- Home
- Entertainment
- Pawan Kalyan:ఎక్కడి గొంగళి అక్కడే... హరి హర వీరమల్లు ఫస్ట్ లుక్ కి ఏడాది... పవన్ నిర్ణయాలతో ప్రాజెక్ట్ వెనక్కి
Pawan Kalyan:ఎక్కడి గొంగళి అక్కడే... హరి హర వీరమల్లు ఫస్ట్ లుక్ కి ఏడాది... పవన్ నిర్ణయాలతో ప్రాజెక్ట్ వెనక్కి
హరి హర వీరమల్లు ఫస్ట్ లుక్ విడుదల చేసి ఏడాది అవుతుంది. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న హరి హర వీరమల్లు ప్రస్తుత పరిస్థితి ఏమిటో చూద్దాం...

నిర్మాత ఏఎమ్ రత్నంతో పవన్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ కాంబినేషన్ లో ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ రూపుదిద్దుకుంది. సూర్య ప్రొడక్షన్స్ కి భారీ లాభాలు తెచ్చిపెట్టిన చిత్రం ఖుషి. తర్వాత 2006లో బంగారం మూవీ నిర్మించారు. బంగారం ఆశించిన విజయం సాధించలేదు.
చాలా కాలం తర్వాత దర్శకుడు క్రిష్(Krish)... వీరి కాంబినేషన్ సెట్ చేశాడు. హరి హర వీరమల్లు నిర్మాణ బాధ్యతలు ఏఎమ్ రత్నం తీసుకున్నారు. హరి హర వీరమల్లు పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్. మొగలులకాలంనాటి కథ. పేదల కోసం పెద్దలను దోచే బందిపోటుగా పవన్ కనిపిస్తున్నారు. పవన్ ఇమేజ్ కి తగిన మాస్ అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రం.
ఈ మూవీ విజయంపై గట్టి నమ్మకంతో ఉన్న రత్నం కాంప్రమైజ్ కాకుండా ఖర్చు చేస్తున్నారు. అయితే సినిమాకు మొదటి నుండి అడ్డంకులే. హరి హర వీర మల్లు 2020లో సెట్స్ పైకి వెళ్ళింది. రెగ్యులర్ షూటింగ్ మొదలైన కొద్దిరోజులకే కరోనా లాక్ డౌన్ వచ్చిపడింది. దీంతో దాదాపు 10 నెలలు షూటింగ్ జరగలేదు.
దానికి తోడు పవన్ (Pawan Kalyan)సహకారం అంతంత మాత్రంగా ఉంది. ఆయన పొలిటికల్ ఎజెండాకు తగ్గట్లుగా షూటింగ్ షెడ్యూల్స్ వేసుకోవాల్సిన పరిస్థితి. పవన్ ఒక షెడ్యూల్ పూర్తి చేస్తే నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. పవన్ రెండు పడవల ప్రయాణంలో హరి హర వీరమల్లు షూటింగ్ నత్త నడకలా సాగుతుంది.
అసలే కరోనా, ఆపై పొలిటికల్ ఎజెండాలు... దానికి తోడు పవన్ ప్రత్యేక ప్రాజెక్ట్స్. హరి హర వీరమల్లు చిత్రాన్ని పక్కన పెట్టి భీమ్లా నాయక్ (Bheemla Nayak)పూర్తి చేశాడు పవన్. భీమ్లా నాయక్ కోసం కేటాయించిన మూడు నెలలు హరి హరి వీరమల్లు షూటింగ్ జరిగితే కనీసం దసరాకైనా మూవీ సిద్ధమయ్యేది. మిత్రుడు త్రివిక్రమ్ సలహా మేరకు ఆయన నిర్మాణ భాగస్వామి నాగవంశీ కోసం భీమ్లా నాయక్ చకా చకా పూర్తి చేసి విడుదల చేశారు.
ఇది హరి హర వీరమల్లు (Hari hara veeramallu)దర్శక నిర్మాతలకు నష్టం చేకూర్చితే... త్రివిక్రమ్, నాగ వంశీలు మాత్రం కోట్లు వెనకేసుకున్నారు. పవన్ కూడా ఓ యాభై కోట్లు అందుకున్నాడు. భీమ్లా నాయక్ షార్ట్ టైం లో పవన్, త్రివిక్రమ్, నాగ వంశీకి డబ్బులు తెచ్చిపెట్టింది.ఏపీ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం నష్టపోయారు. తెలంగాణాలో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక భీమ్లా నాయక్ కారణంగా హరి హర వీరుమల్లు మరికొన్ని నెలలు వెనక్కి పోయింది.
కాగా హరి హర వీరమల్లు చిత్రంతో పాటు మరో రీమేక్ షూట్ లో పవన్ పాల్గొననున్నాడు. వినోదయ చిత్తం రీమేక్ కి రెడీ అయిన పవన్-త్రివిక్రమ్స్ (Trivikram)ఆ ప్రాజెక్ట్ లైన్ లో పెడుతున్నారు. ఈ మూవీ కోసం పవన్ కేవలం 20 రోజుల డేట్స్ మాత్రమే కేటాయించారు. రెమ్యునరేషన్ మాత్రం రూ. 50 కోట్లు తీసుకుంటున్నారట.
ఈ రీమేక్ ఎంతో కొంత హరి హర వీరమల్లు షూట్ డిస్టర్బ్ చేస్తుంది. ఇక పవన్ హరీష్ శంకర్ తో చేయాల్సిన భవదీయుడు భగత్ సింగ్ ఆలస్యం అవుతుంది. మరోవైపు సురేందర్ రెడ్డితో ప్రకటించిన మూవీ రద్దయినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా పవన్ నిర్ణయాలు, వ్యక్తిగత అజెండాలు కారణంగా హరి హర వీరమల్లు షూట్ సరిగా సాగడం లేదు.
అనుకున్నట్లు జరిగితే సమ్మర్ కానుకగా ఏప్రిల్ లో హరి హర వీరమల్లు విడుదల కావాల్సి ఉంది. ఇంకా 30 నుండి 40 శాతం చిత్రీకరణ మిగిలి ఉందని వినికిడి.భారీ ప్రాజెక్ట్ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కావడానికి మరి కొన్ని నెలల సమయం పడుతుంది. కాబట్టి హరి హర వీరమల్లు 2023 వరకు వచ్చే ఆస్కారం లేదు. ఈ లోపు ఒకటి రెండు రీమేక్స్ పవన్ నుండి ఫ్యాన్స్ కోసం రావచ్చు.