ఇకపై చిరంజీవి పేరు, ఫోటోలు వాడుకుంటే జైలుకే.. కోర్ట్ ఆదేశాలు
మెగాస్టార్ చిరంజీవి పేరుని, ఫోటోలను ఇప్పటి వరకు ఎవరు పడితే వాళ్లు వాడుకున్నారు. సొమ్ము చేసుకున్నారు. కానీ ఇకపై అలా నడవదు. ఆయన పేరుని, ఫోటోలను మిస్ యూజ్ చేస్తే జైలుకే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

సొంత టాలెంట్‌తో మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి
చిరంజీవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి హీరోగా ఎదిగారు. స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియల్ సినిమాలతో బాక్సాఫీసుని షేక్ చేశారు. సొంత టాలెంట్‌తో హీరోగా, నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ సూపర్ స్టార్ నుంచి మెగాస్టార్‌గా ఎదిగారు. టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా రాణిస్తున్నారు. ఆయన తర్వాత ఎంత మంది స్టార్స్ వచ్చినా, ఆయన స్థానాన్ని టచ్ చేయలేకపోతున్నారంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు డెబ్బై ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. వరుసగా మూడు నాలుగు సినిమాల లైనప్‌తో బిజీగా ఉన్నారు చిరు.
చిరంజీవి పేరు, ఫోటోలు వాడితే జైలుకే
ఇదిలా ఉంటే చిరంజీవి పేరుని ఎన్నో రకాలుగా వాడుతుంటారు. కొందరు కమర్షియల్‌గానూ వాడుతుంటారు. ఆయన పేరుని, ఫోటోలను వాడుతూ సొమ్ము చేసుకునేవాళ్లు చాలా మందే ఉంటారు. వ్యాపార కార్యకలాపాలకు కూడా ఆయన పేరుని, ఫోటోలను వాడుతుంటారు. చిరు అనుమతి లేకుండానే ఇవన్నీ జరుగుతుంటాయి. ఇకపై అలా నడవదు. చిరంజీవి పేరుని, ఫోటోలను వాడితే ఇక జైలుకే. తాజాగా కోర్ట్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. చిరంజీవి పేరుని మిస్ యూజ్ చేస్తే ఆ నష్టాన్ని డబ్బుతో వెలకట్టలేమని తెలిపింది. ఇది చిరంజీవి వ్యక్తిగత హక్కులను కాపాడే ఉద్దేశ్యమని పేర్కొంది.
చిరంజీవి కీర్తిని డబ్బు భర్తీ చేయలేదుః కోర్ట్
మెగాస్టార్ చిరంజీవి పేరు, ఇమేజ్, వాయిస్, బిరుదులను అనధికారికంగా వాడటం, ఏఐ ద్వారా సృష్టించడం నుంచి రక్షణ కల్పిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఏ మీడియా సంస్థ అయినా, యూట్యూబ్ ఛానెల్ అయినా, బ్రాండ్(ప్రకటనలు) అయినా, వ్యక్తి అయినా చిరంజీవి అనుమతి లేకుండా అతని పోలిక, గుర్తింపులను కానీ ఉపయోగించకూడదని, చిరంజీవి కీర్తి, గుర్తింపు సాటిలేనిదని కోర్టు వెల్లడించింది. చిరు ఇమేజ్, టైటిల్స్, వాయిస్‌లను దుర్వినియోగం చేయడం వల్ల వచ్చే నష్టాన్ని డబ్బు భర్తీ చేయలేదని కోర్టు స్పష్టం చేసింది. ప్రజలతో చిరంజీవికి నేరుగా ముడిపడి ఉన్న `మెగాస్టార్, బాస్, అన్నయ్య, చిరు` వంటి ట్యాగ్‌లకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. అనేక కంపెనీలు, సోషల్ మీడియా ఖాతాలు అనుమతి లేకుండా చిరంజీవి ఫోటోలను, ఏఐ జనరేటెడ్ చిత్రాలు ముద్రించిన టీషర్టు లు, పోస్టర్లు వంటి వస్తువులను అమ్ముతున్నాయని చిరంజీవి తరఫు న్యాయవాది కోర్టుకి విన్నవించారు. అవి తప్పుదారి పట్టించేవిగా, ఆయన ప్రతిష్టని దెబ్బతీసేవిగా ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు చిరంజీవి పర్సనాలిటీ రైట్స్ ని కాపాడుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
తదుపరి విచారణ అక్టోబర్ 27న
అయితే ప్రభుత్వ సంస్థలకు ఈ విషయంలో మినహాయింపు ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ అక్టోబర్ 27కి వాయిదా వేసింది కోర్ట్. అప్పటి వరకు చిరంజీవి పేరుని ఏ రకంగానూ మిస్ యూజ్ చేయకూడదని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై చిరంజీవి పేరుని, ఇమేజ్ ని వాడుకొని సొమ్ము చేసుకోవాలనుకుంటే జైలుకే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
నాలుగు సినిమాల లైనప్‌తో బిజీగా చిరంజీవి
ప్రస్తుతం చిరంజీవి `మన శంకరవరప్రసాద్ గారు` చిత్రంలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో నయనతార హీరోయిన్ కావడం విశేషం. ఇటీవల విడుదలైన `మీసాల పిల్ల` సాంగ్ ఎంతగా అలరిస్తుందో తెలిసిందే. దీంతోపాటు ఆయన `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి వశిష్ట దర్శకుడు. వీఎఫ్‌ఎక్స్ వల్ల ఇది డిలే అవుతూ వస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కాబోతుంది. దీంతోపాటు శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు చిరు, అలాగే బాబీ దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నారు. ఇలా నాలుగు సినిమాల లైనప్‌తో ఆయన బిజీగా ఉండటం విశేషం.