`ఈగల్` విషయంలో రవితేజ చేసిన మిస్టేక్ ఇదే.. నెగటివ్ టాక్ కి కారణం ఏంటంటే?
మాస్ మహారాజా రవితేజ నటించిన `ఈగల్`కి చాలా వరకు నెగటివ్ టాక్ వస్తుంది. మరి రవితేజ ఏం మిస్టేక్ చేశాడు. దర్శకుడు కార్తిక్ ఏం మిస్ అయ్యాడు, సినిమా ఎక్కడ మిస్ ఫైర్ అయ్యింది
రవితేజ స్వతహాగా ఎదిగిన హీరో. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఎంతో మందికి లైఫ్ ఇస్తున్నాడు. కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటాడు. అలా ఎంతో మంది దర్శకులకు ఆయన లైఫ్ ఇచ్చాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దర్శకుడిని ఆయన ఒక్కసారి నమ్మాడు అంటే బ్లైండ్‌గా షూటింగ్‌లోకి వెళ్లిపోతాడు. సినిమా కోసం ప్రాణం పెడతాడు. కానీ అదే ఆయన సినిమాల పరాజయాలకు కొంత కారణంగా మారుతుంది.
రవితేజకి ఇటీవలే వరుసగా ఫ్లాప్‌లు పడుతున్నాయి. ఈ మూడు నాలుగేండ్లలో `క్రాక్`, `ధమాఖా` చిత్రాలు హిట్ అయ్యాయి. `వాల్తేర్ వీరయ్య` కూడా హిట్ అయ్యింది. అది చిరంజీవి ఖాతాలోకి వెళ్లిపోయింది. కానీ `ఖిలాడీ`, రావణాసుర`, `టైగర్ నాగేశ్వరరావు` చిత్రాలు డిజప్పాయింట్ చేశాయి. ఈ ఏడాది రెండు బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్లు పడ్డాయి. ఇప్పుడు `ఈగల్`తో హ్యాట్రిక్ పడుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సినిమాకి వస్తోన్న టాక్ చూస్తుంటే అదే జరగబోతుందనే అనుమానాలు కలుగుతున్నాయి.
అయితే ఈ సినిమా విషయంలో రవితేజ చేసిన మిస్టేక్ ఏంటి, దర్శకుడు కార్తీక్ ఎక్కడ లెక్క తప్పాడు? అనేది చూస్తే. రవితేజ అంటే ఎంటర్‌టైన్‌మెంట్. ఆయన నటించిన సినిమాల్లో చాలా వరకు ఎంటర్‌టైన్‌మెంట్స్ ఉన్నవే ఉన్నాయి. సీరియస్ ఫిల్మ్స్ ఒక్కటి కూడా హిట్ కాలేదు. `ఈగల్` విషయంలోనూ ఆ ఎలిమెంట్ మిస్ అయ్యాడు. రవితేజ చేసిన ఎక్స్ పర్‌మెంట్లు బెడిసి కొట్టాయి. ఇప్పుడు కూడా అలానే జరుగుతుందనే కలవరం ఆయన అభిమానుల్లో కలుగుతున్నాయి.
ఇందులో జరిగిన మెయిన్ మిస్టేక్.. కథని స్ట్రెయిట్‌గా చెప్పకపోవడం. మొదటి భాగం మొత్తం రవితేజ పాత్ర ఎలివేషన్లకే పరిమితం చేశాడు. ఒక్కో పాత్రని ఒక్కో ఎలివేషన్ ఇస్తుంటే అది మరీ ఓవర్‌గా అనిపిస్తుంది. చిరాకు తెప్పిస్తుంది. అసలు కథ లేకుండా కేవలం ఎలివేషన్లకే పరిమితం కావడం పెద్ద మైనస్‌గా మారింది. దీనికితోడు కథ చాలా చిన్న పాయింట్. అక్రమ ఆయుధాల రవాణాని అడ్డుకోవడం ఆయన లక్ష్యం. ఎంతో ప్రేమించిన భార్య మరణానికి ఆ ఆయుధాలే కారణం కావడంతో ఆ నిర్ణయం తీసుకుంటాడు. కానీ ఈ విషయం క్లైమాక్స్ వరకు వస్తే గానీ అర్థం కాదు.
