#BRO:వివాదంతో ఫుల్ పబ్లిసిటి, సాయి తేజ సైతం కౌంటర్లు
సంక్రాంతి సందర్భంగా అంబటి స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. టీషర్ట్, ట్రాక్ ప్యాంట్ ధరించి ఆయన వేసిన డ్యాన్స్ అప్పట్లో వైరల్ అయింది. అదే డ్యాన్స్ ను ఇప్పుడు పవన్ కల్యాణ్ 'బ్రో' సినిమాలో పృథ్వీ చేత వేయించారు.

Pawan Kalyan, Ambati Rambabu,
పవన్ కల్యాణ్ తాజా రీమేక్ 'బ్రో'. 2021లో సముద్రఖని దర్శకత్వంలో తమిళంలో హిట్ కొట్టిన 'వినోదయా సితం' సినిమా మొన్న శుక్రవారం రిలీజ్ అయ్యింది. అక్కడ స్టార్స్ ఎవరూ లేకుండా ఓటీటిలో రిలీజైన సినిమా అది. ఆ కథకి పవన్ క్రేజ్ ను యాడ్ చేస్తే కథలోని నేచురాలిటీ దెబ్బతింటుందనే కామెంట్స్ వినిపించాయి. ఆ కామెంట్స్ కి దూరంగా సముద్రఖని ఈ కథను తీసుకెళ్లే ప్రయత్నం చేసాడు. పవన్ క్రేజ్ కి తగినట్టుగా కథను బ్యాలెన్స్ చేయగలిగారు. అయినా ఈ సినిమాకు మిక్సెడ్ టాక్ వచ్చింది. కానీ ఓపినింగ్స్ మాత్రం చాలా బాగున్నాయి.
ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ సరిగ్గా లేవని అందరూ అన్నారు. అయితే ఇప్పుడు అంబటి రాంబాబు రూపంలో సినిమాకు భారీ పబ్లిసిటీ దొరుకుతోంది. జనసేన , పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు, అంబటి అభిమానులు ఈ విషయమై పోస్ట్ లు పెట్టి మరీ ఈ సినిమాని ట్రెండ్ చేస్తున్నారు. అలా రిలీజ్ కు ముందు దొరకని ప్రమోషన్, పబ్లిసిటీ రిలీజ్ అయ్యాక ఈ ఒక్క వివాదంతో దొరుకుతోందనేది నిజం.
'బ్రో'లో అంబటిని టచ్ చేసేలా ఓ సన్నివేశం ఉంది. గతంలో సంక్రాంతి సందర్భంగా అంబటి రాంబాబు డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. అలాంటి డాన్స్ సీన్ ని ఎవరినీ ప్రత్యేకంగా టార్గెట్ చేయని విధంగా ఈ చిత్రంలో పెట్టారు. అంబటి వేసిన విధంగానే నటుడు పృథ్వీతో డ్యాన్స్ చేయించారు. అంతేకాదు ఆరోజున అంబటి వేసుకున్న డ్రెస్ నే పృథ్వీకి ధరింపజేశారు. ఈ సందర్భంగా పవన్ కొట్టే డైలాగ్ కూడా అంబటికి సూటిగా తగిలేలా ఉంది. శ్యాంబాబు.. వస్తున్న టెంపో ఏమిటి? నువ్వు వేస్తున్న స్టెప్పులు ఏమిటి? అని పవన్ ప్రశ్నిస్తారు.
ఈ సినిమాలపై శ్యామ్‌బాబు క్యారెక్టర్‌పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఏపీ మంత్రి అంబటి రాంబాబును అనుకరిస్తూ బ్రో.. సినిమాలో శ్యామ్‌బాబు డ్యాన్స్ చేశారని కామెంట్స్ వచ్చాయి. దీనిపై మంత్రి అంబటి కూడా స్పందించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక.. సినిమాల్లో తన క్యారెక్టర్ పెట్టి పవన్ కల్యాణ్ ఆనంద పడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఎద్దేవా చేశారు. ‘నేను డాన్స్ వేసిన మాట వాస్తవమే. సంక్రాంతి రోజున సరదాగా ఆనంద తాండవం చేస్తా’ అని తెలిపారు. ఈ సీన్ నేపథ్యంలోనే అంబటి ట్వీట్ చేశారని భావిస్తున్నారు.
