- Home
- Entertainment
- ఇక సర్దుకుపోలేం, అది అడిగినందుకే రచ్చ.. స్పిరిట్, కల్కి 2 నుంచి తప్పుకోవడంపై దీపికా పదుకొణె
ఇక సర్దుకుపోలేం, అది అడిగినందుకే రచ్చ.. స్పిరిట్, కల్కి 2 నుంచి తప్పుకోవడంపై దీపికా పదుకొణె
Deepika Padukone: స్పిరిట్, కల్కి 2 చిత్రాల నుంచి తప్పుకోవడంపై ఎట్టకేలకు దీపికా పదుకొణె స్పందించింది. 8 గంటల వర్క్ విషయంలోనే విభేదాలు వచ్చినట్లు పేర్కొంది.

కల్కి 2, స్పిరిట్ వివాదంపై దీపికా కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇటీవల స్పిరిట్, కల్కి 2 లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాల నుంచి తప్పుకోవడంతో వార్తల్లో నిలిచింది. ఈ రెండు ప్రాజెక్టులు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో రూపొందుతున్నవే. దీపికా పదుకొణె అధిక పారితోషికం, వర్క్ అవర్స్‌పై ఆంక్షలు, తన కుమార్తెను చూసుకోవడానికి సమయం కేటాయించాలనే కారణాల వల్ల ఈ సినిమాల నుంచి తప్పుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి.స్పిరిట్ నుంచి తప్పుకున్నప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరిగింది. దీపికా, సందీప్ రెడ్డి వంగా మధ్య వివాదం అన్నట్లుగా వ్యవహారం వెళ్ళింది.
క్రూరమైన వర్క్ కండిషన్స్
స్పిరిట్ తర్వాత కల్కి 2 చిత్ర యూనిట్ కూడా దీపికా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీనితో మరోసారి దీపికా వార్తల్లో నిలిచింది. ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించని దీపికా, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తొలిసారిగా ఈ అంశంపై మాట్లాడింది. ఆమె భారత సినీ పరిశ్రమలో ఉన్న వర్క్ కండిషన్స్ క్రూరమైనవి అనిఅభివర్ణించారు. మన పరిశ్రమలో సర్దుకుపోయే ధోరణిని మార్చాల్సిన సమయం వచ్చేసింది అని దీపికా వ్యాఖ్యానించింది.
పురుష సూపర్ స్టార్లకు మాత్రం సపరేట్ రూల్స్
దీపికా మాట్లాడుతూ, “భారత సినీ పరిశ్రమ ఒక స్ట్రక్చర్డ్ వర్క్‌ప్లేస్ లా ఇప్పటివరకు సరిగ్గా పనిచేయలేదు. కానీ నేను నెమ్మదిగా, స్థిరంగా ఈ వ్యవస్థను మార్చే దిశగా ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు పనిచేస్తున్న విధానం చాలా క్రూరంగా ఉంటోంది అని దీపికా పేర్కొంది. అలాగే, ఆమె లింగ వివక్ష సమస్యను కూడా ప్రస్తావించింది. “చాలా మంది పురుష సూపర్‌స్టార్లు సంవత్సరాల తరబడి రోజుకు ఎనిమిది గంటలకంటే ఎక్కువ పనిచేయరు. కొంతమంది పురుష స్టార్లు సోమవారం నుంచి శుక్రవారం వరకు పని చేసి వీకెండ్ లో హాలిడే తీసుకుంటారు. కానీ అది ఎప్పుడూ వార్తల్లోకి రాదు. మహిళలు మాత్రం అదే చేయాలంటే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది,” అని దీపికా తెలిపింది.
అది అడగడం వల్లే తప్పించారు
సినీ పరిశ్రమలో మహిళలకు మరింత గౌరవం, సమతుల్య వర్క్ కండిషన్స్ అవసరమని ఆమె స్పష్టం చేసింది. “ప్రతీ ఒక్కరూ ఒక సురక్షితమైన, ప్రొఫెషనల్ వాతావరణంలో పనిచేయాలి. సినిమా పరిశ్రమ కూడా ఒక సుస్థిరమైన కార్పొరేట్ వర్క్ కల్చర్‌లా మారాలి,” అని ఆమె పేర్కొంది. 8 గంటలు వర్క్ చేస్తానని చెప్పడం వల్లే తనని ఇటీవల కొన్ని చిత్రాల నుంచి తప్పించినట్లు దీపికా పేర్కొంది. గత కొంతకాలంగా దీపికా పదుకొణె పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లకు సంతకం చేసినా, తాను పాల్గొనలేకపోవడం వెనుక ఉన్న కారణాలను ఈ ఇంటర్వ్యూలో ఆమె స్పష్టంచేసినట్టయింది. “నాకు సినిమాతో పాటు నా కుటుంబం, నా వ్యక్తిగత జీవితం కూడా అంతే ముఖ్యం. సమతుల్యతను కాపాడుకోవడమే నా ప్రాధాన్యత,” అని ఆమె తెలిపింది.
మరి ఆ డిమాండ్ల సంగతి ఏంటి ?
దీపికా పదుకొణె ప్రస్తుతం బాలీవుడ్‌లో కొన్ని కొత్త ప్రాజెక్ట్‌లకు సిద్ధమవుతోంది. అయితే కేవలం వర్కింగ్ అవర్స్ గురించి మాత్రమే కాదు.. ఆమె గతంలో కల్కి చిత్రానికి తీసుకున్న రెమ్యునరేషన్ కంటే 50 శాతం ఎక్కువ డిమాండ్ చేసిందని వార్తలు వచ్చాయ. అదే విధంగా తనకి ఉన్న 25 మంది సిబ్బంది ప్రయాణ ఖర్చులు, వసతి లాంటివి నిర్మాతలే భరించాలని డిమాండ్ చేసిందట. ఈ డిమాండ్లకు బెదిరిపోయిన నిర్మాతలు ఆమెని తప్పించినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీపికా తెలివిగా వీటి గురించి మాత్రం స్పందించలేదు.