ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ మూవీ రివ్యూ, ఆత్మహత్యలు ఇలా కూడా ఉంటాయా..?
డిఫరెంట్ కాన్సెప్ట్.. అది కూడా నిజ జీవితంలో జరిగిన సంఘటలన ఆధారంగా తెరకెక్కింది ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ మూవీ. శుక్రవారం ఆహాలో రిలీజ్ అయిన ఈసినిమా రివ్యూ ఎలా ఉందంటే..?
రామ్‌కార్తిక్, హెబ్బాపటేల్ జంటగా నటించిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ ది గ్రేట్ ఇండియన్ సూసైడ్. విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించిన ఈసినిమా తాజాగా ఆహా ఓటీటీ లో రిలీజ్ అయ్యింది. ముందుగా తెలిసిన వాళ్ళు టైటిల్ తో స్టార్ట్ అయిన ఈసినిమా.. ఆతరువాత ది గ్రేట్ ఇండియన్ సూసైడ్‌గా పేరు మార్చి రిలీజ్ చేశారు. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం..?
ఇక ఈసినిమా కథ విషయానికి వస్తే.. హీరో హేమంత్ (రామ్‌కార్తిక్) ఎవరూ లేని ఓ అనాథ. కష్టపడి పైకి వచ్చిన అతను తన స్నేహితుడితో కలిసి కాఫీషాప్ రన్‌చేస్తుంటాడు. అతడి షాప్‌కు కుకీస్ సప్లై చేస్తుంటుంది హీరోయిన్ పాత్రధారి చైత్ర (హేభాపటేల్). కొద్ది పరిచయంలోనే చైత్రతో ప్రేమలో పడతాడు హేమంత్. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ చైత్ర మాత్రం అతడి ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దాంతో ఊరు వదలి వెళ్లిపోవాలిఅ నుకుంటాడు హీరో. ఆ విషయం తెలిసిన హీరోయిన్ తిరిగి వచ్చి అతని ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది. కాని అతనికి ఓ షాకింగ్ న్యూస్ చెపుతుంది.
కొద్ది రోజుల్లో తమ ఫ్యామిలీ మొత్తం సూసైడ్ చేసుకోనున్నట్లు చెప్పి షాకిస్తుంది. యాక్సిడెంట్‌లో చనిపోయిన తమ పెదనాన్న బళ్లారి నీలకంఠయ్యను(సీనియర్ నరేష్)ను తిరిగి బతికించడానికి తాము ఆత్మతర్పణం చేసుకుంటున్నామని అంటుంది. దాంతో షాక్ అయిన అతను.. అసలు అక్కడ ఏం జరుగుతుందా అని అతను తెలుసుకునేు ప్రయత్నం చేస్తాడు.. చైత్రతో పాటు ఆమె ఫ్యామిలీ మొత్తాన్ని సేవ్ చేయాలని హేమంత్ ఫిక్స్ అవుతాడు. చైత్ర మెడలో తాళికట్టి ఆమె ఇంట్లో అడుగుపెడతాడు. చైత్ర ఇంట్లో అతడికి ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి.. అక్కడ పరిస్థితులు ఏంటీ.. చైత్ర కుటుంబసభ్యులను నీలకంఠయ్య ఆవహించేది నిజమేనా? ఆత్మహత్య చేసుకోకుండా చైత్ర కుటుంబాన్ని హేమంత్ కాపాడగలిగాడా? ఆ కుటుంబాన్ని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించింది ఎవరు? అసలు సంగతేంటి అనేది సినిమా కథ.
ఇక సినిమా ఎలా ఉంది అంటే.. మూఢ విశ్వసాలు.. భక్తి పేరున భయం.. నమ్మకాల పేరుతో మోసాలు.. ఇలా రకరకాల కారణాల మధ్య నలిగే కథ ఇది. అంతే కాదు ఓ యధార్ధ కథను చిన్న లైన్ గా తీసుకుని అద్భుతంగా తెరకెక్కించాడు విప్లవ్ కోనేటి. మదనపల్లెలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు విప్లవ్ కోనేటి అద్భుతమైన కథగా మలిచాడు. చనిపోయిన వ్యక్తిని తిరిగి బతికించవచ్చనే భ్రమలో ఆత్మహత్యకు సిద్ధమైన కుటుంబంలోని మిస్టరీని సాల్వ్ చేసేందుకు ఓ యువకుడు సాగించిన జర్నీ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ మూవీ సాగుతుంది. చివరలో రివేంజ్ డ్రామాతో పాటు తెలిసినవాళ్ల చేతుల్లోనే చిన్న పిల్లలు ఎక్కువగా లైంగికదాడులకు గురువుతున్నారనే సందేశాన్ని ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్.
ఫ్యామిలీ మిస్టరీని సాల్వ్ చేసేందుకు హేమంత్ చేసే ప్రయత్నాలతో ఒక్కో ట్విస్ట్ ను రివీల్ చేస్తూ క్లైమాక్స్ వరకు ఉత్కంఠభరితంగా సినిమా సాగుతుంది. నచ్చితే నమ్మకం...నచ్చకపోతే మూఢనమ్మకం అంటూ వచ్చే కొన్ని డైలాగ్స్ మెప్పిస్తాయి. ఓ యువకుడు.. ఏమాత్రం భయపడకుండా.. ఇలాంటి కుటుంబంలోకి వెళ్లి.. వాళ్లను మార్చాలనుకోవడం.. అసలు అతను ఎలా మారుస్తాడు అన్న పాయింట్ ఆడియన్స్ ను సస్పెన్స్ లో.. క్యూరియాసిటీలో కొట్టుమిట్టాడేలా చేస్తుంది. దాంతో సినిమాను కనురెప్ప వేయకుండా చూడాలి అనుకునేలా చేశాడు దర్శకుడు.
ఇక నటీనటుల విషయానికి వస్తే.. రామ్ కార్తిక్ పాత్ర బాగుంటుంది. మిస్టరీని చేదించేందుకు అతను కష్టపడ్డ తీరు బాగుంటుంది. సీరియస్ రోల్‌కు పూర్తిగా అతను న్యాయం చేశాడు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను కలిగిన యువతిగా హెబ్బాపటేల్‌యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా.. హెబ్బా పటేల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో సర్‌ప్రైజ్ చేస్తుంది. ఇక ఫ్యామిలీ మెంబర్స్ గా సీనియర్ యాక్టర్ నరేష్.. పవిత్రా లోకేష్ జంట మెప్పిస్తుంది. ముఖ్యంగా నరేష్ విలనిజంతో ఆకట్టుకున్నారు.
ఇక దర్శకుడు కోనేటి విప్లవ్ కోనేటి సినిమాను బాగా డ్రైవ్ చేశాడు. ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో..ఊహించని ట్విస్ట్ లు ..ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. థ్రిల్లర్స్ ను ప్రేమించి ప్రేక్షకులను కదలనివ్వకుండా చేస్తాయి. ఇక ఈ థ్రిల్లర్ కాన్సెప్ట్ కు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. ఇక నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. మొత్తానికి ఈసినిమా థ్రిల్లర్ లవ్వర్స్ కు పసందైన విందు అని చెప్పవచ్చు.
రేటింగ్‌ః 2.75