దీనస్థితిలో చెప్పవే చిరుగాలి, వసంతం చిత్రాల డైరెక్టర్.. భార్య కోసం ఆస్తులన్నీ అమ్మేసి..
ఆర్థిక సమస్యల్లో చిక్కుకుపోయి దుర్భర జీవితాన్ని అనుభవించిన చిత్ర ప్రముఖులు చాలా మందే ఉన్నారు. విక్టరీ వెంకటేష్ తో వసంతం, వేణుతో చెప్పవే చిరుగాలి లాంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు విక్రమన్ ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది.
చిత్ర పరిశ్రమలో దర్శకులు, నిర్మాతలు, నటీనటుల పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతుంటాయో చెప్పలేం. అందుకు ఉదాహరణ మహానటి సావిత్రి. మహానటిగా చెరగని ముద్ర వేసిన సావిత్రి చివరి రోజుల్లో ఎలాంటి జీవితాన్ని గడిపారో అందరికీ తెలిసిందే. అదే విధంగా ఆర్థిక సమస్యల్లో చిక్కుకుపోయి దుర్భర జీవితాన్ని అనుభవించిన చిత్ర ప్రముఖులు చాలా మందే ఉన్నారు.
విక్టరీ వెంకటేష్ తో వసంతం, వేణుతో చెప్పవే చిరుగాలి లాంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు విక్రమన్ ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. విక్రమన్ తమిళంలో సూర్యవంశం చిత్రాన్ని తెరకెక్కించారు. ఆయన తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయారట. ఈ సంగతి చెప్పింది ఎవరో కాదు స్వయంగా అతడి భార్య జయప్రియ.
విక్రమన్ భార్య జయప్రియ ప్రస్తుతం నడవలేని స్థితిలో మంచానికే పరిమితం అయ్యారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో జయప్రియ ప్రస్తుతం తన ఆరోగ్యం, భర్త పడుతున్న సమస్యలు, కుటుంబ సమస్యల గురించి వివరించారు.
మొదట తనకి వెన్ను నొప్పి వచ్చిందట. సిటీ స్కాన్ చేస్తే క్యాన్సర్ లాగా ఉంది.. బయాప్సి చేయాలి అని చెప్పారు. నా భర్త చాలా కంగారు పడ్డారు. వెన్నునొప్పే కదా ఆపరేషన్ పేరుతో వాళ్ళు ఏమేం చేస్తారో ఏమో.. వద్దని విక్రమన్ అన్నాడు. నిజంగా క్యాన్సర్ అయితే ప్రమాదం అవుతుంది కాబట్టి నేను ఆపరేషన్ కి అంగీకరించా. అరగంటలో పూర్తి అవుతుందని చెప్పి ఆపరేషన్ కి మూడు గంటల సమయం తీసుకున్నారు.
నెలరోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచారు. కనీసం నడవడం కూడా సాధ్యం కావడం లేదు. తరచుగా ఫిజియో థెరపీ చేయించుకోవాలి అని అన్నారు. ఎన్ని మందులు వాడినా నాకు నయం కావడం లేదు. కనీసం బాత్రూం కి కూడా వెళ్లలేకపోతున్నా. ఎప్పుడూ ఇద్దరు నర్సుల అవసరం ఉంటోంది. నా భర్త నా కోసం ఎంతో కుంగిపోయారు. నా చికిత్స కోసం ఎంతో కస్టపడి సంపాదించిన ఆస్తులన్నీ అమ్మేశారు. ప్రస్తుతం మేము దిక్కుతోచని స్థితిలో ఉన్నాం అంటూ జయప్రియ ఆవేదన వ్యక్తం చేసింది.
నా అనారోగ్యం కారణంగానే విక్రమన్ చిత్ర పరిశ్రమకు కూడా దూరం అయ్యారు అని జయప్రియ పేర్కొంది. ఆ మధ్యన సూర్యవంశం 2 తెరకెక్కించడం కోసం విక్రమన్ ని అడిగారు. కానీ నా అనారోగ్యం కారణంగా ఆ చిత్రాన్ని ఆయన ఒప్పుకోలేదు. నన్ను ఈ పరిస్థితుల్లో వదిలేసి వెళ్లడం ఇష్టం లేక వృత్తికి కూడా దూరం అవుతున్నారు అని జయప్రియ కన్నీరు మున్నీరైంది.