- Home
- Entertainment
- Chiranjeevi: ఓటీటీలోకి మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీ.. ఇది నా అడ్డా అంటూ చిరంజీవి రచ్చ.. ఎప్పుడంటే?
Chiranjeevi: ఓటీటీలోకి మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీ.. ఇది నా అడ్డా అంటూ చిరంజీవి రచ్చ.. ఎప్పుడంటే?
Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి హోస్ట్ అవతారం ఎత్తారు. గతంలో ఓసారి ఈ బాధ్యతలను సక్సెస్ ఫుల్ గా నిర్వహించిన చిరు.. ఈసారి మరో భారీ కార్యక్రమంతో సందడి చేయబోతున్నారు. ఈ ప్రోగ్రామ్ కు సబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది.

ఓటీటీలో మెగాస్టార్ రచ్చ..
తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు డిజిటల్ తెరపై కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఆయన హోస్ట్‌గా వ్యవహరించనున్న సరికొత్త టాక్ షో 'మెగావర్స్' త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ షూటింగ్ మొదలై కొన్ని ఎపిసోడ్ల చిత్రీకరణ కూడా పూర్తి కాగా, తాజాగా విడుదలైన ప్రోమో ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తోంది.
హైదరాబాద్ హోర్డింగ్స్ మిస్టరీకి తెరపడిందిలా!
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలోని పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన ప్రచార బోర్డులు జనాల్లో తీవ్ర ఉత్సుకతను రేకెత్తించాయి. ఆ పోస్టర్లలో చిరంజీవి పేరులోని 'N' అక్షరం కనిపించకపోవడంతో అసలు ఏం జరుగుతోందా అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలోనూ దీనిపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి.
తాజా ప్రోమోతో ఆ ఉత్కంఠకు తెరపడింది. స్వయంగా చిరంజీవి రంగంలోకి దిగి, తన పేరులో మాయమైన 'N' అక్షరం అసలు రహస్యాన్ని బయటపెట్టారు. ఆ అక్షరం మరేదో కాదు 'నెట్‌ఫ్లిక్స్' అని స్పష్టం చేస్తూ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు.
నవ్వులు, ముచ్చట్లతో మెగా వినోదం
వెండితెరపై తన నటనతో ఉర్రూతలూగించిన మెగాస్టార్, ఇప్పుడు హోస్ట్ గానూ అదే స్థాయిలో ఆకట్టుకుంటారని ప్రేక్షకులు భావిస్తున్నారు. ప్రోమో చివరలో చిరంజీవి తనదైన శైలిలో "ఇది నా అడ్డా" అంటూ చెప్పిన డైలాగ్ అందరినీ విపరీతంగా ఆకర్షిస్తోంది. పలువురు సెలబ్రిటీలతో కలిసి సరదా సంభాషణలు, పాత జ్ఞాపకాలతో ఈ షో సాగనుంది.
'మెగా నోస్టాల్జియా, మెగా నవ్వులు, మెగా ముచ్చట్లు' అంటూ నెట్‌ఫ్లిక్స్ పెట్టిన క్యాప్షన్ ఈ కార్యక్రమంపై అంచనాలను రెట్టింపు చేసింది. అయితే ప్రచారంతో అదరగొడుతున్న నిర్వాహకులు స్ట్రీమింగ్ తేదీని మాత్రం ఇంకా గోప్యంగానే ఉంచారు. త్వరలోనే విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.