అంబటి చేసిన వ్యాఖ్యలపై శ్యామ్‌బాబు (పృధ్వీరాజ్) స్పందించారు. తాము ఎవరినీ ఇమిటేట్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ‘‘బ్రో.. సినిమా చలనచిత్ర రంగంలో ఒక అద్భుతం. ఇప్పటి వరకు పవన్‌తో కలిసి చాలా హిట్ సినిమాల్లో నటించా. ఈ సినిమాలో నా క్యారెక్టర్, నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అద్భుతమని ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. చిత్ర దర్శకుడు సముద్రఖనికి కృతజ్ఞతలు అన్నారు.
అలాగే ఏపీ మంత్రి అంబటి రాంబాబును ఈ సినిమాలో ఇమిటేట్ చేశానంటున్నారు. ఆయన్ను ఇమిటేట్ చేయాల్సిన అవసరం లేదు. నటుడిగా నాకిచ్చిన పాత్ర పోషించడం ముఖ్యం. ఆ పాత్ర ఏంటంటే.. ఓ పనికిరాని దద్దమ్మ తన బాధ్యతలన్నీ వదిలేసి క్లబ్బులు, అమ్మాయిల వెంట తిరుగుతుంటాడు. అలాంటి వేషం అది.. అలాగే చేశాను. అంబటి రాంబాబు క్యారెక్టర్ చేయాల్సిన అవసరం నాకు, మా టీమ్‌కు లేదు. పవన్ కల్యాణ్ గారికి కూడా అలాంటి ఉద్దేశం లేదు.
దారి తప్పిన ఓ బడుద్దాయిని దారిలో పెట్టాలనేదే కాన్సెప్ట్. శ్యామ్‌బాబు క్యారెక్టర్ అద్భుతంగా పబ్లిసిటీ అయింది. అంబటి రాంబాబును అనుకరించడానికి ఆయనేమీ ఆస్కార్ నటుడు కాదు. ఆ డ్యాన్స్ అలా ఉందని వారు అనుకుంటున్నారేమో కానీ, మేము అనుకోవటం లేదు.
మా కన్నా రాంబాబు గొప్పగా డ్యాన్స్ చేశారు. మా డ్యాన్స్ వేరు.. ఆయన డ్యాన్స్ వేరు. మంత్రిగారిని కించపరుస్తున్నారని అంటున్నారు.. అది కాదు. పవన్ కల్యాణ్ పట్ల.. మంత్రి జోగి రమేశ్ అసభ్యంగా మాట్లాడారు. అదీ కించపరచడమంటే. ఆ విషయం తెలుసుకుంటే మంచిది. 2024 అద్భుతంగా ఉంటుంది. పవన్ కల్యాణ్ నట విశ్వరూపం బ్రో.. సినిమా’’ అని పృథ్వీరాజ్ అన్నారు.
Bro Movie Review
మరోవైపు ఈ సినిమా హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్లు కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, నిర్మాత విశ్వప్రసాద్ ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు డ్యాన్స్ ను సినిమాలో పెట్టారనే విషయాన్ని యాంకర్ లేవనెత్తారు. దీనికి సమాధానంగా అలాంటిది ఏమీ లేదని సాయితేజ్ చెప్పారు.
Bro Movie Review
సాయి తేజ్ మాట్లాడుతూ... ఆరోజు డ్యాన్స్ చేసిన సందర్భంగా అంబటి వేసుకున్న టీషర్ట్, ప్యాంట్, షూ లాంటివే ఈ సినిమాలో కూడా పృథ్వీ వేసుకున్నారని యాంకర్ తెలిపారు. దీనిపై సాయితేజ్ స్పందిస్తూ... ఇద్దరి హెయిర్ స్టైల్ వేరుగా ఉందని, పృథ్వీకి మీసాలు లేవని చెప్పారు. మరోవైపు అంబటి రాంబాబు గారు చాలా బాగా డ్యాన్స్ చేశారని కితాబునిచ్చారు.