంది.

