సుకుమార్ డిప్రెషన్ లోకి వెళ్లిన సందర్భం, సినిమాలు వదిలేసి అమెరికా వెళ్ళిపోదాం అని చెప్పిన భార్య
డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని డైరెక్టర్. పుష్ప 2 చిత్రం డిసెంబర్ లో విడుదలైన బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు సృష్టించిందో చూశాం. ఇండియాలో బిగ్గెస్ట్ హిట్ అయిన బాహుబలి 2 రికార్డులని సైతం తుడిచిపెట్టేలా పుష్ప 2 ప్రభంజనం సృష్టించింది.
డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని డైరెక్టర్. పుష్ప 2 చిత్రం డిసెంబర్ లో విడుదలైన బాక్సాఫీస్ వద్ద ఎన్ని సంచలనాలు సృష్టించిందో చూశాం. ఇండియాలో బిగ్గెస్ట్ హిట్ అయిన బాహుబలి 2 రికార్డులని సైతం తుడిచిపెట్టేలా పుష్ప 2 ప్రభంజనం సృష్టించింది. ఇందంతా డైరెక్టర్ సుకుమార్ విజన్ తోనే సాధ్యం అయింది. లెక్కల మాస్టారుగా తూర్పు గోదావరి మారుమూల గ్రామం నుంచి వచ్చిన సుకుమార్ ఇప్పుడు ఇండియా మొత్తం తన వైపు చూసే స్థాయికి ఎదిగారు.
సుకుమార్ బర్త్ డే, లెక్కల మాస్టారుగా కెరీర్ ప్రారంభం
సుకుమార్ నేడు 55వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. సుకుమార్ కెరీర్ లో జరిగిన ఆసక్తికర పరిణామాలు ఇప్పుడు తెలుసుకుందాం. సుకుమార్ 1970, జనవరి 11న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మట్టపర్రు అనే గ్రామంలో జన్మించారు. డిగ్రీ పూర్తయ్యాక లెక్కల మాస్టారుగా సుకుమార్ ట్యూషన్స్ చెప్పడం ప్రారంభించారు. లెక్కల మాస్టారుగా సుకుమార్ కి మంచి పేరు ఉంది. అప్పట్లో డైరెక్టర్ వంశీ ఎక్కువగా గోదావరి ప్రాంతంలో తన చిత్రాలని తెరకెక్కించేవారు. అలా వంశీ చిత్రాల షూటింగ్ చూస్తూ సుకుమార్ కి కూడా సినిమాలపై ఆసక్తి పెరిగిందట.
అసిస్టెంట్ డైరెక్టర్ గా చిత్ర పరిశ్రమలోకి..
మెగా బ్రదర్ నాగబాబు సహాయంతో ఎడిటర్ మోహన్ దగ్గర సుకుమార్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యారు. క్షేమంగా వెళ్లి లాభంగా రండి, హనుమాన్ జంక్షన్ లాంటి చిత్రాలకు సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. 2004లో సుకుమార్ కి దర్శకుడిగా ఆర్య చిత్రంతో తొలి అవకాశం వచ్చింది. దిల్ రాజు నిర్మాణంలో, దేవిశ్రీ సంగీత దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య ఘనవిజయం సాధించింది. అప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్న ప్రేమ కథా చిత్రాలు వేరు ఆర్య వేరు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. సుకుమార్ కథ తెరకెక్కించిన విధానం కూడా అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది. ఒక్క చిత్రంతోనే సుకుమార్ క్రేజీ డైరెక్టర్ గా మారిపోయారు.
విజయగర్వంతో తొలి ఎదురుదెబ్బ
సుకుమార్ కి కెరీర్ తగిలిన తొలి ఎదురుదెబ్బ జగడం. దిల్ రాజు లాంటి సన్నిహితులు ఈ చిత్రం వర్కౌట్ కాదు అని చెప్పినా సుకుమార్ వినలేదు. తొలి చిత్రం సక్సెస్ కావడంతో విజయగర్వం తలెక్కింది అని సుకుమార్ స్వయంగా చెప్పారు. అల్లు అర్జున్ తో కానీ మహేష్ బాబుతో కానీ జగడం చిత్రం చేయాలని అనుకున్నారట. వాళ్ళు ఒప్పుకోకపోవడంతో కోపం వచ్చి రామ్ పోతినేనితో తెరకెక్కించారు. జగడం డిజాస్టర్ అయింది. తొలి దెబ్బ ఎదురయ్యాక రియలైజ్ అయ్యానని సుకుమార్ తెలిపారు.
సినిమాలు వదిలేసి అమెరికా వెళదాం అని చెప్పిన భార్య
సుకుమార్ జగడం షాక్ నుంచి త్వరగానే కోలుకుని అల్లు అర్జున్ తో ఆర్య 2 తెరకెక్కించారు. అది కూడా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత 100 పర్సెంట్ లవ్ చిత్రం విజయం సాధించింది. సుకుమార్ కి అతిపెద్ద షాక్ 1 నేనొక్కడినే చిత్రంతో తగిలింది. సూపర్ స్టార్ మహేష్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన 1 నేనొక్కడినే చిత్రం పెద్ద డిజాస్టర్. ఈ చిత్రంపై సుకుమార్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ 1 నేనొక్కడినే చిత్రం మహేష్ ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదు. భారీగా నష్టాలు మిగిల్చింది. దీనితో సుకుమార్ కొంతకాలం డిప్రెషన్ లోకి వెళ్లారట. సుకుమార్ భార్య తబితకి అప్పట్లో సినిమాల గురించి ఎక్కువగా తెలియదు. 1 నేనొక్కడినే ఫ్లాప్ తర్వాత తాను బాధపడుతుంటే.. ఇక సినిమాలు వద్దు, వదిలేసి యుఎస్ వెళ్ళిపోదాం. అక్కడ లెక్చరర్ కి రూ లక్ష రూపాయలు జీతం ఇస్తారు. హ్యాపీగా బతికేయొచ్చు అని చెప్పిందట. తాను అంత పెద్ద డైరెక్టర్ అనినప్పటికీ తన భార్యకి సినిమాల గురించి ఎక్కువగా అవగాహన లేదు అని సుకుమార్ తెలిపారు.
పుష్ప 2తో సరికొత్త చరిత్ర
1 నేనొక్కడినే తర్వాత ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో చిత్రం తెరకెక్కించి సుక్కు కెరీర్ నిలబెట్టుకున్నారు. రంగస్థలం చిత్రంతో సుకుమార్ జూలు విదిల్చాడు. రచయితగా, దర్శకుడిగా సుకుమార్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లిన చిత్రం రంగస్థలం. టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో రంగస్థలం కూడా ఉంటుంది. రంగస్థలం చిత్రం ఇచ్చిన ప్రోత్సాహంతో సుకుమార్ పాన్ ఇండియా చిత్రాలు ప్రారంభించారు. అల్లు అర్జున్ తో పుష్ప తెరకెక్కించగా నార్త్ లో సంచలన విజయం సాధించింది. ఇటీవల విడుదలైన పుష్ప 2 దాదాపు 2000 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. సుకుమార్ తదుపరి చిత్రం రాంచరణ్ తో ఉండబోతోంది.