మరోవైపు హీరోయిన్‌కి కాటన్ అంటే ఇష్టం, దాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎంకరేజ్ చేయాలనుకుంటుంది. అందుకే ఇందులో కాటన్ అనేది ఓ ఎలిమెంట్‌గా తీసుకున్నారు. కానీ దాన్ని బలంగా మ్యాచ్ చేయడంలో దర్శకుడు కార్తీక్ సక్సెస్ కాలేకపోయాడు. దీంతో ఎలివేషన్లకి, అసలు కథకి సంబంధం లేకుండా పోయింది. అదే ఆడియెన్స్ కి అర్థం కాలేదు. కథని ఒక్కో పాత్ర ఒక్కో అంశం చెప్పడం, వెనక్కి ముందుకు చెప్పడం కూడా కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. దీనికితోడు డైలాగులు కూడా సాధారణంగా లేవు, యాసలు, ప్రాసలు అంటూ రకరకాలుగా తిప్పారు. స్ట్రెయిట్‌గా మాట్లాడటం అనేది చాలా అరుదుగా ఉంటుంది. అది అర్థం కాకపోవడం కూడా పెద్ద మైనస్.
రవితేజ ఈగల్‌గా ఎందుకు మారాడు అనేది చెప్పలేదు. విదేశాల్లో తుపాకులు పట్టుకుని ఈజీగా తిరుగుతూ కనిపించడం, దాని రిలేటెడ్ సీన్లు చాలా వరకు లాజిక్ లెస్‌గా ఉన్నాయి. మరోవైపు ఇండియాలో ఆయన సాహదేవ్‌గా ఉండటం, తన కోటలోకి ఎవరినీ రానివ్వకుండా ఉండటం, పదే పదే రాజకీయ నాయకుడు దాన్నే టార్గెట్ చేయడం కూడా అసహజంగా అనిపిస్తుంది. ఓవర్ డ్రామాగా మారిపోయింది.
సినిమాలో రవితేజ పాత్రకి ఓవర్ ఎలివేషన్లు ఇచ్చారు. ఓ రకంగా `కేజీఎఫ్` స్టయిల్‌ని ఫాలో అయ్యారు. అందులో ప్రారంభం నుంచి హీరో పాత్రలోని ఎమోషన్, తల్లి సెంటిమెంట్‌ని చూపిస్తూ, తన అవమానాలు, తన బాధలను చూపిస్తూ ఎలివేషన్లు ఉంటాయి. ఆయన రాకీభాయ్‌గా ఎదిగిన తీరు ఉంటుంది. కానీ ఇందులో అది మిస్ అయ్యింది. హీరో పాత్రలోని ఎమోషన్ ఏంటో తెలియదు. దీంతో అవి జస్ట్ సీన్లుగానే మిగిలిపోయాయి. అదే సమయంలో కన్‌ఫ్యూజన్‌కి కారణమయ్యింది. ఆ విషయంలో దర్శకుడు కార్తిక్ కేర్ తీసుకుంటే, కథ సాఫీగా చెబుతూ, ఎమోషన్‌ని చూపిస్తూ చెబితే సినిమా నిజంగానే అదిరిపోయేది. యాక్షన్ సీన్లు, స్టయిలీష్ మేకింగ్ మాత్రం అదిరిపోయింది. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీలో ఆయనకు జోడీగా కావ్య థాపర్ నటించింది. జర్నలిస్ట్ గా అనుపమా కనిపించింది. సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు.
Read more: #Eaglereview రవితేజ ‘ఈగల్’రివ్యూ